కిచిడి... వడ్డించేయండి!

ఇంట్లో నలుగురు సభ్యులుంటే ఒకరు వంకాయ నచ్చదంటే మరొకరు దొండకాయ కూరా... అమ్మో వద్దు అంటారు. ఇలా కుటుంబసభ్యుల ఇష్టాయిష్టాలకు తగినట్లుగా రకరకాల కూరలు చేయడం అంటే మాటలా... అందుకే అప్పుడప్పుడూ కిచిడీ చేసి వేడివేడిగా వడ్డిస్తే సరి. పోషకాలు అందడంతోపాటూ రుచీ అమోఘమే.

Updated : 30 Apr 2022 15:51 IST

ఇంట్లో నలుగురు సభ్యులుంటే ఒకరు వంకాయ నచ్చదంటే మరొకరు దొండకాయ కూరా... అమ్మో వద్దు అంటారు. ఇలా కుటుంబసభ్యుల ఇష్టాయిష్టాలకు తగినట్లుగా రకరకాల కూరలు చేయడం అంటే మాటలా... అందుకే అప్పుడప్పుడూ కిచిడీ చేసి వేడివేడిగా వడ్డిస్తే సరి. పోషకాలు అందడంతోపాటూ రుచీ అమోఘమే.


కూరగాయల కిచిడీ

కావలసినవి: బియ్యం: అరకప్పు, కందిపప్పు: పావుకప్పు, పసుపు: అరచెంచా, అల్లం: చిన్నముక్క పల్లీలు: పావుకప్పు (రెండుగంటల ముందు నానబెట్టుకోవాలి), తీపి గుమ్మడి, బంగాళాదుంప, క్యారెట్‌, బీన్స్‌ ముక్కలు: అన్నీ కలిపి ఒకటిన్నరకప్పు, టొమాటో: ఒకటి, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి: రెండు, నెయ్యి: పావుకప్పు, బిర్యానీఆకు: ఒకటి, ఇంగువ: చిటికెడు, ఆవాలు: అరచెంచా, జీలకర్ర: ముప్పావుచెంచా, ఎండుమిర్చి: రెండు, లవంగాలు: రెండు, దాల్చినచెక్క: చిన్నముక్క, కరివేపాకు రెబ్బలు: రెండు.

తయారీవిధానం: ముందుగా అల్లం, పచ్చిమిర్చిని ముద్దలా చేసి పెట్టుకోవాలి. స్టౌమీద కుక్కర్‌ పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక బిర్యానీ ఆకు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముద్ద, ఎండుమిర్చి, లవంగాలు, దాల్చినచెక్క, కరివేపాకు వేసి వేయించాలి. అందులో పల్లీలు, పసుపు, కడిగిన బియ్యం, కందిపప్పు, కూరగాయముక్కలు వేసి వేయించి రెండున్నర కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి. మూడు కూతలు వచ్చాక స్టౌ కట్టేయాలి. ఇది కాస్త జారుగానే ఉంటుంది.


పాలక్‌ కిచిడీ

కావలసినవి: బియ్యం: అరకప్పు, పెసరపప్పు: పావుకప్పు, పాలకూరగుజ్జు: ముప్పావుకప్పు, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, ఉప్పు: తగినంత, పసుపు: చిటికెడు, కారం: చెంచా, దనియాలపొడి: చెంచా, జీలకర్రపొడి: అరచెంచా, గరంమసాలా: అర చెంచా, నెయ్యి: టేబుల్‌స్పూను, మిరియాలు: అరచెంచా, జీలకర్ర: చెంచా, ఎండుమిర్చి: ఒకటి.

తయారీ విధానం: బియ్యం, పెసర పప్పుల్ని కడిగి రెండింటినీ కలిపి పావుగంటసేపు నానబెట్టుకోవాలి. స్టౌమీద కుక్కర్‌పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరవాత పచ్చిమిర్చి ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. అయిదు నిమిషాలయ్యాక అల్లంవెల్లుల్లి ముద్ద, పాలకూర గుజ్జు, పసుపు, దనియాలపొడి, జీలకర్ర, కారం, గరంమసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో కడిగిన బియ్యం, పెసరపప్పు, రెండుకప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి. మూడు కూతలు వచ్చాక దింపేయాలి.


పెసలు కొబ్బరి కిచిడీ


కావలసినవి: పెసలు: కప్పు (అరగంటముందు నానబెట్టుకోవాలి), బియ్యం: కప్పు, ఉల్లిపాయ: ఒకటి, కొబ్బరి తురుము: అరకప్పు, ఉప్పు: తగినంత, యాలకులు: రెండు, లవంగాలు: నాలుగు, దాల్చినచెక్క: చిన్నముక్క, జీలకర్ర: చెంచా, జీడిపప్పు: కొన్ని, నెయ్యి: మూడు టేబుల్‌స్పూన్లు.
తయారీవిధానం: స్టౌమీద కుక్కర్‌ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక జీలకర్ర, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, ఉల్లిపాయముక్కలు, జీడిపప్పు వేసి వేయించాలి. అవి వేగాక పెసలు, కడిగిన బియ్యం, కొబ్బరితురుము, తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి. మూడు కూతలు వచ్చాక దింపేసి ఓసారి కలిపితే రైతాతో కలిపి తినొచ్చు.


సెనగపప్పు కిచిడీ

కావలసినవి: సెనగపప్పు: పావుకప్పు (గంటముందు నానబెట్టుకోవాలి), బియ్యం: కప్పు, కొత్తిమీర: పావుకప్పు, ఉల్లిపాయలు: రెండు, నూనె: మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, పెరుగు: పావుకప్పు, పసుపు: అరచెంచా, బిర్యానీఆకులు: రెండు, జీలకర్ర: చెంచా, కారం: చెంచా, వెల్లుల్లిరెబ్బలు: పది, అల్లం: చిన్నముక్క, లవంగాలు: అయిదు, దాల్చినచెక్క: చిన్నముక్క, మిరియాలు: అరచెంచా, పచ్చిమిర్చి: రెండు, యాలకులు: మూడు.

తయారీవిధానం: మిక్సీలో సగం ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మిరియాలు, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు తీసుకుని కాసిని నీళ్లు పోసి.. మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టౌమీద కుక్కర్‌ పెట్టి నూనె వేయాలి.  అది వేడయ్యాక బిర్యానీ ఆకులు, జీలకర్ర, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగాక పసుపు, ముందుగా చేసిపెట్టుకున్న మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అయిదు నిమిషాలయ్యాక కారం, గిలకొట్టిన పెరుగు, సగం కొత్తిమీర, నానబెట్టిన సెనగపప్పు, కడిగిన బియ్యం, రెండున్నర కప్పుల నీళ్లు పోసి... మూత పెట్టాలి. మూడు కూతలు వచ్చాక దింపేసి, మిగిలిన కొత్తిమీరతో అలంకరిస్తే సరి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని