ఇడ్లీ.. డోక్లా..రహే హమారా!

మనందరికీ ఇష్టమైన ఫలహారాలు ఇడ్లీ, ఉప్మా. ఎక్కువమంది, ఎక్కువసార్లు అవే తింటాం. కొబ్బరిపచ్చడి, సాంబార్‌లతో ఇడ్లీ ఆహా అనిపిస్తే.. అల్లం, మిర్చి, జీడిపప్పులతో ఉప్మా వహ్వా అనిపిస్తుంది

Updated : 13 Aug 2023 04:51 IST

మనందరికీ ఇష్టమైన ఫలహారాలు ఇడ్లీ, ఉప్మా. ఎక్కువమంది, ఎక్కువసార్లు అవే తింటాం. కొబ్బరిపచ్చడి, సాంబార్‌లతో ఇడ్లీ ఆహా అనిపిస్తే.. అల్లం, మిర్చి, జీడిపప్పులతో ఉప్మా వహ్వా అనిపిస్తుంది. దేనికదే సాటి. ఉప్మాకి కొంచెం దగ్గరగా ఉండే డోక్లా పేరు చెప్పినా నోట్లో నీళ్లూరుతాయి. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ ఇడ్లీ, డోక్లా ఆరగించండి!


ఆరెంజ్‌ డోక్లా

కావలసిన పదార్థాలు
ఉప్మారవ్వ - 2 కప్పులు, అల్లంముద్ద - అరచెంచా, పచ్చిమిర్చి - 4, నూనె - 2 చెంచాలు, తాజా నారింజ రసం - పావు కప్పు, పెరుగు - అర కప్పు, నీళ్లు - అరకప్పు, బేకింగ్‌ సోడా - చెంచా, ఉప్పు - తగినంత, నూనె - టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర తరుగు - కొద్దిగా, ఆవాలు, నువ్వులు - చెంచా చొప్పున, కరివేపాకు - 2 రెబ్బలు, ఇంగువ - చిటికెడు

తయారీ
కాస్త పెద్ద గిన్నెలో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, ఉప్పు, నూనె వేసి కలపాలి. అందులో ఉప్మా రవ్వ, పెరుగు, కొన్ని నీళ్లు పోసి ఉండ కట్టకుండా మృదువుగా వచ్చేలా మరోసారి కలిపి అరగంట నానబెట్టాలి. ఈలోగా కుక్కర్‌లో గ్లాసు నీళ్లు పోసి 5 నిమిషాలు మరిగించండి. డోక్లా ట్రే / పాన్‌ మీద నూనెతో గ్రీజ్‌ చేయండి. ఆరెంజ్‌ జ్యూస్‌లో బేకింగ్‌ సోడా, నానబెట్టిన డోక్లా రవ్వ పిండి కలిపి మిశ్రమం చేయాలి. ఈ పిండితో ఇడ్లీలు వేసి 12 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌ మీద ఉడికించాలి. కడాయిలో నూనె కాగిన తర్వాత ఆవాలు, ఇంగువ, నువ్వులు, కరివేపాకులతో తాలింపు వేయాలి. డోక్లాపై తాలింపు పరిచినట్లుగా సమంగా సర్ది కొత్తిమీర తరుగు చల్లండి. రుచికరమైన ఆరెంజ్‌ డోక్లా సిద్ధం.


రవ్వ ఇడ్లీ

కావలసిన పదార్థాలు
రవ్వ, మందపాటి అటుకులు, పెరుగు - కప్పు చొప్పున, ఉప్పు - తగినంత, వంట సోడా - అరచెంచా, నీళ్లు - అరకప్పు
తయారీ
అటుకులు కడిగి అరగంట నానబెట్టండి. పెరుగులో వంటసోడా, రవ్వ వేసి బాగా కలిపి 30 నిమిషాలు నాననివ్వండి. నానిన అటుకుల్లో కొన్ని నీళ్లు పోసి మెత్తగా మెదపండి. రవ్వలో అటుకుల పేస్టు, ఉప్పు వేసి బాగా కలపండి. అవసరమైతే కొద్దిగా నీరు జోడించండి. ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసి, పెద్ద సెగ మీద 5 నిమిషాలు, సన్న సెగ మీద మూడు నిమిషాలు ఉడికించండి. మల్లెపూల లాంటి వేడివేడి ఇడ్లీలు మీకు నచ్చిన చట్నీతో ఆస్వాదించండి.


పాలక్‌ డోక్లా

కావలసిన పదార్థాలు
శనగపిండి - కప్పు, పాలకూర - 2 కట్టలు, పెరుగు - పావుకప్పు, అల్లం ముద్ద - చెంచా, పచ్చిమిర్చి - 4, నూనె - 2 చెంచాలు, నిమ్మరసం, పంచదార, ఆవాలు - చెంచా చొప్పున, ఉప్పు - తగినంత, ఈనో ఫ్రూట్‌ సాల్ట్‌ - చెంచా,
నువ్వులు - 2 చెంచాలు, కరివేపాకు - ఒక రెబ్బ, ఇంగువ - చెంచా, నీళ్లు - అరకప్పు

తయారీ
శుభ్రపరిచిన పాలకూరను కాడలతో సహా 5 నిమిషాలు ఉడికించి చల్లారాక అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి గ్రైండ్‌ చేయండి. వెడల్పాటి గిన్నెలో శనగపిండి, పాలకూర పేస్టు, పెరుగు, నూనె, నీళ్లు జోడించి కలపండి. అందులో ఉప్పు, పంచదార, నిమ్మరసం వేసి మరోసారి కలిపి, 20 నుంచి 25 నిమిషాలు నానబెట్టండి. ఈనో ఫ్రూట్‌ సాల్ట్‌ వేసి కలిపిన పాలక్‌ డోక్లా పిండిని గ్రీజ్‌ చేసిన ప్లేట్లలో పోసి, ఆవిరి మీద 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించండి. తర్వాత 10 నిమిషాలు చల్లారనివ్వండి.
కడాయిలో నూనె వేడయ్యాక ఆవాలు, నువ్వులు, ఇంగువ, కరివేపాకు వేగనిచ్చి అరకప్పు నీళ్లను జోడించండి. దీన్ని పాలక్‌ డోక్లాపై సమంగా పరచుకునేలా వేయండి. నచ్చిన ఆకృతిలో కట్‌ చేసి గోరువెచ్చగా సర్వ్‌ చేసుకోండి.


రవ్వ డోక్లా

కావలసిన పదార్థాలు
ఉప్మా రవ్వ - 2 కప్పులు, పెరుగు - కప్పు, మిర్చి - 4, అల్లంముద్ద, పంచదార - చెంచా చొప్పున, ఉప్పు - తగినంత, ఇంగువ - చిటికెడు, ఈనో ఫ్రూట్‌ సాల్ట్‌ - టీస్పూన్‌, నూనె, కొబ్బరికోరు, కొత్తిమీర తురుము - 2 చెంచాల చొప్పున, నిమ్మరసం, ఆవాలు, జీలకర్ర, పంచదార - చెంచా చొప్పున, నువ్వులు - 2 టేబుల్‌ స్పూన్లు, మిర్చి - 2, కరివేపాకు - 2 రెబ్బలు, ఇంగువ - చిటికెడు, నీళ్లు - కప్పు, ఉప్పు - తగినంత, కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ
ఒక పెద్ద గిన్నెలో రవ్వ, పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంపేస్ట్‌, పంచదార, ఉప్పు, ఇంగువ వేసి బాగా కలపాలి. నీరు జోడించి మరోసారి కలిపి అరగంట నాననివ్వాలి. ఇంతలో స్టీమర్‌ ప్లేట్లకు నూనె రాసి సిద్ధంగా ఉంచండి. నానబెట్టిన ఈనో ఫ్రూట్‌ సాల్ట్‌ వేసిన రవ్వ డోక్లా మిశ్రమాన్ని స్టీమర్‌ ప్లేట్‌లో 20 నిమిషాలు ఉడికించాలి. తర్వాత అందులోంచి ప్లేట్‌ తీసేసి పది నిమిషాలు చల్లార్చాలి.
కడాయిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, నువ్వులు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేగాక కప్పు నీళ్లు, పంచదార, ఉప్పు, నిమ్మరసం జోడించి,  మరిగించండి. ఈ తాలింపును డోక్లా మీద పరిచినట్లు పోయాలి. కొబ్బరికోరు,  కొత్తిమీర తరుగు వేస్తే సరి.. రవ్వ డోక్లా రెడీ. ఇది గ్రీన్‌ చట్నీతో మరింత రుచిగా ఉంటుంది.


పాలక్‌ ఇడ్లీ

కావలసిన పదార్థాలు
ఇడ్లీ పిండి - 3 కప్పులు, పాలకూర - 2 కప్పులు, ఉప్పు - తగినంత, కారం, గరం మసాలా - టీస్పూన్‌ చొప్పున

తయారీ
పాలకూర శుభ్రంచేసి 3 నిమిషాలు ఉడికించి, చల్లారిన తర్వాత గ్రైండ్‌ చేయాలి. ఒక పాత్రలో ఇడ్లీ పిండి, కారం, ఉప్పు, గరం మసాలా, పాలకూర పేస్టు వేసి బాగా కలపాలి. ఈ పిండితో ఇడ్లీలు వేసి 10 నుంచి 12 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. అంతే.. ఆరోగ్యకరమైన పాలక్‌ ఇడ్లీ వేడి వేడిగా సర్వ్‌ చేయండి!


క్యారట్‌ ఇడ్లీ

కావలసిన పదార్థాలు
ఉప్మా రవ్వ, పెరుగు - 2 కప్పుల చొప్పున, క్యారెట్‌ - ఒకటిన్నర కప్పు, ఉప్పు - తగినంత, ఈనో ఫ్రూట్‌ సాల్ట్‌ - చెంచా

తయారీ
ఒక పాత్రలో రవ్వ, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి, 20 నిమిషాలు నానపెట్టండి. అందులో క్యారెట్‌ పేస్టు, ఈనో ఫ్రూట్‌ సాల్ట్‌ వేసి కలియతిప్పండి. ఈ మిశ్రమంతో ఇడ్లీలు వేసి 10 నుంచి 12 నిమిషాలు ఉడికించండి. వేడి క్యారెట్‌ ఇడ్లీలను సాంబార్‌ లేదా చట్నీతో ఆరగించి ఆనందించండి.
 

పవన్‌ సిరిగిరి, చెఫ్‌ హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని