కాకర రుచికర

ముదురాకుపచ్చ రంగులో నొక్కులు నొక్కులుగా ఉండే కాకరకాయని చూస్తేనే ముచ్చటేస్తుంది కదూ! చేదుగా ఉంటుందని కొందరు నాలుక చప్పరిస్తారు కానీ నిజానికి కాకరతో ఘుమఘుమలాడే వంటలు చేసి మనసులు దోచుకోవచ్చు. 

Published : 16 Jul 2023 00:19 IST

ముదురాకుపచ్చ రంగులో నొక్కులు నొక్కులుగా ఉండే కాకరకాయని చూస్తేనే ముచ్చటేస్తుంది కదూ! చేదుగా ఉంటుందని కొందరు నాలుక చప్పరిస్తారు కానీ నిజానికి కాకరతో ఘుమఘుమలాడే వంటలు చేసి మనసులు దోచుకోవచ్చు.  ఆ రుచీ పరిమళాలూ ఎంత అమోఘంగా ఉంటాయంటే..

మనకు తెలియ కుండానే నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తాం. చిన్న చిట్కాలు పాటిస్తే సరి.. చేదంతా విరిగిపోయి కమ్మటి రుచి వస్తుంది మరి. నోరూరించే కూర, మది దోచే ఇగురు, పసందైన స్వీటు, ఇడ్లీ దోశల్లోకి కారం.. ఇవన్నీ కాకరకాయలతో అద్భుతంగా చేయొచ్చు. వీటిని ప్రయత్నించారంటే ఇంకా ఇంకా కావాలని అడిగి మరీ తినేస్తారు చూడండి. కాకర రుచికరమే కాదు ఆరోగ్యపరంగా ఔషధం కూడా.


కాకర కారం

కావలసిన పదార్థాలు: కాకరకాయలు - అరకిలో, ఉప్పు - తగినంత, మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు - 2 చెంచాల చొప్పున, జీలకర్ర, నువ్వులు - చెంచా చొప్పున, చింతపండు - నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు - 8, కరివేపాకు - నాలుగు రెబ్బలు, మిరపకాయలు - 20, నూనె - 2 గరిటెలు

తయారీ: కాకరకాయలను కడిగి, తడి లేకుండా తుడిచి, తొడిమలు తీసి తురమాలి. అందులో ఉప్పు వేసి కాసేపు పక్కనపెడితే నీరు దిగుతుంది. బాణలిలో గరిటెడు నూనె వేసి పచ్చి శనగపప్పును సన్నసెగ మీద వేయించాలి. కాస్త వేగిన తర్వాత మినప్పప్పు, అది కూడా వేగాక ధనియాలు వేయాలి. మూడూ వేగాక జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తర్వాత నువ్వులు, కరివేపాకు, మిరపకాయలు వేసి కొన్ని క్షణాలు వేగనిచ్చి, ఈ దినుసులన్నీ ఒక పాత్రలోకి తీసి చల్లారనివ్వాలి. అదే బాణలిలో నూనె వేసి నీళ్లు లేకుండా తీసిన కాకరకాయ తురుమును పావుగంటసేపు చెమ్మంతా పోయి పొడిపొడిలాడేలా చక్కగా వేయించి దించాలి. దినుసులన్నీ జార్‌లో వేసి గ్రైండ్‌ చేసి అందులో ఉప్పు, వేయించిన కాకర తురుము కలిపితే సరి.. ఘుమఘుమలాడే కాకరకాయ కారం సిద్ధం. ఇడ్లీ, అట్టు, అన్నం.. ఎందులోకైనా బాగుంటుంది.


పచ్చడి

కావలసిన పదార్థాలు:  కాకరకాయలు - అరకిలో, ఇంగువ - కొద్దిగా, జీలకర్ర, మెంతులు, ఆవాలు - 2 చెంచాల చొప్పున, ఉప్పు, కారం - 3 స్పూన్ల చొప్పున, పసుపు - చెంచా, నిమ్మకాయలు - 2, ఆవనూనె - కప్పు

తయారీ: పొట్టిగా వెడల్పుగా ఉండే వాటికి బదులు పొడుగ్గా సన్నగా ఉండే తాజా కాకరకాయలను ఎంచి తెచ్చుకోవాలి. బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. మొదలు, చివర తీసేసి గుండ్రటి ముక్కలుగా తరిగి, పొడి పాత్రలో వేసి చెంచా ఉప్పు వేయాలి. కాసేపటికి అందులోంచి నీళ్లు దిగుతాయి. ఆ నీటిని తీసేసి, ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి. నీళ్లలోంచి ముక్కలను తీసి రెండు మూడు గంటలు ఎండలో శుభ్రమైన వస్త్రం మీద ఆరబెట్టాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇంగువలను గోధుమ రంగు వచ్చే వరకూ వేయించి పొడి చేసుకోవాలి. ఎండిన ముక్కలను తడి లేని జాడీలో వేసి, గ్రైండ్‌ చేసిన పొడి, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం వేసి కలిపి మూత పెట్టాలి. మూడో రోజున మూత తీసి కలిపితే పచ్చడి సిద్ధమైపోతుంది. ఇది దోశలు, అన్నం ఎందులోకైనా రుచిగా ఉంటుంది.


వేపుడు

కావలసిన పదార్థాలు: కాకరకాయలు - పావుకిలో, నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, ఉప్పు, కారం - తగినంత, కొబ్బరికోరు - 4 చెంచాలు, పసుపు - పావు చెంచా, కరివేపాకు - 2 రెబ్బలు, పంచదార - 2 చెంచాలు, ధనియాల పొడి - చెంచా, నెయ్యి - చెంచా, తాలింపు కోసం - ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ

తయారీ:  బాణలిలో నూనె వేసి తాలింపు దినుసులు, వెల్లుల్లి వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ వేసి తరిగిన కాకరకాయ ముక్కలు వేయాలి. కాస్త వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసి తిప్పి మూత పెట్టి సన్నటి సెగ మీద మగ్గనివ్వాలి. ధనియాల పొడి, కారం, పంచదార వేసి అడుగంటకుండా మధ్యలో కలియ తిప్పుతుండాలి. చివర్లో కొబ్బరికోరు వేసి కాస్త వేయించి నెయ్యి వేసి దించేస్తే సరి... ఘుమ ఘుమలాడే కాకరకాయ వేపుడు సిద్ధం.


స్వీట్‌

కావలసిన పదార్థాలు:  కాకరకాయలు - పావుకిలో, నెయ్యి - 4 చెంచాలు, పంచదార - కప్పు, కోవా - 100 గ్రాములు, ఇలాచీ పొడి - పావు స్పూన్‌, జీడిపప్పు - 15, కొబ్బరిపాలు - కప్పు

తయారీ: కాకరకాయల్లో గింజలను తీసేసి బరకగా గ్రైండ్‌చేసి బౌల్‌లోకి తీసుకోవాలి. పాన్‌లో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు వేయించి పక్కకు తీసిపెట్టుకోవాలి. అందులోనే కాకర తురుము వేసి 8 నిమిషాలు వేయించాలి. తర్వాత పంచదార, ఇలాచీ పొడి, తురిమిన కోవా వేసి కొద్దిసేపు ఉడికించి కొబ్బరిపాలు, వేయించిన జీడిపప్పు వేసి రెండు నిమిషాలు సన్న సెగ మీద మగ్గనిస్తే సరి.. తీయని కాకరకాయ స్వీట్‌ సిద్ధం.


టొమాటోతో

కావలసిన పదార్థాలు: కాకరకాయలు - పావుకిలో, టొమాటోలు - పావు, ఉల్లిపాయలు - 2, నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, ఉప్పు, కారం - తగినంత, నువ్వులపొడి - 4 చెంచాలు, పసుపు - పావు చెంచా, చింతపండు - కొద్దిగా, కరివేపాకు - 2 రెబ్బలు, తాలింపు కోసం - ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ

తయారీ: కాకరకాయలు కాస్త పెద్ద ముక్కలుగా కోసి కొద్దిగా రాళ్ల ఉప్పు, కాస్త పసుపు, చింతపండు వేసి నాలుగు నిమిషాల పాటు ఉడికిస్తే చేదు విరుగుతుంది. ఆ నీళ్లు పారబోసి చింతపండు రెబ్బలు తీసేయాలి. మూకుట్లో తాలింపు వేసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాక.. టొమాటో ముక్కలు వేయాలి. అవి కాస్త మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి కొంతసేపు వేగనివ్వాలి. కొంచెం ఎసరు వేసి మరికాసేపు సన్నసెగలో ఉంచి నువ్వులపొడి, పసుపు, ఉప్పు, కారం వేసి నిమిషం తర్వాత దించేస్తే సరిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని