...రుచి పెరుగుతుంది!

పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించినా సరే మీగడ పెరుగు లేకుండా భోజనం సంపూర్ణం కాదు చాలామందికి. భోజనం చివర్లో వడ్డించే ఈ పెరుగు.. కూరతో చేరి మొదట్లోకి వస్తే ఎలా ఉంటుంది? భేషుగ్గా ఉంటుంది.

Updated : 25 Sep 2022 06:31 IST

పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించినా సరే మీగడ పెరుగు లేకుండా భోజనం సంపూర్ణం కాదు చాలామందికి. భోజనం చివర్లో వడ్డించే ఈ పెరుగు.. కూరతో చేరి మొదట్లోకి వస్తే ఎలా ఉంటుంది? భేషుగ్గా ఉంటుంది. కూరలేమీలేనప్పుడు ఈ పెరుగుతో మ్యాజిక్‌ చేసేయొచ్చిలా.. 


దహీ తడకా

కావాల్సినవి: పెరుగు- మూడు కప్పులు, ఉడికించిన బంగాళాదుంపలు- రెండు, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- రెండు, జీలకర్ర- అరచెంచా, ఆవాలు- పావుచెంచా, ఎండుమిర్చి- మూడు, పసుపు- అరచెంచా, కారం- అరచెంచా, కొత్తిమీర తురుము- చెంచా, ఉప్పు- తగినంత, ఆవనూనె- చెంచా
తయారీ: పెరుగుని చక్కగా క్రీమ్‌లా అయ్యేలా చిలికి పక్కన పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి పాన్‌ పెట్టుకుని వేడయ్యాక.. నూనె పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకుని చిటపటలాడేంతవరకూ వేయించుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి, ఉల్లిపాయముక్కలు కూడా వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంపల ముక్కలు, పసుపు, ఉప్పు, కారం కూడా వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత పొయ్యికట్టేసి బాగా చిలికిన చిక్కని పెరుగుని ఈ కూరలో వేసుకుని కలపాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని అలంకరించుకుంటే సరి.


టొమాటో పెరుగు పచ్చడి

కావాల్సినవి: పెరుగు- అర కప్పు, టొమాటోలు- పావుకిలో, చింతపండు- 10గ్రా., పచ్చి మిరపకాయలు- 8, వెల్లుల్లి రెబ్బలు- 6, ఆవాలు- అరచెంచా, జీలకర్ర- చెంచా, సెనగ పప్పు- అర చెంచా, ఎండు మిర్చి- రెండు, కరివేపాకు- రెబ్బ, నూనె- 2 చెంచాలు, ఉప్పు- సరిపడ,
కొత్తిమీర తురుము- చెంచా

తయారీ: ముందుగా కడాయిలో నూనెవేసి కాగాక.. పచ్చి మిరపకాయల్ని వేయించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, చింతపండు వేసి చిన్నమంటపైన వాటిని నీరుపోయేంతవరకూ ఇగరనిచ్చి స్టౌ కట్టేయాలి. ఆ మిశ్రమం చల్లారాక అందులో జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. దీన్నొక పాత్రలోకి తీసుకుని ఇందులో పెరుగు వేసి కలపాలి. ఇప్పుడొక పాన్‌లో ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, సెనగపప్పు, కరివేపాకుతో తాలింపు వేసి దీన్ని టొమాటో, పెరుగు మిశ్రమంలో వేసి కలపాలి. ఇది అన్నంలోకీ, దోసెల్లోకి కూడా బాగుంటుంది.


పాలకూర రైతా

కావల్సినవి: పాలకూర కట్టలు- రెండు, పెరుగు- కప్పు, పచ్చి కొబ్బరి- అరకప్పు, పచ్చిమిర్చి- రెండు, మిరియాలు- నాలుగు, ఉప్పు- తగినంత, తాలింపు సామగ్రి: ఆవాలు- పావుచెంచా, జీలకర్ర- పావుచెంచా, సెనగపప్పు- పావుచెంచా, ఎండుమిర్చి- ఒకటి, కరివేపాకు- రెబ్బ, నూనె లేదా నెయ్యి- చెంచా,
తయారీ: పాలకూరను శుభ్రం చేసుకుని తరిగి పక్కన పెట్టుకోవాలి. ఓ పాన్‌లో నూనె వేసి వేడెక్కాక కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేయించాలి. తర్వాత పాలకూరను కూడా వేసి మూతపెట్టి ఉడకనివ్వాలి. స్టౌ కట్టేసి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇందులో కొబ్బరి తురుము, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని ఓ గిన్నెలోకి తీసుకుని అందులో పెరుగువేసి కలిపి... దీనికి పోపు పెట్టుకుంటే పాలకూర రైతా సిద్ధం.


దహీ బాంబ్స్‌

కావాల్సినవి: అన్నం- కప్పున్నర, నానబెట్టిన అటుకులు- అరకప్పు, పెరుగు- మూడు చెంచాలు, ఉడికించిన బంగాళాదుంప చిన్నది- ఒకటి, నూనె- వేయించడానికి సరిపడ, తాలింపు సామగ్రి: ఆవాలు- పావుచెంచా, కరివేపాకు-రెబ్బ, పచ్చిమిర్చి- రెండు, సన్నగా తురిమిన అల్లం- చెంచా, మినప్పప్పు- చెంచా, మెంతి గింజలు- నాలుగు, ఉప్పు, పసుపు- తగినంత,
తయారీ: అన్నం, అటుకులు, ఉడికించిన బంగాళాదుంపని ఒక పాత్రలోకి తీసుకుని మెత్తగా మెదపాలి. స్టౌ వెలిగించి పాన్‌ పెట్టి తాలింపులోకి తగినంత నూనె పోసుకోవాలి. ఆవాలు, కరివేపాకు, మినపప్పు, మెంతి గింజలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి అన్నింటినీ బాగా వేగనివ్వాలి. అర నిమిషం తర్వాత ఈ తాలింపుని అన్నం, అటుకుల మిశ్రమంలో వేసి కలిపి వాటిని చిన్నచిన్న బాల్స్‌లా చేసుకుని గంటపాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని నూనెలో దోరగా వేయించుకోవాలి. సాస్‌తోకానీ, గ్రీన్‌ చట్నీతోకానీ తింటే రుచిగా ఉంటాయి.


మసాలా పెరుగు

కావాల్సినవి: పెరుగు- ఒకటిన్నర కప్పు, నూనె- చెంచా, జీలకర్ర- చెంచా, కరివేపాకు- రెబ్బ, సన్నగా తరిగిన వెల్లుల్లి- రెండు చెంచాలు, ధనియాలపొడి- చెంచా, కారం- చెంచా, ఇంగువ- పావుచెంచా, ఉప్పు- తగినంత, పంచదార- కొద్దిగా(నచ్చితే),జీలకర్రపొడి- పావుచెంచా
తయారీ: పెరుగుని విస్కర్‌తో ముక్కముక్కలు లేకుండా క్రీమ్‌లా చిలికి ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి పాన్‌పెట్టుకుని వేడెక్కాక నూనె వేసుకోవాలి. ఇందులో జీలకర్ర వేసి వేగాక ఇంగువ వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, వెల్లుల్లి పలుకులు వేగనివ్వాలి. ఇందులో కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి  కలిపి స్టౌ కట్టేయాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసి కలపాలి. దీన్ని పరాటాలతోకానీ, చపాతీలతోకానీ కలిపి తింటే బాగుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని