కూకట్‌పల్లిలో.. దిబ్బరొట్టెలు, పొట్టిక్కలు!

పనసాకుల్లో చుట్టిన వేడివేడి పొట్టిక్కలు.. బొంబాయి చట్నీ కాంబినేషన్‌తో బొగ్గుల పొయ్యిపై కాల్చిన దిబ్బరొట్టెలు. కమ్మని పెసర పునుగులు.. ఇవన్నీ చెబుతుంటే సాధారణంగా కోనసీమ గుర్తుకొస్తుంది.

Updated : 07 Aug 2022 09:37 IST

పక్కా లోకల్‌!

పనసాకుల్లో చుట్టిన వేడివేడి పొట్టిక్కలు.. బొంబాయి చట్నీ కాంబినేషన్‌తో బొగ్గుల పొయ్యిపై కాల్చిన దిబ్బరొట్టెలు. కమ్మని పెసర పునుగులు.. ఇవన్నీ చెబుతుంటే సాధారణంగా కోనసీమ గుర్తుకొస్తుంది. కానీ ఇవన్నీ దొరికేది హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అంటే ఆశ్చర్యం వేస్తుంది. బొగ్గుల పొయ్యిపై కాల్చే ఈ దిబ్బరొట్టెల రుచి అమోఘం..

కూకట్‌పల్లి జేఎన్‌టీయూ నుంచీ హైటెక్‌ సిటీకి వెళ్ళే ప్రధాన రహదారి పక్కనున్న ‘స్వామి టిఫెన్‌ సెంటర్‌కి వెళ్లాల్సిందే. ఈ చిరునామా కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ రోడ్డులోకి రాగానే జనాలు గుంపులుగా నిలబడి కనిపిస్తారు. గ్యాస్‌ పొయ్యిమీద కాకుండా బొగ్గుల పొయ్యిమీదే ఇక్కడ దిబ్బరొట్టెలు కాలుస్తుంటారు. అందుకే వీటి రుచి ప్రత్యేకం. ఇలా రోజుకి మూడువందల దిబ్బరొట్టెలు అమ్ముతారంటేనే ఈ టిఫిన్స్‌కున్న ఆదరణ అర్ధం చేసుకోవచ్చు. సాయంత్రం అయిదు గంటలకు మొదలు పెడితే రాత్రి పదిన్నర, పదకొండు వరకు దిబ్బ రొట్టెలు, పొట్టిక్కలు, పెసర పునుగుల ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. పన్నెండేళ్ళ క్రితం ‘కొట్టు నాగేశ్వరరావు’ ఈ టిఫెన్‌ సెంటర్‌ ప్రారంభిస్తే ప్రస్తుతం ఆయన కొడుకులు బాబి, శ్రీనివాస్‌లు నడుపుతున్నారు. ఒకే పిండితో ఈ మూడు రకాల వంటలూ చేస్తున్నా, దేని రుచి దానిదే. పొట్టిక్కల కోసం ప్రత్యేకంగా పచ్చి పనస ఆకులతో చేసిన బుట్టలని ఆంధ్రా నుంచి తెప్పించుకుంటారు. ఈ బుట్టల్లో ఇడ్లీ పిండి వేసి ఆవిరిమీద ఉడికిస్తారు. దీన్ని అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడితో వడ్డిస్తారు. ఈ హోటల్‌లో టిఫిన్లతోపాటు ఇచ్చే పచ్చి టొమాటో పచ్చడి , కారంపొడి కూడా అదిరేపోయే రుచితో ఉంటాయని అంటున్నారు వినియోగదారులు. నూనె తక్కువగా వాడి చేయడంతో ఆరోగ్యంగానూ ఉంటాయని అంటున్నారు నిర్వాహకులు.

- వసంత్‌ ఘంటశాల, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు