చేపా.. రొయ్యా.. అదిరిందయ్యా!

ఇంతవరకూ వేసవికాలం పేరుచెప్పి సొరకాయలు, బీరకాయలతో సరిపెట్టుకున్నాం. ఇదేమో చేపలు, రొయ్యలు సమృద్ధిగా దొరికే కాలం. ఊరకనే ఉంటామా? నాన్‌వెజ్‌ రుచులని ఓ పట్టు పట్టేద్దాం. వర్షాకాలానికి సీఫుడ్‌తో స్వాగతం పలికేద్దాం...

Updated : 18 Jun 2023 01:19 IST

ఇంతవరకూ వేసవికాలం పేరుచెప్పి సొరకాయలు, బీరకాయలతో సరిపెట్టుకున్నాం. ఇదేమో చేపలు, రొయ్యలు సమృద్ధిగా దొరికే కాలం. ఊరకనే ఉంటామా? నాన్‌వెజ్‌ రుచులని ఓ పట్టు పట్టేద్దాం. వర్షాకాలానికి సీఫుడ్‌తో స్వాగతం పలికేద్దాం...


ఫిష్‌ బిర్యానీ

కావాల్సినవి: వైట్‌ పాంప్లెట్‌- కేజీ, ఉల్లిపాయలు- అరకేజీ, పచ్చిమిర్చి- 50గ్రా, అల్లం, వెలుల్లిపేస్ట్‌- 50గ్రా, నిమ్మకాయలు- 2, కొత్తిమీర తరుగు- కప్పు, పెరుగు- కప్పు, ఉప్పు- తగినంత,
బియ్యం- కేజీ, నెయ్యి- 4 చెంచాలు, నూనె- అరకప్పు, టొమాటో- అరకిలో, పసుపు- అర చెంచా, జీడిపప్పులు- 10, ఎండు ద్రాక్షలు- 2 చెంచాలు, నీళ్లు- బియ్యానికి తగ్గట్టు, యాలకులు- 3, లవంగాలు- 3, దాల్చినచెక్క- చిన్నది, గరంమసాలా- అరచెంచా

తయారీ: బాణలిలో అరకప్పు నూనె వేసి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్‌లను వేయించి పక్కన పెట్టాలి. అదే నూనెలో రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో చేప ముక్కల్ని వేయించి అవీ పక్కన పెట్టాలి. మిగిలిన ఉల్లిపాయల్ని బ్లెండర్లో మెత్తగా రుబ్బాలి. అడుగు మందంగా ఉండే పాత్రలో నూనె వేసి.. ఉల్లిపాయపేస్ట్‌ని బాగా వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి మరో 3 నిమిషాలు వేపాక పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, పెరుగు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి నీరు ఆవిరయ్యే వరకు ఉడికించాలి. దానిలో వేయించి పెట్టుకున్న చేపముక్కలు, కొత్తిమీర, నిమ్మకాయ రసం వేసి నెమ్మదిగా కలపాలి. వేరొక గిన్నెలో  2 చెంచాల నెయ్యి వేసి.. దాంట్లో యాలకులు, దాల్చినచెక్క వేసి వేయించాలి. కడిగిన బియ్యాన్ని నీరు లేకుండా వడకట్టి వేయాలి. 4 గ్లాసుల నీరు, ఉప్పు వేసి పెద్ద మంటపై నీరు అవిరయ్యేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకుని.. ముందు ఒక పొర ఉడికించిన అన్నాన్ని వేయాలి. తర్వాత తయారు చేసి పెట్టుకున్న చేపముక్కలు, కొన్ని వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, ఎండుద్రాక్షలు మళ్లీ అన్నం వేసుకుని పైనుంచి కొత్తిమీర, కొద్దిగా రోజ్‌ వాటర్‌, 2 చెంచాల నెయ్యి వేసుకొని పాత్రకు మూతపెట్టి 30 నిమిషాలు సన్న సెగ మీద బిర్యానీ దమ్‌లో ఉంచాలి. అంతే వేడి వేడి ఫిష్‌ బిర్యానీ సిద్ధం.


రొయ్యల మసాలా ఫ్రై

కావాల్సినవి: శుభ్రం చేసిన రొయ్యలు- 250 గ్రా, పసుపు- పావు చెంచా, ఉల్లిపాయ పేస్ట్‌ కోసం: ఉల్లిపాయలు- 2, పచ్చిమిర్చి-4, అల్లం- అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు- 8
మసాలా కోసం: నూనె- పావుకప్పు, కరివేపాకు- రెండు రెబ్బలు, కారం- చెంచా, ధనియాలపొడి- చెంచా, జీలకర్ర పొడి- చెంచా, ఉప్పు- తగినంత, గరంమసాలా- అరచెంచా

తయారీ: శుభ్రం చేసిన రొయ్యల్లో ఉప్పు, పసుపు వేసి అరగంట పక్కన పెట్టేయాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చీని మిక్సీలో మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. ఒక పాన్‌ తీసుకుని కొద్దిగా నూనె పోసి.. రొయ్యలని నీరు పోయేంత వరకూ సగం ఉడకనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఈసారి పాన్‌లో కొద్దిగా ఎక్కువ నూనె పోసి కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్‌ వేసి, నూనె పైకి తేలే వరకు సన్న సెగ మీద వేయించాలి. తర్వాత కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి, ఉప్పు, అవసరమైన నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఈ గ్రేవీలో వేయించిన రొయ్యలను వేసి చిక్కబడనివ్వాలి. చివరిగా గరంమసాలా, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుంటే మసాలాఫ్రై సిద్ధం.


బోన్లెస్‌ ఫిష్‌ ఫ్రై

కావాల్సినవి:  బోన్లెస్‌ చేప- 400గ్రా, నిమ్మరసం- చెంచా, అల్లం వెల్లులి పేస్ట్‌- చెంచా, కొత్తిమీర తరుగు- చెంచా, ఉప్పు- తగినంత, వాము- అర చెంచా, వేయించిన జీలకర్ర పొడి- ముప్పావు చెంచా, గరం మసాలా- అరచెంచా, కారం- చెంచా, పసుపు- అరచెంచా, సెనగపిండి- నాలుగు చెంచాలు, బియ్యప్పిండి- చెంచా, నీళ్లు- నాలుగు చెంచాలు, నూనె- వేయించడానికి సరిపడ

తయారీ: నూనె తప్పించి చేపముక్కలకి తక్కిన పదార్థాలని బాగా పట్టించి ఓ గంట నానబెట్టాలి. మూకుడులో నూనె పోసుకొని వేడయ్యాక నూనెలో చేపముక్కలు వేసి సన్నమంట మీద రెండువైపులా ఎర్రగా వేయించి తీసుకోవాలి. చేప ముక్కలు పుదీనా చట్నీ లేదా టొమాటో చట్నీతో చాలా రుచిగా ఉంటుంది.


చేపల పులుసు

కావాల్సినవి:  చేప మసాలా కోసం: ధనియాలు- చెంచా, ఎండుమిర్చి-10, మెంతులు- అరచెంచా, వెల్లుల్లి- 10 పులుసు కోసం: చేప ముక్కలు (కొరమీను)- 500గ్రా, నూనె- అరకప్పు, కరివేపాకు- రెండు రెబ్బలు, ఉల్లిపాయలు- 2, పచ్చిమిర్చి- 4, అల్లం వెల్లులి పేస్ట్‌- చెంచా, ఉప్పు- తగినంత, పసుపు- అరచెంచా, కారం- చెంచా, ధనియాల పొడి- చెంచా, టొమాటో ముక్కలు- పావుకప్పు, నీళ్లు- అర లీటర్‌, చింతపండు రసం- 200ఎం.ఎల్‌, కొత్తిమీర- చిన్నకట్ట

తయారీ: మసాలా పొడి కోసం.. సన్న సెగ మీద పదార్థాలని సువాసన వచ్చేదాకా వేపి మెత్తగా పొడి చేసుకోవాలి. మిక్సీలో ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. మూకుడులో నూనె వేసి అందులో కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్‌ వేసి బంగారు రంగు వచ్చేంతవరకూ వేపాలి. ఉప్పు, అల్లం వెల్లులి ముద్ద కూడా వేసి వేపాలి. తర్వాత పసుపు, ధనియాలపొడి, కారం కూడా వేసి వేగాక.. చింతపండు రసం, నీళ్ళు పోసి మరగనివ్వాలి. అందులో చేప ముక్కల్ని సర్ది సన్నని సెగ మీద నూనె పైకి తేలేదాకా మరగనివ్వాలి. 10 నిమిషాలకి పులుసు చిక్కబడి నూనె తేలుతుంది. అప్పుడు కొత్తిమీర, మసాలా పొడి వేసి ముక్క చెదరకుండా మరో 5 నిమిషాలు మరిగిస్తే చేపల పులుసు తయార్‌.


ఎండు రొయ్యలు, టొమాటో పచ్చడి

కావాల్సినవి:  ఎండు రొయ్య పొట్టు- కప్పు, వెల్లులి- పది, టొమాటోలు- పావుకిలో, ఉల్లిపాయ ముక్కలు- కప్పు, పచ్చిమిర్చి- నాలుగు, ఎండు మిర్చి-5, ఆవాలు- చెంచా, మినపప్పు- చెంచా,  పసుపు- పావుచెంచా, ధనియాల పొడి- రెండు చెంచాలు, కారం- రెండు చెంచాలు, ఉప్పు- రుచికి సరిపడ, కరివేపాకు- రెండు రెబ్బలు, నూనె- ముప్పావుకప్పు

తయారీ: రొయ్య పొట్టుని మూకుడులో వేసి మీడియం ఫ్లేమ్‌ మీద కలుపుతూ 2-3 నిమిషాలు సెగ తగిలేలా వేపితే రొయ్యకి ఉండే సన్నని పొట్టు ఊడుతుంది. ఆ రొయ్యలని జల్లెడలో వేసి నీళ్ళు పోసి కడగాలి. వెల్లుల్లిని దంచుకోవాలి. కడిగిన రొయ్యల్లో నూనె, ఉప్పు, దంచిన వెల్లుల్లి వేసి బాగా కలపాలి. రొయ్యలు పాన్‌లో వేసి పొయ్యి మీద పెట్టి 3-4 నిమిషాలు కలుపుతూ వేపి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనెపోసి అందులో టొమాటోలు వేసి మూతపెట్టి సన్నమంట మీద మధ్యమధ్యన కలుపుతూ మగ్గించుకోవాలి. అందులో మిగిలిన నూనె వేసి వేడెక్కాక ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసి ఆ తాలింపులో.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తగా మగ్గనివ్వాలి. ఉప్పు, ధనియాలపొడి, కారం, టొమాటో గుజ్జు వేసి నూనె పైకి తేలేదాక మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌ మీద మగ్గనివ్వాలి. నూనె పైకి తేలాక వేపిన రొయ్య పొట్టు వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. నూనెపైకి తేలితే పచ్చడి సిద్ధం. ఇది కనీసం వారం రోజులు నిల్వ ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని