కృత్రిమమే కానీ... సహజంగా పనిచేస్తాయి!

కొయ్యకాలు టకటక లాడించుకుంటూ వచ్చే మాజీ సైనికుడూ అతడు చెప్పే యుద్ధం కబుర్ల గురించి కథల్లో చదివే ఉంటారు! అవును... కృత్రిమ అవయవాల అభివృద్ధికి ప్రేరణ యుద్ధాలే. ఒకప్పుడు ఇన్ని వాహనాలూ ప్రమాదాలూ లేవు. పుట్టుకతోనో, అనారోగ్యంతోనో అరుదుగా వైకల్యం వచ్చేది. యుద్ధాలే... వేలాది సైనికుల్ని దివ్యాంగులుగా మార్చేవి.

Updated : 05 Nov 2023 02:32 IST

ఈరోజు ‘ఇంటర్నేషనల్‌ ప్రోస్థెటిక్స్‌ అండ్‌ ఆర్థొటిక్స్‌ డే’

కొయ్యకాలు టకటక లాడించుకుంటూ వచ్చే మాజీ సైనికుడూ అతడు చెప్పే యుద్ధం కబుర్ల గురించి కథల్లో చదివే ఉంటారు! అవును... కృత్రిమ అవయవాల అభివృద్ధికి ప్రేరణ యుద్ధాలే. ఒకప్పుడు ఇన్ని వాహనాలూ ప్రమాదాలూ లేవు. పుట్టుకతోనో, అనారోగ్యంతోనో అరుదుగా వైకల్యం వచ్చేది. యుద్ధాలే... వేలాది సైనికుల్ని దివ్యాంగులుగా మార్చేవి. యువత అలా నిస్సహాయులుగా మిగలడం సమాజానికే నష్టమని భావించి చేపడుతున్న పరిశోధనల ఫలితమే- ఎన్నో దశలను దాటి స్పర్శను సైతం అనుభూతి చెందగల నేటి అత్యాధునిక బయోనిక్‌ అవయవాల తయారీ వరకూ వచ్చింది. కృత్రిమమే అయినా... అణువణువూ అచ్చంగా సొంతమే అన్నంత సౌకర్యాన్నిస్తున్న ఈ అవయవాలు కాళ్లూ చేతులూ మాత్రమే కాదు, మరెన్నో ఉన్నాయి!


నాలుగు దశాబ్దాల క్రితం...శాస్త్రీయ నృత్యకారిణి సుధాచంద్రన్‌ రోడ్డుప్రమాదంలో కాలిని కోల్పోయి పట్టుదలగా సాధన చేసి కృత్రిమ కాలితోనే నృత్యం చేయడాన్ని విస్మయంగా చూసింది ప్రపంచం. ఆమె జీవితం మీద ఏకంగా సినిమానే వచ్చింది.

ఇప్పుడు... టింకేష్‌ కౌశిక్‌కి గాలిపటాలు ఎగరేయడమంటే సరదా. తొమ్మిదేళ్ల వయసులో ఓరోజు అలాగే గాలిపటం ఎగరేస్తుండగా అది వెళ్లి కరెంటు వైర్ల మధ్య ఇరుక్కుపోయింది. గట్టిగా లాగబోతే పదకొండు వేల ఓల్టుల కరెంటు చేతుల్లోంచి కాళ్ల వరకూ జివ్వున పాకింది... మర్నాటికల్లా రెండు కాళ్లూ ఒక చేయీ తీసేయగా ఒక చెయ్యి మాత్రమే ఉన్న మొండెంతో మంచం మీద మిగిలాడు. నెలల తరబడి ఆస్పత్రిలో గడిపి ఇంటికొచ్చాక అన్నిటికీ అమ్మమీద ఆధారపడడానికి ఇబ్బందిపడేవాడు. అది చూసి తల్లిదండ్రులు కృత్రిమ అవయవాలు పెట్టించారు. వాటితో నడవడానికీ పనులు చేయడానికీ ప్రయత్నించేవాడు. చేతకాక ఎదురుదెబ్బలు తినేవాడు. రక్తం కారి పుండ్లు పడేవి. తనని చూసి ఎవరూ ‘అయ్యో పాపం’ అనకూడదన్నది టింకేష్‌ పట్టుదల. దాంతో ఎప్పటికప్పుడు మెరుగైన కృత్రిమ అవయవాలను కొనిచ్చేవారు తల్లిదండ్రులు. ఒక్క కాలంటే అనుకోవచ్చు, మనిషి కదలికలకి ప్రధానమైన నాలుగు అవయవాల్లో మూడు కృత్రిమమే. వాటితోనే సాధన చేశాడు. మారథాన్‌, యోగా, వాటర్‌ రాఫ్టింగ్‌, బంగీ జంపింగ్‌... ఏదీ వదల్లేదు. ట్రిపుల్‌ యాంప్యుటీ అయివుండీ ఈ సాహసకృత్యాల్లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. వైకల్యాన్ని మనసుదాకా పోనీయకుండా మనం చూసుకుంటే, కృత్రిమ అవయవాలు మన కలల్ని నెరవేరుస్తాయంటాడు ఈ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌.

అతనే కాదు, పారాలింపిక్స్‌లో, పారా ఆసియా క్రీడల్లో పతకాలు తెచ్చిన వారందరివీ ఇలాంటి కథలే. ఏ కారణంగా వైకల్యం సంభవించినా నిస్సహాయంగా తలవంచుకుని మిగిలిపోకుండా తమ సత్తా ఏమిటో చూపించాలని వారు పడే తాపత్రయానికి అండగా నిలుస్తున్నాయి అధునాతన ప్రోస్థెటిక్స్‌ అండ్‌ ఆర్థొటిక్స్‌. ఇవే లేకపోతే లక్షలాది మంది కలలన్నీ కల్లలుగా మిగిలేవి.

ప్రోస్థెటిక్స్‌ అంటే..?

వైద్య పరిభాషలో ప్రోస్థెటిక్స్‌ అంటే అదనంగా జత చేసే పరికరం అని అర్థం. ఈ కృత్రిమ అవయవాలను శరీరానికి తగినట్లుగా రూపొందించే విభాగాన్ని ఆర్థోటిక్స్‌ అంటారు. అన్ని అవయవాలూ సరిగ్గా ఉంటే అసలు వాటి గురించి మనం ఆలోచించను కూడా ఆలోచించం. శ్వాస తీసుకుంటున్నట్లే, యథాలాపంగా లేచి నడుస్తాం. చేతులతో పనులన్నీ చేస్తాం. కానీ ఒక్కసారి ఆ కదలికల్ని గమనించండి- నడిచేటప్పుడు ఒక్కో అడుగు పడడానికీ వెనక ఎంత పని జరుగుతుందో! ముందు మడమ కింద ఆనాక పాదం మొత్తం ఆనుతుంది. వెంటనే మడమ పైకి లేస్తుంది. తర్వాత వేళ్లతో సహా పాదం అంతా లేస్తుంది. లయబద్ధంగా ఈ నాలుగు దశలూ దాటితేనే ఒక అడుగు పూర్తయినట్లు. ఈ నాలుగు దశలూ ఎప్పుడు పూర్తవుతాయి... తుంటి కీళ్లు, మోకాలి కీళ్లు, చీలమండల కీళ్లు సమన్వయంతో పనిచేసినప్పుడు. నడవమని మెదడు ఆదేశించాక ఈ పనులన్నీ ఒక వరసక్రమంలో 0.7 సెకన్లలో జరుగుతాయట. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. సహజమైన పాదం స్థానంలో కృత్రిమ పాదాన్ని ఏర్పాటుచేయాలంటే ఇలాంటి లెక్కలెన్నో ఉంటాయి మరి. శరీరంలో ఒక భాగంలా అతుక్కుని ఉండే అవయవం సౌకర్యంగా ఉండాలంటే ఎంత జాగ్రత్తగా తయారుచేయాలీ... ఎన్ని కొలతల్నీ కదలికల్నీ దృష్టిలో పెట్టుకోవాలీ!  వైకల్యాన్ని అధిగమించి సహజమైన జీవితం గడపడానికి తోడ్పడుతున్న ఈ సాంకేతికతను అసిస్టివ్‌ టెక్నాలజీ అంటున్నారు. అయితే కాలంతో పాటు వీటి ప్రాధాన్యం మారుతూ వస్తోంది.

ఎలా?

ఒకప్పుడు అవయవం లేని లోపం కన్పించకూడదు- అనుకునేవారు. అందుకని అచ్చం చెయ్యి లాగా కాళ్లలాగా కన్పించే కృత్రిమ అవయవాలను తయారుచేసేవారు. పూర్తి రబ్బరుతో తయారయ్యే జైపూర్‌ కృత్రిమ కాళ్లు తక్కువ ఖర్చుతో ఎందరికో తమ కాళ్లపై తాము నిలబడేందుకు తోడ్పడడం చూస్తూనే ఉన్నాం. అయితే వీటి కదలికలు పరిమితం. ఇప్పుడలా కాదు, అవయవం లేని లోటు ఉండకూడదనుకుంటున్నారు. అందుకే పనితీరుకి పెద్ద పీట వేస్తున్నారు. అడుగు తడబడకూడదు, చేతి పట్టు సడలకూడదు, సాధారణ అవయవంతో సమానంగా పనిచేయాలి. ఇదీ ఇప్పటి ప్రాధాన్యం. అందుకు దినదినం కొత్త పుంతలు తొక్కుతున్న అసిస్టివ్‌ టెక్నాలజీ అభివృద్ధి అర్థం కావాలంటే ముందు దాని చరిత్ర తెలుసుకోవాలి..  

ఏమిటది?  

ఒకప్పుడు బరువుగా ఈడ్చుకుంటూ తిరిగిన ఇనుప, కొయ్య కాళ్ల నుంచి... సహజమైన కదలికలతో ఒలింపిక్స్‌లో పరుగెత్తగల తేలికైన బ్లేడ్‌లాంటి కాళ్ల వరకూ మార్పులు చోటుచేసుకోవడం అంత సులభంగా జరగలేదు. అసలు కృత్రిమ అవయవం వాడడం అన్నది ఎప్పటినుంచీ ఉందో తెలుసా? దాదాపు ఐదువేల సంవత్సరాల క్రితమే దీని ప్రస్తావన ఒక ఈజిప్షియన్‌ కథలో కనిపిస్తుంది. అదే కాలానికి చెందిన ఇరాన్‌లోని పురావస్తు తవ్వకాల్లో బిట్యుమెన్‌ పేస్టు మీద బంగారం పూతవేసిన కృత్రిమ కన్ను ఉన్న మహిళ దేహం కనిపించింది. కంచుతో తయారైన దంతాలూ బయటపడ్డాయి. ఈజిప్షియన్‌ మమ్మీ ఒకదానికి పలుచనిచెక్కతో తయారుచేసి లోపలివైపు లెదర్‌తో కాలికి తొడుక్కునేలా ఏర్పాటుచేసిన బొటనవేలి భాగం దొరికింది. రెండువేల ఏళ్లక్రితం జరిగిన ఒక యుద్ధంలో రోమన్‌ సైనిక జనరల్‌ ఒకరు తెగిపోయిన చేతి స్థానంలో ఇనుప చేతిని పెట్టుకుని మరీ శత్రువుల భరతం పట్టినట్లు చరిత్ర చెబుతోంది. అవయవలోపాన్ని అధిగమించడానికి మనిషి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడనడానికి నిదర్శనలివి. క్రమంగా యుద్ధాలు పెరగడం, ఎందరో సైనికులు వికలాంగులుగా మిగలడం ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 16, 17 శతాబ్దాల్లో ఇనుప చేతులూ కొయ్య కాళ్లూ ఎక్కువగా తయారుచేసేవారు. అయితే ఇవన్నీ చాలా బరువుగానూ సామాన్యులకు అందనంత ఖరీదుతోనూ ఉండేవి. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక అమెరికా ప్రత్యేకంగా నిధులు కేటాయించి కృత్రిమ అవయవాల తయారీలో పరిశోధనను ప్రోత్సహించింది. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, బెర్కెలీలో సాకెట్‌ టెక్నాలజీ అభివృద్ధి చేశాక వీటి తయారీ ఊపందుకుంది. కృత్రిమ అవయవాలనగానే మనకి కాళ్లూ చేతులే గుర్తొస్తాయి కానీ ఇవి చాలా రకాలు.

ఇంకా ఏముంటాయి?

నోట్లో దంతాలు ఊడిపోతే పెట్టే కట్టుడు పళ్లు, ముఖమూ మెడా స్వరపేటికా లాంటి భాగాలు ప్రమాదాల్లోనో అనారోగ్యంతోనో దెబ్బతింటే పునర్నిర్మించే క్రమంలో వాడే పరికరాలూ, రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు సర్జరీ తర్వాత అమర్చే బ్రెస్ట్‌ ప్రోస్థెసిస్‌, పురుషాంగ సమస్యలు ఉన్నవారి కోసం పెనైల్‌ ప్రోస్థెసిస్‌... ఉంటాయి. గుండెమార్పిడి శస్త్రచికిత్స చేసేటప్పుడు కృత్రిమ గుండెను వాడతారు. కాళ్లూ చేతులూ కూడా చాలా రకాలుంటాయి. కేవలం ముంజేతివరకే అయితే ఒకలాగా, మోచేతి దగ్గర్నుంచీ ఒకలాగా, పూర్తిగా చెయ్యి లేకపోతే బెల్టుతో ఛాతీ భాగానికి తగిలిస్తూ మరోలాగా... తయారుచేస్తారు. కాళ్లకూ అంతే. పాదాలూ, మోకాలి కిందినుంచీ, మోకాలి పైనుంచీ... వేర్వేరు రకాలుగా తయారుచేస్తారు. ఒక్కోదాని కదలికలకు అనుగుణంగా దాని నిర్మాణం ఉంటుంది. వినియోగదారు అవసరాలను బట్టీ వాడే సాంకేతికతను బట్టీ వీటి తయారీ, ధరా మారుతూ ఉంటాయి.

అవసరాన్ని బట్టి అంటే..?

ముందు చేతుల విషయం చూద్దాం. ఉపయోగం లేకపోయినా కేవలం అవయవలోపం కన్పించకుండా వాడే వాటిని ‘ప్యాసివ్‌ డివైసెస్‌’ అంటారు. ఇవి చౌక కావడంతో కృత్రిమ చేతులు వాడేవారిలో మూడో వంతు వీటినే వాడతారట. రెండో రకాన్ని ‘బాడీ పవర్డ్‌ లేదా కేబుల్‌ ఆపరేటెడ్‌’ అంటారు. వీటితో కొన్ని పనులు చేయవచ్చు. ఉదాహరణకు ఇలాంటి చేతిని ఎంచుకుంటే దానికి వేళ్ల బదులు రెండు హుక్స్‌ ఉంటాయి. ఆ హుక్స్‌ని ఒక వైర్‌తో శరీరానికి అనుసంధానిస్తారు. చేతిని శరీరానికి దగ్గరగా దూరంగా జరపడం ద్వారా ఈ హుక్స్‌ తెరుచుకోవడం, బిగుసుకోవడం జరుగుతుంది. మూడో రకం- మయోఎలక్ట్రిక్‌ ఆర్మ్స్‌. ఇవి బ్యాటరీ సాయంతో పనిచేస్తాయి. ఈ పరికరాలు శరీర భాగానికి అతుక్కునే చోట కండరాల సంకోచవ్యాకోచాల నుంచి సంకేతాలు అందుకుని తదనుగుణంగా పనిచేస్తాయి. అలాగే కాళ్లకు కూడా. మోకాలు పైనుంచీ కాలు లేని వ్యక్తికి కృత్రిమ కాలు అమర్చినపుడు...సాధారణంగా రెండు కాళ్లతో నడిచే ఆరోగ్యకరమైన వ్యక్తికి ఎంత శక్తి కావాలో దానికన్నా ఎనభైశాతం ఎక్కువ శక్తి కావాల్సి ఉంటుంది. కృత్రిమ మోకాలి కదలికలు అంత క్లిష్టంగా ఉంటాయి. అదే మోకాలి కిందినుంచి కృత్రిమ కాలు అమర్చితే దానికన్నా కాస్త మెరుగ్గా ఉంటుంది.

దేంతో చేస్తారు?

ఒకప్పుడు కలప, ఇనుము, రబ్బరు వాడేవారు. ఇప్పుడు పాలీఎథిలీన్‌, పాలిప్రాపిలీన్‌ లాంటి ప్లాస్టిక్స్‌, టైటానియం, అల్యూమినియం లాంటి తేలికైన లోహాలూ కార్బన్‌ ఫైబర్‌ లాంటివీ వాడుతున్నారు. దాంతో అవి మరింత తేలికగా, మన్నికగా ఉంటున్నాయి. అంతేకాదు, మంచి మెటీరియల్‌తో పాటు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్‌నీ వీటి తయారీలో ఉపయోగించడం వల్ల అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తున్నాయి. కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైనింగ్‌, త్రీడీ ప్రింటింగ్‌, రోబోటిక్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి సాంకేతికతలన్నీ రావడంతో అచ్చం సొంత అవయవాల్లాగే పనిచేయగల ప్రోస్థెసిస్‌ అందుబాటులోకి వస్తున్నాయి. సాధారణంగా ఈ అవయవాలను- తొలగించగా మిగిలిన శరీర భాగానికి అమరుస్తారు. దీనివల్ల ఆ ప్రాంతం ఒత్తిడికి గురికాకుండా- మెత్తని
సిలికాన్‌ లైనింగ్‌, సక్షన్‌తో దానికి అతుక్కుని ఉండే సాకెట్‌ కాపాడుతున్నాయి.

వీటి అవసరం ఎంత?

పుట్టుకతోనే అవయవలోపం అరుదుగా ఉంటుంది. కానీ మనదేశంలో విపరీతంగా జరుగుతున్న రోడ్డు, రైలు ప్రమాదాల కారణంగా యువతలో అత్యధికంగా శారీరక వైకల్యం సంభవిస్తోంది. ప్రాణాలను కాపాడడానికి బాగా దెబ్బతిన్న కాలో చెయ్యో తీయక తప్పడం లేదు. ఇలా వైద్యపరంగా అవయవాలను తొలగించడాన్ని ‘యాంప్యుటేషన్‌’ అంటారు. ప్రమాదంలో కాలో చెయ్యో బాగా నలిగిపోయినప్పుడు ముఖ్యంగా ఎముకలు, రక్తనాళాలు, నాడులు, స్నాయువులు, చర్మం- వీటిలో ఏ మూడు బాగా దెబ్బతిన్నా ఇక ఆ అవయవాన్ని ఉంచీ లాభం ఉండదు. మిగతా శరీర భాగాలకూ ముప్పు వాటిల్లుతుంది కాబట్టి తొలగిస్తారు. ఇలాంటివారిలో నాలుగో వంతు మాత్రమే కృత్రిమ అవయవాలను వాడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మరో ప్రధాన కారణం- మధుమేహం. పాదాల మీద పుండ్లుపడి మానక, గ్యాంగ్రీన్‌గా మారితే కాలు తీసేయక తప్పదు. కొన్నిరకాల క్యాన్సర్లు, పొగతాగేవారిలో వచ్చే అథెరోస్ల్కెరోసిస్‌ లాంటి వ్యాధుల వల్ల(రక్తనాళాలు మూసుకుపోయి కాళ్లకు రక్తప్రసారం ఆగిపోతుంది) కూడా అవయవాలను తొలగించాల్సి వస్తుంది. ఇక, ప్రపంచవ్యాప్తంగా చూస్తే సిరియా, సూడాన్‌, ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌... తదితర దేశాల్లో యుద్ధాలు లక్షలాది ప్రజల్ని దివ్యాంగులుగా మారుస్తున్నాయి. వీరందరికీ కృత్రిమ అవయవాలు అవసరమే.

వాటికి స్పర్శ తెలుస్తుందా?

నిజమే, స్పర్శ మనకి చాలా కీలకం. పాదాలకు నేల తగిలితేనే ధైర్యంగా నిలబడగలుగుతాం. పింగాణీ టీ కప్పునీ, కాగితం కప్పునీ ఒకేలా పట్టుకోం. వస్తువుని బట్టి మనం ప్రయోగించే ఒత్తిడి ఉంటుంది. మరి స్పర్శ తెలియని కృత్రిమ అవయవాల వల్ల ప్రయోజనం ఏమిటీ? ఈ ప్రశ్నే పరిశోధకులనీ వేధించింది. దాదాపు దశాబ్దంపాటు పలు సంస్థలు చేసిన పరిశోధనల ఫలితంగానే స్పర్శనీ అనుభూతి చెందగల బయోనిక్‌ హ్యాండ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. యూకేకి చెందిన ఓపెన్‌ బయోనిక్స్‌ సంస్థ 2018 జనవరిలో మొట్టమొదటి మెడికల్లీ సర్టిఫైడ్‌ త్రీడీ ప్రింటెడ్‌ బయోనిక్‌ ఆర్మ్‌ని తయారుచేసింది. త్రీడీ ప్రింటింగ్‌, స్కానింగ్‌ టెక్నాలజీతో ప్రతి చెయ్యినీ వేర్వేరుగా అవసరమైన వారి శరీర కొలతలకు తగినట్లుగా తయారుచేయవచ్చు. ఈ చెయ్యి 8 కిలోల బరువును మోయగలదు. ధరించినవారి మొండిచెయ్యిలోని కండరాలతో దీని కదలికల్ని నియంత్రించవచ్చు. మరికొన్ని సంస్థలు కూడా ఈ రంగంలో విజయం సాధించి, ఆలోచనలతో కృత్రిమ చేతిని కదిలించగల సామర్థ్యాన్ని సాధించాయి. స్వీడన్‌కి చెందిన పరిశోధకులు ‘ఆసియోఇంటిగ్రేషన్‌’ అనే విధానాన్ని అభివృద్ధి చేశారు. దీని ప్రకారం కృత్రిమ అవయవాన్ని వ్యక్తి అవయవంలోని ఎముకలూ కండరాలూ నాడులకు కలుపుతూ శస్త్రచికిత్స చేస్తారు. దాంతో అతడి మెదడులోని ఆలోచనలను నాడులనుంచి కృత్రిమ అవయవంలోని ఎలక్ట్రోడ్స్‌ గ్రహించి మామూలు అవయవంలాగే కదలికలకు కారణమవుతున్నాయి. ఇప్పుడీ చేతులతో కంప్యూటర్‌మీద పని చేసుకోవచ్చు. ఆఖరికి సూదిలో దారం కూడా ఎక్కించవచ్చు. అయితే ఎంత అద్భుతంగా పనిచేస్తున్నా కృత్రిమ అవయవం సొంత అవయవానికి సమానం కాదంటున్నారు వైద్యనిపుణులు. వాటిని ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, రోజూ పడుకునేటప్పుడు తీసి భద్రపరుచుకోవాలి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్ని వదిలేస్తే అధికశాతం వాటి అవసరం రాకుండా చూసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోమంటున్నారు.

సీసామూతలతో...

ఆస్ట్రేలియాకి చెందిన ఎన్‌విజన్‌ హ్యాండ్స్‌ అనే సంస్థ అటు పర్యావరణానికీ ఇటు దివ్యాంగులకీ రెండు రకాలుగా పనికొచ్చే కార్యక్రమం చేపట్టింది. దాదాపు అన్ని దేశాల్లోనూ ఎంతో కొంత ప్లాస్టిక్‌ సీసాల్ని రీసైకిల్‌ చేస్తున్నారు కానీ వాటి మూతలు ఇప్పటికీ ఇంకా చెత్తకుండీలకే చేరుతున్నాయి.సీసాలూ మూతలూ వేర్వేరు మెటీరియల్‌తో తయారవుతాయి కాబట్టి మూతల్ని విడిగా రీసైకిల్‌ చేయాలి. అలా చేయకపోవడంతో చెత్తలోకి వెళ్తున్న వాటిని సేకరించి రీసైకిల్‌ చేసి దాంతో పిల్లలకోసం త్రీ డీ ప్రింటెడ్‌ చేతులు తయారుచేయించి పేద దేశాలకు ఇస్తోంది. 500 మూతలతో ఒక చేయి తయారుచేయొచ్చనీ ప్లాస్టిక్‌ మూతల్ని సేకరించి తమకి ఇవ్వమనీ ప్రచారం చేస్తూ స్కూళ్లూ కాలేజీల్లో డ్రాప్‌బాక్సులు పెట్టింది ఈ సంస్థ. ఈ ప్రాజెక్టులో పనిచేసేవారంతా కూడా దివ్యాంగులూ నిరుపేదలే. ఇది చూశాక ఇప్పుడు పలు సంస్థలు ఇదే బాటపట్టాయి.

అవగాహన కోసం... ఆ రోజు!

ప్రపంచవ్యాప్తంగా దివ్యాంగుల అవసరాల గురించి అవగాహన కల్పిస్తూ వారికి మరింత నాణ్యమైన జీవితాన్ని అందించాలన్న ఆశయంతో ఏర్పడిందే ‘ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ ప్రోస్థెటిక్స్‌ అండ్‌ ఆర్థొటిక్స్‌’(ఐఎస్‌పీఓ).
పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కృత్రిమ అవయవాలను అందజేయడమే కాక కొత్త సాంకేతికతలపై చైతన్యం తెస్తోంది. మరోపక్క కృత్రిమ అవయవాలను అందరికీ అందుబాటులోకి తేవడానికి ‘ఓపెన్‌ సోర్స్‌’ ఉద్యమానికి చెందిన కొందరు ‘ఓపెన్‌ ప్రోస్థెటిక్స్‌ ప్రాజెక్టు’ని చేపట్టారు. అవయవాల తయారీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సమాచారాన్నంతా ఓపెన్‌ సోర్స్‌ వేదికల మీద ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు. ఓపెన్‌ బయోనిక్స్‌ లాంటి సంస్థలూ వీరికి సహకరిస్తున్నాయి. త్రీడీ ప్రింటింగ్‌తో చౌకగా అవయవాలను తయారుచేయడం వీరి ఆశయం.

ఇస్రోతో సహా ఎన్నో స్టార్టప్‌లు

నానాటికీ పెరుగుతున్న కృత్రిమ అవయవాల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో స్టార్టప్‌లు ఈ రంగంలో ప్రారంభమయ్యాయి. అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కూడా ‘మైక్రోప్రాసెసర్‌ కంట్రోల్డ్‌’ మోకాళ్లను తయారుచేసింది. ఈ స్మార్ట్‌ పరికరాలను అమరిస్తే అసలు ఏ పనీ చేయలేని ప్యాసివ్‌ లింబ్స్‌ కూడా కొంత పనిచేయగలుగుతాయి. దివ్యాంగుల సంక్షేమానికి పనిచేస్తున్న పలు ప్రభుత్వ సంస్థల సహకారంతో ఇస్రో వీటిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇంకా రోబో బయోనిక్స్‌, విస్పల టెక్నాలజీస్‌, డీడీ ల్యాబ్స్‌, లైఫ్‌ అండ్‌ లింబ్‌ లాంటి స్టార్టప్‌లు మెషీన్‌ లెర్నింగ్‌, కృత్రిమ మేధ లాంటి సాంకేతికతలను వాడి అవయవాలను తయారుచేసే
పనిలో ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..