చేపా... రొయ్యా పచ్చడి చెయ్య!

రొయ్యలు.. వేపుడు వేస్తే వదిలే ప్రసక్తే ఉండదు..  వీటన్నిటి రుచినీ రెండింతలు చేసే అద్భుతం ఒకటుంది. అదే ఆవకాయ! మామిడితో జట్టు కట్టిన ఆవకాయకు.. వీటితో గానీ లంకె కుదిరిందా.. ప్రతీ వారం కొత్తావకాయ రుచి చూడొచ్చు. అప్పుడు.. పచ్చడి మెతుకులు తిన్నా.. మృష్టాన్న భోజనమే అవుతుంది.

Published : 28 Jul 2019 01:16 IST

చేపలు.. పులుసులోకి బాగుంటాయ్‌.
చికెన్‌.. తందూరీ చేస్తే అదిరిపోతుంది
మటన్‌.. కుర్మాలోకి బాగా కుదురుతుంది
రొయ్యలు.. వేపుడు వేస్తే వదిలే ప్రసక్తే ఉండదు..  వీటన్నిటి రుచినీ రెండింతలు చేసే అద్భుతం ఒకటుంది. అదే ఆవకాయ! మామిడితో జట్టు కట్టిన ఆవకాయకు.. వీటితో గానీ లంకె కుదిరిందా.. ప్రతీ వారం కొత్తావకాయ రుచి చూడొచ్చు. అప్పుడు.. పచ్చడి మెతుకులు తిన్నా.. మృష్టాన్న భోజనమే అవుతుంది.

రొయ్యల పచ్చడి
మంగళూరు....

కావాల్సినవి: వలిచిన రొయ్యలు: 500గ్రా, పసుపు, ఉప్పు- తగినంత, ఆవనూనె లేదా నువ్వుల నూనె- రెండు చెంచాలు
వెనిగర్‌ మిశ్రమం  తయారీ: వెనిగర్‌- నాలుగు చెంచాలు, నీళ్లు- రెండు కప్పులు, ఉప్పు- రెండు చెంచాలు 
మసాలాకోసం: ఎండుమిర్చి- 15, ఆవాలు- రెండున్నర చెంచాలు, జీలకర్ర- రెండు చెంచాలు, పసుపు- అరచెంచా. 
తాలింపు కోసం: పచ్చిమిర్చి- మూడు, కరివేపాకు- రెండురెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు- పది, అల్లం- చిన్నముక్క, ఇంగువ- అరచెంచా, నువ్వుల నూనె- రెండు చెంచాలు
తయారీ: రొయ్యలకి పసుపు, ఉప్పు పట్టించి గంటపాటు పక్కన పెట్టేయాలి. ఒక కడాయిలో కొద్దిగా నువ్వుల నూనె తీసుకుని అందులో రొయ్యలని వేయించుకోవాలి. అవి ఉడికేటప్పుడు నీరు బయటకు వస్తుంది. ఆ నీరంతా ఇంకిపోయి దోరగా కరకరలాడేంతవరకూ రొయ్యలని వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్‌లో తీసుకుని చల్లార్చుకోవాలి. వెనిగర్‌ మిశ్రమం కోసం చెప్పిన నీళ్లు, ఉప్పు, వెనిగర్‌ మిశ్రమాన్ని ఒక్కసారి మరిగించి చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వీటిని విడివిడిగా దోరగా వేయించుకుని చల్లార్చుకుని మిక్సీలో తడి లేకుండా చూసి పసుపు, రెండు చెంచాల వెనిగర్‌ మిశ్రమం కూడా వేసి మెత్తగా పేస్ట్‌లా అయ్యేలా రుబ్బుకోవాలి. ఒక కడాయిలో నూనె వేసి అందులో ఇంగువ, కరివేపాకు, తరిగిన వెల్లుల్లి, అల్లం పలుకులు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. దీనిలో రుబ్బి పెట్టుకున్న మసాలా మిశ్రమం వేసి అందులో నూనె వేరయ్యేంతవరకూ ఆగాలి.  ఇది చల్లారిన తర్వాత వేగిన రొయ్యలు, గ్రేవీకి తగినంత వెనిగర్‌ మిశ్రమం రుచి చూసుకుని వేసుకుంటే రొయ్యల పచ్చడి సిద్ధం.

మటన్‌ పచ్చడి
రాజస్థాన్‌ పద్ధతిలో...

కావాల్సినవి: బోన్‌లెస్‌ మటన్‌- 500గ్రా, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- రెండు చెంచాలు, పసుపు, ఉప్పు- తగినంత, కారం- రెండు చెంచాలు, నూనె- రెండు కప్పులు, నిమ్మకాయలు- ఆరు(రసం తీసిపెట్టుకోవాలి), వెల్లుల్లిరేకలు- నాలుగు. 
విడిగా వేయించుకోవడానికి: మెంతులు- అరచెంచా, జీలకర్ర- అరచెంచా, కలోంజి విత్తనాలు- అరచెంచా, ధనియాలు- అరచెంచా.
తయారీ:ముందుగా మెంతులు, జీలకర్ర, కలోంజి, ధనియాలని వేయించి.. చల్లార్చుకుని మెత్తగా పొడికొట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి రేకలని మెత్తగా రుబ్బుకోవాలి. ఒక కడాయిలో శుభ్రం చేసిన మాంసం, ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి అందులోని నీరంతా పోయేంతవరకూ పొయ్యిమీద ఉంచాలి. తర్వాత.. తగినంత నూనె పోసి బాగా కరకరలాడేంతవరకూ మాంసం ముక్కలని దోరగా వేయించుకోవాలి. బాగా వేగిన మాంసం ముక్కల్లో కారం, వేయించి పొడికొట్టిన మెంతిపొడి మిశ్రమం, వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం వేసి నూనె పైకి తేలేంతవరకూ పొయ్యిమీద ఉంచాలి. మసాలాలు అడుగంటకుండా చూసుకోవాలి. పొయ్యికట్టేసి చల్లారిన తర్వాత గాజు సీసాలో పచ్చడిని భద్రపరుచుకోవాలి. తడి తగలకుండా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 

వంజరాల పచ్చడి
గోవా స్టైల్‌...

కావాల్సినవి: వంజరం చేపలు- కిలో, ఎండుమిర్చి- 25, పసుపు, నూనె- తగినంత, మిరియాలు- పది, వెనిగర్‌- రెండు కప్పులు, దాల్చినచెక్కలు- నాలుగు, పంచదార- చెంచా, వెల్లుల్లిపాయలు- ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, అల్లం- పావుకప్పు, కరివేపాకు- ఒక రెబ్బ, సన్నగా తరిగిన అల్లంవెల్లుల్లి పలుకులు- చెంచా 
తయారీ: చేపముక్కలని శుభ్రం చేసుకుని ఉప్పు, పసుపు పట్టించి కనీసం గంటపాటు పక్కనపెడితే చేపముక్కల్లోని నీరంతా బయటకు వచ్చేస్తుంది. తడి లేకుండా ముక్కలని ఆరబెట్టుకోవాలి. ఎండు మిరపకాయలని కప్పు వెనిగర్‌ వేసుకుని అరగంటముందు నానబెట్టుకోవాలి. ఆ ఎండుమిరపకాయలని, దాల్చినచెక్క, మిరియాలు, పంచదార, పసుపు, అల్లం ముక్కలు, వెల్లుల్లి పలుకులు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అవసరం అయితే వెనిగర్‌ వేసి మిక్సీ పట్టాలే కానీ నీళ్లు వెయ్యకూడదు. లోతు లేని వెడల్పాటి పెనం లేదా పాన్‌లో చేపముక్కలని రెండు వైపులా కరకరలాడేలా కాల్చుకోవాలి. ఎక్కడా పచ్చిలేకుండా చేసుకోవాలి. ఈ ముక్కలని పక్కన పెట్టుకుని ఒక కడాయిలో రెండు కప్పుల నూనె వేసుకుని అందులో కరివేపాకు, సన్నగా తరిగిన వెల్లుల్లి పలుకులు, అల్లం పలుకులు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్‌ని నూనెలో వేసి నూనె పైకి తేలేంతవరకూ మరగనివ్వాలి. చివరిగా వేయించిన చేపముక్కలని వేసుకుని పదినిమిషాల తర్వాత పొయ్యి కట్టేయాలి. తడి తగలకుండా చేస్తే ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. 

చికెన్‌ ఆవకాయ
తెలుగు వారి...

కావాల్సినవి: బోన్‌లెస్‌ చికెన్‌- కేజీ, పసుపు- అరచెంచా, ఉప్పు- తగినంత, జీడిపప్పులు- పది, బాదంపప్పులు- పది, లవంగాలు- ఐదు, యాలకులు- ఐదు, నిమ్మకాయలు- ఐదు(రసం తీసి పెట్టుకోవాలి), అల్లంవెల్లుల్లి పేస్ట్‌- మూడు చెంచాలు, కారం- ఏడు చెంచాలు
తయారీ: చికెన్‌ని శుభ్రం చేసి చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ముక్కలకి పసుపు, ఉప్పు పట్టించి అరగంటపాటు పక్కనపెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసుకుని చికెన్‌ ముక్కల్లోని నీరంతా పోయి ఎర్రని రంగులోకి వచ్చేంతవరకూ వేయించుకోవాలి. వీటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. పాన్‌లో లవంగాలు, యాలకులు పొడిగా వేయించుకుని చల్లారిన తర్వాత వాటిల్లో బాదం, జీడిపప్పులు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ముందు చికెన్‌ వేయించిన కడాయిలోనే తగినంత నూనె వేసుకుని అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించుకోవాలి. దీనిలో ముందే మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించుకుని ఇందులో మాంసం ముక్కలు, కారం, ఉప్పు వేసి పొయ్యి కట్టేయాలి. వేడి చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి కలుపుకొంటే చికెన్‌ పచ్చడి రెడీ. 

వెల్లుల్లి గుడ్డు పచ్చడి
తమిళనాడు... 

కావాల్సినవి: ఉడికించిన గుడ్లు- రెండు(తెల్లభాగం మాత్రమే), పసుపు- తగినంత, కారం- చెంచా, ఉప్పు- తగినంత, వెనిగర్‌- చెంచాన్నర, ధనియాలపొడి- చెంచా, మెంతిపొడి- పావుచెంచా, గరంమసాలా- అరచెంచా, వెల్లుల్లి రెబ్బలు-నాలుగు, ఎండుమిర్చి- రెండు, చింతపండుగుజ్జు- చెంచా లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు కలిపికొట్టిన మసాలా- పావుచెంచా, నిమ్మరసం- చెంచా.
తయారీ: ముందుగా ఉడికించిన గుడ్లలోని తెల్లభాగాన్ని చిన్నముక్కలుగా చేసుకోవాలి. పాన్‌ వేడి చేసుకుని అందులో తగినంత నూనె వేసి గుడ్డు ముక్కలని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో ఎండుమిర్చి, వెల్లుల్లిరెబ్బలు, వెనిగర్‌, ధనియాలపొడి, జీలకర్రపొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకుని అందులో ఇంగువ వేసి ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్‌ని వేసుకుని బాగా వేయించుకోవాలి. దీనిని వేయించుకున్న గుడ్డు ముక్కల్లో వేసి బాగా కలిపి అప్పుడు ఉప్పు, కారం, మెంతిపొడి, గరంమసాలా, ఉడికించుకున్న చింతపండు గుజ్జు, చివరిగా నిమ్మరసం వేసుకుంటే గుడ్డు పచ్చడి రెడీ.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని