నింగిలో హరివిల్లు నేలపై వరివిల్లు

‘నింగి నవ్వితే తొలకరి... మట్టి నవ్వితే పరమాన్నం’... మన మట్టి మనకి తెల్లని మల్లెపువ్వులాంటి బియ్యాన్ని మాత్రమే ఇచ్చిందనుకొంటే పొరపాటు. మన పళ్లెం హరివిల్లు వర్ణాలతో నిండిపోయేలా ఎరుపు, తెలుపు, పచ్చ అంటూ... వివిధ వర్ణాల్లో, వైవిధ్యమైన రుచులతో లెక్కలేనన్ని పోషకాలతో బోలెడు వరి రకాలని కానుకగా అందించింది. పాకశాస్త్ర పండితులు వాటితో అద్భుతమైన అన్నరుచులు వండి వారుస్తూ వారెవ్వా అనిపిస్తున్నారు...

Published : 25 Feb 2018 01:55 IST

నింగిలో హరివిల్లు నేలపై వరివిల్లు

‘నింగి నవ్వితే తొలకరి... మట్టి నవ్వితే పరమాన్నం’...
మన మట్టి మనకి తెల్లని మల్లెపువ్వులాంటి బియ్యాన్ని మాత్రమే ఇచ్చిందనుకొంటే పొరపాటు. మన పళ్లెం హరివిల్లు వర్ణాలతో నిండిపోయేలా ఎరుపు, తెలుపు, పచ్చ అంటూ... వివిధ వర్ణాల్లో, వైవిధ్యమైన రుచులతో లెక్కలేనన్ని పోషకాలతో బోలెడు వరి రకాలని కానుకగా అందించింది.
పాకశాస్త్ర పండితులు వాటితో అద్భుతమైన అన్నరుచులు వండి వారుస్తూ వారెవ్వా అనిపిస్తున్నారు....

ప్రపంచవ్యాప్తంగా 1,40,000 వరి రకాలుండగా... ఇందులో మనకు తెలిసినవి వేళ్లమీద లెక్కపెట్టగలిగే అన్ని మాత్రమే.  వీటిని కాపాడుకునేందుకు ‘సేవ్‌దిరైస్‌’ఉద్యమం ఊపందుకుంటోంది.
పూరి జగన్నాథునికి వండిన బియ్యంతో వండకుండా అన్న ప్రసాదాలు వండేవారట. ఇలా పన్నెండేళ్ల తర్వాత మాత్రమే వండిన బియ్యంతో మళ్లీ వండేవారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.. మన దగ్గర ఎన్నిరకాల వరి వంగడాలు ఉండేవో!

బయ్యం దుకాణానికి వెళ్తే... సన్నబియ్యం, దొడ్డు బియ్యం అని అడగడం తప్ప మనలో చాలామందికి  బియ్యాల పేర్లుకానీ, వాటి రంగు.. పోషకాల గురించి కానీ ఆట్టే తెలియవు. అయితే ఈ మధ్యకాలంలో అధికబరువు, మధుమేహం వంటి అనారోగ్య కారణాలతో చాలామంది అతిగా చిత్రిక పట్టిన తెల్లని అన్నానికి బదులు పోషకాలు నిండుగా ఉండే ఇతరత్రా బియ్యాలవైపు మొగ్గుచూపుతున్నారు. కొర్రబియ్యం, బ్రౌన్‌రైస్‌ వంటివాటితోపాటు యాంటిఆక్సిడెంట్లు అధికంగా ఉండే నల్లబియ్యం, ఇనుము అధికంగా ఉండే ఎర్రబియ్యం, రోజ్‌మట్టా బియ్యం, పచ్చగా ఉండే జేడ్‌పెరల్‌ వంటి వాటివైపు మొగ్గు చూపుతున్నారు. హోటళ్లు మరో అడుగు ముందుకేసి.. ఈ రంగు బియ్యాలతో చక్కని రుచులు వండివారుస్తున్నాయి.

అమర్‌..అక్బర్‌..ఆంటోని
రకరకాల వంటకాలు చూసుంటారు కానీ.. ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ వంటని ఎప్పుడైనా చూశారా? వినికూడా ఉండరు. హైదరాబాద్‌లోని టెర్రాసెన్‌ కేఫ్‌లో దొరుకుతుందీ వంటకం. పేరేంటి ఇలా విచిత్రంగా... అంటారా? మూడురకాల బియ్యంతో వండివార్చారు కాబట్టే దీనికాపేరు అంటున్నారు నిర్వహకులు. అలాగే నల్ల బియ్యంతో చేసిన స్వీట్లని హోటళ్లలో ప్రత్యేకంగా అందిస్తున్నారు. కొర్రబియ్యంతో చేసిన అన్నం, మురుకులు... ఎర్రబియ్యంతో చేసే పుట్టు, చిరుతిళ్లకి డిమాండ్‌ పెరుగుతోంది. ముదురు రంగులో ఉండే బియ్యంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో పోషకాహార నిపుణులు కూడా వాటిని తినమనే చెబుతున్నారు.

నేరేడులో కంటే నల్లబియ్యంలో

నల్లబియ్యమా... అవి మనకీ దొరుకుతాయా అనే అనుమానం వద్దు. మన దక్షిణాదిలో గోధుమ, ఎరుపు, నలుపు వర్ణాల్లోని బియ్యాలు పుష్కలంగా దొరుకుతాయి. రంగులో ఏముంది అనుకోవడానికి లేదు. తెల్లనిబియ్యంతో పోలిస్తే ముదురు రంగు బియ్యంలో పోషకాలు మెండు. ముదురు గోధుమవర్ణంలో ఉండే బియ్యంలో... వ్యాధి నిరోధకశక్తిని పెంచే బి6 అధికంగా ఉంటుంది. దీని లోగ్లైసిమిక్‌ ఇండెక్స్‌ కారణంగా నిదానంగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా చూస్తుంది. నేరేడులో కంటే యాంతోసియానిన్లు ఇందులోనే అధికం. ఎరుపురంగు బియ్యంలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఎముక బలానికి మేలుచేస్తాయి. లేత పచ్చరంగులో ఉండే జేడ్‌పెరల్‌ బియ్యానికి చక్కని పరిమళంతోపాటూ పోషకాలూ ఎక్కువే.
నల్లబియ్యాన్ని ఆంగ్లంలో ‘ఫర్‌బిడెన్‌’ రైస్‌ అంటారు. ఈ బియ్యాన్ని అన్నంగా వండటానికంటే స్వీట్ల తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. తమిళనాడు ప్రాంతంలో ఈ నల్లబియ్యం పుష్కలంగా లభిస్తుంది. ఈ బియ్యంతో చేసే స్వీట్‌కి చెట్టినాడు స్వీట్‌ అని పేరు.

చెట్టినాడు మిఠాయి

కావల్సినవి: నల్ల బియ్యం- కప్పు, నీళ్లు- రెండున్నర కప్పులు, నెయ్యి- తగినంత, కొబ్బరి తురుము- కప్పు, పంచదార- తగినంత, యాలకులు- రెండు
తయారి: కుక్కర్‌లో కప్పుకి రెండున్నర కప్పుల నీళ్లు పోసి ్లబియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. గరిటెతో పప్పు మెదిపినట్టుగా మెదిపి... పంచదార వేసి బాగా కలపాలి. ఆపై కొబ్బరికోరు నెయ్యి వేసి కలియతిప్పాలి. దీనికి ఐస్‌క్రీం చక్కని కాంబినేషన్‌. సాధారణ వరిరకాలతో పోలిస్తే ఈ బియ్యంలో ఐరన్‌, విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటాయి. నల్లబియ్యం రక్తహీనతని తగ్గించడంతోపాటు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
జీరగసంబ దీన్నే సీరగసంబ అని కూడా అంటారు. జీలకర్రలా సన్నగా ఉండే బియ్యం అని అర్థం. మనం బిర్యాని కోసం బాస్మతి బియ్యాన్ని వాడినట్టుగా... కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో ఈ బియ్యాన్ని వాడతారు. చాలా రుచిగా ఉంటుంది. దీనినే ఆంబూర్‌ బిర్యానీ అని, దిండిగల్‌ బిర్యాని అని, తలపాకట్టు బిర్యాని అని అంటారు.

దిండిగల్‌ బిర్యాని
ఈ బిర్యానికోసం.. నెయ్యి- రెండు చెంచాలు, నూనె- మూడు చెంచాలు, జీరాసంబా బియ్యం- రెండుకప్పులు, ఉల్లిపాయ- 1(ముక్కు నిలువుగా తరిగినవి), పచ్చిమిర్చి- మూడు, అల్లంవెల్లుల్లిపేస్ట్‌- మూడు చెంచాలు, కారం- చెంచాన్నర, పసుపు- కొద్దిగా, కొత్తిమీర తరుగు- పావుకప్పు, పుదీనా- గుప్పెడు, కొబ్బరి పాలు-కప్పు, నీళ్లు- రెండు కప్పులు, ఉప్పు- తగినంత
చికెన్‌ మారినేషన్‌ కోసం : చికెన్‌- అరకిలో, పెరుగు- కప్పు, కారం- చెంచా, ఉప్పు- తగినంత, బిర్యానిమసాల- చెంచాన్నర(తాజాగా అప్పటికప్పుడు చేసుకుంటే మంచిది). ముందుగా చికెన్‌కి పెరుగు, కారం, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
బియ్యాన్ని అరగంట ముందే నానబెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె, నెయ్యి వేసుకుని అందులో ఉల్లిపాయ తరుగు, మిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. దీనికి అల్లంవెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. ఇందులో పసుపు, కారం, మసాలపొడి వేసి వేయించి.. దీనికి మారినేట్‌ చేసిన మాంసాన్ని కూడా వేసి రంగు మారేంతవరకూ ఉంచి మూతపెట్టేయాలి. సగం ఉడికిన తర్వాత దానిని కుక్కర్‌లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసుకుని దానిలో బియ్యం వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని కూడా కుక్కర్‌లోకి మార్చుకుని కొబ్బరిపాలు, నీళ్లు పోసుకుని ఉప్పువేసి మూతపెట్టేయడమే. మూడు కూతలు వచ్చిన తర్వాత వేడివేడిగా ఆంబూర్‌ లేదా దిండిగల్‌ బిర్యాని రుచి చూడండి. అదరహో అనిపిస్తుంది.
రోస్‌మట్టా  బియ్యం చూడ్డానికి లావుగా, దొడ్డుగా ఉంటాయి. రోస్‌మట్టా బియ్యాన్నే పాలక్కాడ్‌ బియ్యం అని కూడా అంటారు. రోస్‌మట్టా అన్నం తినేవారిలో టైప్‌-2 మధుమేహం అదుపులో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె నాళాల్లో ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి. రోగనిరోధకశక్తిని పెంచే బి విటమిన్‌ లోపం తలెత్తదు.

రోస్‌మట్టా లెమన్‌ రైస్‌

కావల్సినవి: రోస్‌మట్టా అన్నం- రెండు కప్పులు, నిమ్మరసం- మూడు చెంచాలు, పల్లీలు- పావుకప్పు, సాంబార్‌ ఉల్లి(చిన్నవి)- రెండు(ఇష్టం ఉంటే), ఎండుమిరప- రెండు, పచ్చిమిర్చి- ఒకటి, పసుపు- కొద్దిగా, ఆవాలు, సెనగపప్పు, కరివేపాకు, మినపప్పు, ఇంగువ, నువ్వుల నూనె- చెంచా, నూనె- చెంచాన్నర, ఉప్పు- తగినంత
తయారీ: ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. ఆపై ఉల్లిపాయలు ముక్కలు కూడా వేయాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, పల్లీలు వేసి వేయించుకోవాలి. దీనిలో ఉడికించి పెట్టుకున్న రోస్‌మట్టా లెమన్‌రై, ఉప్పు వేసి కలపాలి. చివరిగా నువ్వుల నూనె వేసుకుని కలియతిప్పుకోవాలి.


 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని