జాతీయోద్యమం... మలైకాజా!

నెల్లూరు.. సన్నబియ్యానికీ, చేపల పులుసుకే కాదు  ‘జైహింద్‌ మలైకాజా’కి కూడా ఫేమస్సే. కాజాకి ముందు జైహింద్‌ ఏంటి ఈ పేరేదో కాస్త విచిత్రంగా ఉంది కదా! దీని వెనుక కథ ఏంటో తెలుసుకుందాం రండి...

Published : 24 Jul 2022 01:25 IST

నెల్లూరు.. సన్నబియ్యానికీ, చేపల పులుసుకే కాదు  ‘జైహింద్‌ మలైకాజా’కి కూడా ఫేమస్సే. కాజాకి ముందు జైహింద్‌ ఏంటి ఈ పేరేదో కాస్త విచిత్రంగా ఉంది కదా! దీని వెనుక కథ ఏంటో తెలుసుకుందాం రండి...

1945... స్వాతంత్రోద్యమ కాంక్ష తీవ్రంగా ఉన్న రోజులవి. కమాల్‌ సింగ్‌ది ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌. ఆ సమయంలో ఉపాధి వెతుక్కుంటూ నెల్లూరు వచ్చి స్థిరపడింది వాళ్ల కుటుంబం. మిఠాయిల తయారీలో నైపుణ్యం ఉండటంతో ఆ దుకాణాన్ని ప్రారంభించాలనుకున్నారాయన. స్వాతంత్య్ర ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులు కావడంతో దుకాణానికి  జైహింద్‌ అని పేరుపెట్టారు. వీళ్ల దుకాణంలో... దమ్‌రోటీహల్వా, బొంబాయి హల్వా, బాదుషా వంటి మిఠాయిలు ప్రాచుర్యం పొందినా ఇక్కడ దొరికే మలైకాజా రుచి మరెక్కడా దొరకదని అంటారు.  

ఈ మలైకాజా రుచికి సామాన్యులే కాదు సెలబ్రిటీలూ ఫిదా అయ్యారు. వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం వంటివారు నెల్లూరు వస్తే... తప్పక తినే పదార్థాల్లో ఈ మిఠాయి కూడా ఒకటి. మైదాపిండి, కోవా, యాలకులు, వంటసోడాతో ఈ మలైకాజాని తయారు చేస్తారు. మైదా, కోవాలని రాత్రే నానబెట్టి... ఉదయాన్నే కాజాలు తయారు చేస్తారు. ఈ మిఠాయి... తెలుగువారి ప్రశంసలే కాదు పొరుగు రాష్ట్రాలు, విదేశీయుల అభిమానాన్ని కూడా చూరగొంది. దాంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలకే కాక దుబాయ్‌, కువైట్‌, అమెరికా, సింగపూర్‌ వంటి విదేశాలకూ ఎగుమతి అవుతోంది. ఇక్కడ మలైకాజాతో పాటు దమ్‌రోటీహల్వా కూడా ఎక్కువగా అమ్ముడుపోతుంటుంది. ఈ స్వీటు ఇంతలా ఆదరణ పొందడానికి మొదటి నుంచీ రుచి, నాణ్యత పాటించడమే ప్రధాన కారణమంటున్నారు నిర్వాహకులు.. మల్లికార్జున్‌సింగ్‌, బాలాజీసింగ్‌లు. వీరు కమాల్‌సింగ్‌ తర్వాత ఆ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఆయన వారసులు.

- జి. ప్రశాంత్‌, ఈనాడు జర్నలిజం స్కూలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని