ఖావ్‌ జీ పావ్‌ భాజీ

పావ్‌ అంటే బన్ను, భాజీ అంటే కూరగాయలు. వీటితో తయారయ్యే పావ్‌భాజీ.. మనందరికీ మహా ఇష్టం. చిన్న చిన్నగా చినుకులు పడుతుంటే.. వేడి వేడిగా పావ్‌భాజీ తింటుంటే.. ఆహా.. ఎంత బాగుంటుందో.. వీధుల్లో దొరికే పావ్‌భాజీ రకాలు ఇంట్లోనే చేసుకుందామా!

Published : 10 Sep 2023 00:04 IST

పావ్‌ అంటే బన్ను, భాజీ అంటే కూరగాయలు. వీటితో తయారయ్యే పావ్‌భాజీ.. మనందరికీ మహా ఇష్టం. చిన్న చిన్నగా చినుకులు పడుతుంటే.. వేడి వేడిగా పావ్‌భాజీ తింటుంటే.. ఆహా.. ఎంత బాగుంటుందో.. వీధుల్లో దొరికే పావ్‌భాజీ రకాలు ఇంట్లోనే చేసుకుందామా!

జైన్‌ పావ్‌భాజీ

కావలసినవి: కాశ్మీరీ మిర్చి - 12, నూనె - టేబుల్‌ స్పూన్‌, వెన్న - మూడు చెంచాలు, జీలకర్ర - చెంచా, క్యాప్సికం ముక్కలు - అర కప్పు, టొమాటో ముక్కలు - రెండు కప్పులు, కారం - 2 చెంచాలు, పావ్‌భాజీ మసాలా - ఒకటిన్నర చెంచా, ఉప్పు - తగినంత, సన్నగా తుంచిన క్యాలీఫ్లవర్‌, పచ్చి బఠాణీలు - ఒక కప్పు చొప్పున, కొత్తిమీర తరుగు - అర కప్పు, బన్నులు - 8, వేయించిన అప్పడాలు - 8, నిమ్మరసం - చెంచా

తయారీ: కాశ్మీరీ మిర్చిని కొద్ది నీళ్లతో గ్రైండ్‌ చేసుకోవాలి. కడాయిలో నూనె, కొద్దిగా వెన్న వేసి వేడయ్యాక జీలకర్రను వేయించాలి. అందులో మిర్చి పేస్టు, క్యాప్సికం, టొమాటో ముక్కలు, అర కప్పు నీళ్లు, కారం, పావ్‌భాజీ మసాలా, ఉప్పు వేసి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత క్యాలీఫ్లవర్‌, ఉడికించిన బఠాణీల గుజ్జు, కొత్తిమీర తరుగు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో కలియతిప్పుతూ, మెదుపుతూ ఉండాలి. కడాయిలో రెండు చెంచాల వెన్న, పావు చెంచా పావ్‌భాజీ మసాలా వేసి రెండు వైపులా వేయించుకోవాలి. ఉల్లి, టొమాటో స్లయిసులు, నిమ్మ చెక్క, పాపడ్‌లతో ఈ జైన్‌ పావ్‌ భాజీ సూపర్‌గా ఉంటుంది.

చీజ్‌ పావ్‌భాజీ

కావలసినవి: నూనె - 3 చెంచాలు, బంగాళదుంపలు - 3, టొమాటోలు - 5, క్యారెట్‌ - 1, బీన్స్‌ - 6, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 3, క్యాప్సికం - 1, కాశ్మీరీ చిల్లీ పౌడర్‌ - 2 చెంచాలు, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్‌ - చెంచా చొప్పున, ఉప్పు - తగినంత, పసుపు - అర చెంచా, ధనియాల పొడి, గరం మసాలా - రెండు చెంచాల చొప్పున, పావ్‌భాజీ మసాలా, బన్‌లు - 8, చీజ్‌ - కప్పు, నెయ్యి - 2 చెంచాలు, కొత్తిమీర తరుగు - అర కప్పు

తయారీ: బంగాళదుంపలు, టొమాటోలు, క్యారెట్‌, బీన్స్‌లను కడిగి ముక్కలు కోసి ఉడికించాలి. చల్లారాక మెత్తగా మెదపాలి. కడాయిలో నూనె వేడయ్యాక ఉల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికం వేసి వేయించాలి. ఉడికించిన కూరగాయల మిశ్రమం, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్‌, ధనియాల పొడి, గరం మసాలా, పావ్‌భాజీ మసాలా, కొన్ని నీళ్లు వేసి కలియతిప్పి మగ్గనివ్వాలి. కొత్తిమీర, చీజ్‌ తరుగు వేసి దించేయాలి. పావ్‌ను నేతిలో వేయించాలి. వేడివేడిగా ప్లేటులో వడ్డించుకుని తినడమే తరువాయి.

ముంబై పావ్‌భాజీ

కావలసినవి: బన్నులు - 8, వెల్లుల్లి ముక్కలు - 2 చెంచాలు, ఉల్లి, క్యారెట్‌, టొమాటో, క్యాబేజ్‌, పచ్చి బఠాణీలు - ఒక కప్పు చొప్పున, క్యాప్సికం - అర కప్పు, కట్‌ చేసిన క్యాలీఫ్లవర్‌ - 2 కప్పులు, బంగాళదుంపలు - 4, పావ్‌భాజీ మసాలా - 3 చెంచాలు, అల్లం మిర్చి ముద్ద - చెంచా, నిమ్మరసం - చెంచా, వెన్న - 2 చెంచాలు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉప్పు - తగినంత, నూనె - అరకప్పు

తయారీ: ముందుగా బన్నులను నేతిలో వేయించి పెట్టుకోవాలి. కడాయిలో నూనె కాగాక వెల్లుల్లి, అల్లం మిర్చి ముద్ద వేసి కొన్ని క్షణాలు వేయించాలి. తర్వాత ఉల్లి, టొమాటో, క్యారెట్‌ ముక్కలు, క్యాలీఫ్లవర్‌, క్యాబేజ్‌, పచ్చి బఠాణీలు, బంగాళదుంప ముక్కలు వేయించాలి. చివర్లో పావ్‌భాజీ మసాలా, ఉప్పు, నిమ్మరసం వేసి కలియబెట్టి దించేయాలి. ఉల్లి, మిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేస్తే సరి ఘుమఘుమలాడే పావ్‌భాజీ సిద్ధం.  ఎక్కువ మంది ఇష్టంగా తినే ముంబై రకం ఇది.

పనీర్‌ పావ్‌భాజీ

కావలసినవి: బన్నులు - 8, బంగాళదుంపలు - 3, టొమాటోలు - 4, ఉల్లిపాయలు - 2, పనీర్‌ - కప్పు, ఉప్పు - కొద్దిగా, అల్లం వెల్లుల్లి ముద్ద - చెంచా, కారం - చెంచా, పసుపు - అరచెంచా, నెయ్యి, కస్తూరి మెంతి, పావ్‌భాజీ మసాలా - 2 చెంచాల చొప్పున, కొత్తిమీర తరుగు - అర కప్పు, నిమ్మరసం - చెంచా

తయారీ: అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి అందులో టొమాటో ముక్కలు, పచ్చి బఠాణీలు, క్యాప్సికం, ఉడికించి చిదిమిన బంగాళదుంప, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి. అర కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. మగ్గిన తర్వాత మెత్తగా మెదపాలి. కారం, పసుపు, పావ్‌భాజీ మసాలా, కస్తూరి మెంతి వేసి కలియతిప్పాలి. చివర్లో పనీర్‌, నెయ్యి, ఉల్లి, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. అంతే నేతిలో వేయించిన బన్నుతో భాజీ అమోఘంగా ఉంటుంది.

గ్రీన్‌ పావ్‌భాజీ

కావలసినవి: బన్నులు - 6, క్యాలీఫ్లవర్‌, క్యాప్సికం, బూడిద గుమ్మడి ముక్కలు, సొరకాయ ముక్కలు, బచ్చలి కూర, కొత్తిమీర, ఉల్లి కాడల తరుగు, పచ్చి బఠాణీలు - అన్నీ ఒక కప్పు చొప్పున, వెల్లుల్లి ముక్కలు - 2 చెంచాలు, బంగాళ దుంపలు - 3, పచ్చిమిర్చి ముద్ద - చెంచా, ఉప్పు, పసుపు - చెంచా చొప్పున, వెన్న, నూనె - పావు కప్పు చొప్పున, పావ్‌భాజీ మసాలా - 3 చెంచాలు, ఉల్లి ముక్కలు - కొద్దిగా, నిమ్మకాయ - ఒకటి

తయారీ: బన్నులను నేతిలో వేయించాలి. బూడిద గుమ్మడి, సొరకాయ, బంగాళదుంపల ముక్కలు, పచ్చి బఠాణీలను కుక్కర్లో ఉడికించుకోవాలి. బచ్చలి, ఉల్లికాడల ముక్కలను రెండు నిమిషాలు ఒక పాత్రలో ఉడికించి చల్లారాక గ్రైండ్‌ చేయాలి. వెల్లుల్లి, మిర్చి ముద్దను నేతిలో వేయించాలి. అందులో సన్నగా తుంచిన క్యాలీఫ్లవర్‌, క్యాప్సికం ముక్కలు వేసి అడుగంటకుండా కలియతిప్పుతూ మగ్గనివ్వాలి. ఇందులో కుక్కర్లో ఉడికించిన ముక్కలు, కొన్ని నీళ్లు, ఉప్పు, పసుపు వేయాలి. దగ్గర పడ్డాక బచ్చలి పేస్టు, పావ్‌భాజీ మసాలా వేసి నిమిషం పాటు సన్న సెగ మీద ఉంచి దించేస్తే సరిపోతుంది. ఉల్లి, నిమ్మ రసాలతో వహ్వా అనిపిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని