పచ్చిమామిడితో...మెచ్చేలా!

మామిడికాయ... పేరు వింటుంటేనే ఆ పుల్లదనం గుర్తొచ్చి నోట్లో నీళ్లూరుతున్నాయి కదూ...

Updated : 15 Jun 2021 14:22 IST


 

మామిడికాయ... పేరు వింటుంటేనే ఆ పుల్లదనం గుర్తొచ్చి నోట్లో నీళ్లూరుతున్నాయి కదూ... దీంతో శాకాహార... మాంసాహార వంటలు ఏవి వండినా రుచి అదిరిపోవాల్సిందే. ఇంకెందుకాలస్యం మీరూ ప్రయత్నించండి మరి. 
పులిహోర
కావాల్సినవి: పొడిపొడిగా ఉడికించిన అన్నం- అరకేజీ, మధ్యస్థంగా ఉండే మామిడికాయలు- రెండు, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- రెండు రెమ్మలు, ఉప్పు- తగినంత, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి- పది, పసుపు- టీస్పూన్, వేరుసెనగపప్పు- మూడు టేబుల్‌ స్పూన్లు, సెనగపప్పు- రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు, జీలకర్ర- టీస్పూన్‌ చొప్పున. 
తయారీ: మామిడికాయలను కడిగి చెక్కు తీసి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి వేరుసెనగపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ నూనెలోనే జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. దీంట్లోనే మామిడి తురుము, పసుపు వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాలపాటు వేయించిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి. మామిడి తురుమును పచ్చివాసన పోయేంత వరకు తక్కువ మంట మీద వేయించాలి. దీంట్లో అన్నం వేసి జాగ్రత్తగా కలపాలి. 

మామిడికాయ చికెన్‌ ఫ్రై 
కావాల్సినవి: చికెన్‌- అరకేజీ, మామిడికాయ- ఒకటి, వేయించిన జీడిపప్పు- గుప్పెడు, పేస్టు చేసిన ఉల్లిపాయలు- రెండు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి- మూడు, కరివేపాకు- రెండు రెమ్మలు, అల్లంవెల్లుల్లి పేస్టు, కారం- రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున, ఉప్పు- తగినంత, పసుపు- టీస్పూన్, ధనియాలపొడి, గరం మసాలా- టీస్పూన్‌ చొప్పున, కొత్తిమీర తరుగు- కొద్దిగా.
తయారీ: మామిడికాయను చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. చికెన్‌ను శుభ్రంగా కడిగి పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, కారం వేసి చిన్న మంట మీద మగ్గించాలి. చికెన్‌లోని నీళ్లు పూర్తిగా ఇగిరిపోయేంత వరకు మధ్యమధ్యలో కదుపుతూ ఉండాలి. కడాయిలో నూనె వేడిచేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. దీంట్లో పసుపు, ధనియాలు, గరంమసాలాపొడి, కారం, ఉప్పు వేసి గ్లాసు నీళ్లు పోసి బాగా కలపాలి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసి ఉడికించాలి. అవసరమైతే కొంచెం నీళ్లు పోయాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగు, మగ్గబెట్టిన చికెన్‌ వేసి తక్కువ మంట మీద పావుగంటపాటు ఉడికించాలి. ఇలాచేస్తే మసాలా ముక్కలకు బాగా పడుతుంది. ఉప్పు సరిచూసుకుని వేయించిన జీడిపప్పు కలిపి ఫ్రై దగ్గర పడిన తర్వాత దించేయాలి. చివరగా కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర తరుగు పైన చల్లి మూతపెట్టి తిరిగి ఐదు నిమిషాలపాటు మగ్గించాలి. 

మామిడికాయ పచ్చిపులుసు
కావాల్సినవి: మామిడికాయ- ఒకటి, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, బెల్లం తరుము- కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, ఇంగువ- చిటికెడు, ఎండుమిర్చి- రెండు, ఉప్పు, కారం- తగినంత, పసుపు- చిటికెడు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, కరివేపాకు- రెండు రెమ్మలు, ఆవాలు, జీలకర్ర- టీస్పూన్‌. 
తయారీ: ఎండుమిర్చి, వెల్లుల్లిని దంచి పక్కన పెట్టుకోవాలి. మామిడికాయను చెక్కు తీసి ఉడికించి గుజ్జులా చేసుకోవాలి. దీంట్లో కొన్ని నీళ్లు పోయాలి. ఇందులోనే పచ్చిఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, సరిపడా ఉప్పు, వెల్లుల్లి ఎండుమిర్చి కారం, బెల్లం తరుము వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, వెల్లుల్లి కారం వేసి తాలింపు పెట్టాలి. దీన్ని పచ్చిపులుసులో కలపాలిగానీ పచ్చిపులుసును వేడిచేయకూడదు. 

చేపల పులుసు
కావాల్సినవి: చేపలు- అరకేజీ, చెక్కు తీయకుండా చిన్న ముక్కలుగా కోసిన మామిడికాయ- ఒకటి, చింతపండు రసం- పావుకప్పు, టొమాటో ప్యూరీ- రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుకొబ్బరి- టేబుల్‌స్పూన్, ధనియాల పొడి, కారం- రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున, ఉప్పు- తగినంత, పసుపు- టీస్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు- రెండు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి- మూడు, అ్లలంవెల్లుల్లి పేస్టు- టేబుల్‌స్పూన్, మెంతిపొడి- టీస్పూన్‌. 
తయారీ: చేప ముక్కల్ని కాస్త ఉప్పువేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడాయిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. దీంట్లో టొమాటో, మామిడికాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, ధనియాలపొడి వేయాలి. తర్వాత చేపముక్కలను జాగ్రత్తగా వేసి చింతపండు రసం, కొంచెం నీళ్లు పోసి పది నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. పైన కొత్తిమీర తరుగు వేసి మూత లేకుండా ఉడికించాలి. చివరగా ఎండుకొబ్బరి, మెంతిపొడి వేసి దించేయాలి. మూత లేకుండా ఉడికించడం వల్ల కూరకు నీచు వాసన ఉండదు. 

బోటీ
కావాల్సినవి: రెండుమూడుసార్లు శుభ్రంగా కడిగిన బోటీ- అరకేజీ, మామిడికాయ- ఒకటి, పచ్చిమిర్చి- మూడు(నిలువుగా చీల్చాలి), ఉల్లిపాయలు- రెండు(చిన్నముక్కలు), అల్లంవెల్లుల్లి పేస్టు, కారం- రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున, ఉప్పు- రుచికి సరిపడా, గరం మసాలాపొడి- టీస్పూన్, ధనియాల పొడి- రెండు టీస్పూన్లు, పసుపు- టీస్పూన్, కరివేపాకు- రెమ్మ, కొత్తిమీర తరుగు- కొద్దిగా. 
తయారీ: బోటీలో గ్లాసు నీళ్లు పోసుకుని ఐదు నిమిషాలపాటు ఉడికించుకున్నాక నీళ్లు లేకుండా వేరే పాత్రలోకి తీసుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు చివరగా అల్లంవెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత ఉడకబెట్టిన బోటీని కలపాలి. ఇప్పుడు కారం, ధనియాలు, జీలకర్ర, గరంమసాలా పొడి, ఉప్పు వేసి ఐదు నిమిషాలపాటు మగ్గించాలి. గ్లాసున్నర నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. పూర్తిగా మగ్గాక మామిడికాయ ముక్కలు వేసి మూతపెట్టాలి. చివరగా కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసి మరో ఐదు నిమిషాలపాటు మంటమీదే ఉండనివ్వండి.  వేడివేడి అన్నంలోకి ఈ కూర చాలా బాగుంటుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని