ఈ స్కూల్లో ఫీజు.. పదికోట్లకు పైమాటే..!

పిల్లల స్కూలు ఫీజు లక్షకి అటూ ఇటుగా ఉంటేనే కట్టడానికి నానా అవస్థా పడతాం. కానీ స్విట్జర్లాండ్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్‌ లె రోజీ’ అనే బోర్డింగ్‌ స్కూల్లో ఫీజు ఎంతో తెలుసా... ఏడాదికి దాదాపు పదికోట్ల రూపాయలు.

Updated : 10 Apr 2022 00:37 IST

ఈ స్కూల్లో ఫీజు.. పదికోట్లకు పైమాటే..!

పిల్లల స్కూలు ఫీజు లక్షకి అటూ ఇటుగా ఉంటేనే కట్టడానికి నానా అవస్థా పడతాం. కానీ స్విట్జర్లాండ్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్‌ లె రోజీ’ అనే బోర్డింగ్‌ స్కూల్లో ఫీజు ఎంతో తెలుసా... ఏడాదికి దాదాపు పదికోట్ల రూపాయలు. అందుకే ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన విద్యాసంస్థగా గుర్తింపు పొందింది. ఎక్కడైనా చదువేగా చెప్పేది దానికి అంత ఫీజా... అంటారేమో... ఇక్కడ చదువు చెప్పే పద్ధతే వేరుగా ఉంటుందిలెండి... 

‘ఇన్‌స్టిట్యూట్‌ లె రోజీ’... సువిశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య 28 హెక్టార్లలో ఓ పేద్ద ఎస్టేట్‌లా కనిపించే ఈ స్కూలు స్విట్జర్లాండ్‌లోని రోల్‌లో ఉంది. దాదాపు 140 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ బోర్డింగ్‌ స్కూలును రాజుల పాఠశాలగా పిలుస్తారు.

ఎందుకంటే ఇక్కడ చదువుతున్న, చదివిన పిల్లల్లో యువరాజులు, బిలియనీర్ల సంతానం, నటీనటుల వారసులే ఎక్కువ. ఇప్పటివరకూ అలా చదువుకున్న వాళ్లలో ఇరాన్‌ షా, ఈజిప్ట్‌-బెల్జియం-స్పెయిన్‌-బ్రిటన్‌ యువరాజులు, గ్రీస్‌ యువరాణులు, ఎలిజబెత్‌ టేలర్‌ సంతానం... తదితరులు ఉన్నారు.

బోధన ఎంతో భిన్నం

సాధారణంగా అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి పదివరకూ తరగతులు ఉండటం చూస్తుంటాం. కానీ ఎనిమిది నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు చదువుకునే ఈ స్కూల్లో విద్యార్థుల్ని జూనియర్‌, క్యాడెట్‌, జన్‌ సీనియర్‌, సీనియర్లుగా
విభజించి చదువు చెబుతారు. అదేవిధంగా ఇక్కడ నాలుగు విభాగాలలో కలిపి దాదాపు 420 మంది వరకూ విద్యార్థులు ఉంటే... ప్రతి తొమ్మిది లేదా పదిమందికి కలిపి ఒక టీచరు ఉంటారు. పైగా అందరికీ ఒకేలాంటి సబ్జెక్టులు ఉండవు. ఉదాహరణకు జూనియర్లకు తోటపని, మొక్కల పెంపకం, పర్యావరణం, నిత్యం తీసుకునే ఆహారం ఎలా వస్తుంది... వంటివి ఎక్కువగా నేర్పిస్తారు. దశలు దాటేకొద్దీ లెక్కలూ, సైన్స్‌, సోషల్‌ లాంటివాటితోపాటూ ఇతర భాషలూ నేర్చుకునేలా చూస్తారు. ఇక్కడ ఒకవారం ఉన్నట్లుగా మరో వారం ఉండదు. అంటే.. పాఠాల నుంచి అభిరుచుల వరకూ అన్నీ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. రోజీన్స్‌గా పిలిచే ఈ విద్యార్థులు స్కూలు అయిపోయాక తమకు నచ్చిన క్రీడలు, సంగీతం, డాన్స్‌, సినిమాలు తీయడం, టెక్నాలజీ, వంటలు, యోగా, గుర్రపుస్వారీ, సెయిలింగ్‌, ఈత... ఇలా ఏదైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ రోజూ ఓ గంట - నచ్చిన క్రీడనూ, వారంలో ఓ గంట - నచ్చిన కళనూ విద్యార్థులు తప్పకుండా సాధన చేయాలి. ఇక్కడున్న లైబ్రరీలో ఇరవైభాషలకు సంబంధించిన వివిధరకాల పుస్తకాలు ఉంటాయి.

ఆ నియమాలూ ముఖ్యమే..

చదువు, ఆటపాటల సంగతి పక్కన పెడితే... ఇక్కడి నియమాలు పిల్లలకు క్రమశిక్షణనూ, నలుగురితో కలిసి మెలిసి ఉండే ప్రవర్తననూ అలవరుస్తాయి. ఎలాగంటే... పిల్లలు జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడకూడదు. ఇక్కడి హాస్టల్‌లో గదికి ఇద్దరు విద్యార్థులే ఉన్నా.. ఏడాదికి మూడుసార్లు ఆ రూమ్మేట్లూ మారిపోతుంటారు. భోజనం చేసేటప్పుడు కూడా చెప్పినచోటే కూర్చోవాలి. అదేవిధంగా సాటివారికి వడ్డించడం, కిచెన్‌లో సాయం చేయడం వంటివీ తప్పనిసరి. వారాంతాల్లో మాత్రం పిల్లలు షాపింగ్‌, సినిమాలు వంటివాటికి టీచర్లతో కలిసి వెళ్లొచ్చు. ఆ పాకెట్‌మనీ కూడా స్కూలు యాజమాన్యమే ఇస్తుంది. సెలవుల్లో మాత్రం ఇంటికి వెళ్లాలి లేదా స్కూలు ఏర్పాటుచేసే ట్రిప్పులూ క్యాంప్‌లలో పాల్గొనాలి. ‘ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే పిల్లల్ని అందులో పూర్తిస్థాయిలో నిష్ణాతులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం కాబట్టి విద్యార్థుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం’ అంటుంది స్కూలు యాజమాన్యం. ఇప్పుడు అర్థమైందా.. ఇక్కడ ఏడాదికి పదికోట్లరూపాయలకు పైగానే ఫీజు ఎందుకు తీసుకుంటారో...


వీటిని కొనక్కర్లేదు.. అద్దెకు ఇస్తున్నారుగా!

ఒకప్పుడు ఇళ్లను మాత్రమే అద్దెకు ఇచ్చేవారు. ఇప్పుడు ఇంటికి అవసరమైన ఫర్నిచర్‌ నుంచి ఇతర పరికరాలూ, బొమ్మలూ, డిజైనర్‌ దుస్తుల వరకూ ఎన్నింటినో అద్దెకు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ జాబితాలో తాజాగా మరికొన్ని చేరాయి.


ఇంట్లోనే జిమ్‌...

బరువు తగ్గాలంటే నడక, వ్యాయామాలు, యోగాసనాలు... అంటూ బోలెడు చేయాలి. నడవాలన్నా, యోగాసనాలు వేయాలన్నా కాస్త అవగాహన పెంచుకుంటే సరిపోతుంది... ఖర్చూ తక్కువే. కానీ వ్యాయామాలు చేయాలంటే మాత్రం జిమ్‌కు వెళ్లాలి లేదా వాటికి సంబంధించిన పరికరాలను కొనుక్కోవాలి. జిమ్‌లో సభ్యత్వం తీసుకోకుండా వ్యాయామ ఉపకరణాలను కొనుక్కుందామంటే బోలెడు ఖర్చుతోపాటూ అన్నింటినీ రోజూ వాడకపోవచ్చు. దాంతో ఇల్లంతా ఆ సామగ్రితో నిండిపోవడం ఖాయం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు కొన్ని సంస్థలు వ్యాయామ పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. అలా అద్దెకు ఇచ్చే వస్తువుల్లో ట్రెడ్‌మిల్‌, సైకిల్‌, బార్స్‌, బెంచ్‌, రకరకాల కేజీల్లో డంబెల్స్‌, ప్లేట్స్‌.. వంటివెన్నో ఉన్నాయి. నిపుణుల సలహాతో నచ్చినవాటిని ఎంచుకుంటే ఏ ఇబ్బందీ లేకుండా కొన్నాళ్లపాటు ఇంట్లోనే వ్యాయామాలు చేసుకోవచ్చు. అవసరం తీరిపోయాక తిరిగి ఇచ్చేయొచ్చు. పైగా ఎప్పటికప్పుడు వేరే పరికరాలనూ తెచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చే సంస్థల్లో ‘కర్‌లో రెంట్‌’, ‘ఇన్‌హౌస్‌ జిమ్‌’, ‘రెంటోమోజో’... వంటివి అందుబాటులో ఉన్నాయి. ఎంచుకునే పరికరాన్నీ వాడే రోజుల్నీ బట్టి ధర ఉంటుందని చెబుతున్నారు ఈ సంస్థల నిర్వాహకులు.


కుక్కపిల్ల కావాలా...

ఇంట్లో బుజ్జి కుక్కపిల్ల తిరుగుతూ ఉండి... మధ్యమధ్య ఆ పప్పీని ఎత్తుకుని ముద్దు చేస్తుంటే చాలా బాగుంటుంది కానీ... దానికి వేళకు ఆహారం పెట్టడం, అప్పుడప్పుడూ డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లడం వంటివన్నీ పెద్ద బాధ్యతే. ఒకవేళ కుటుంబమంతా కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే దాన్ని ఎవరో ఒకరికి అప్పగించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఊహించే కుక్కపిల్లల్ని పెంచుకునేందుకు వెనుకాడుతుంటారు కొందరు. అలాంటివారు ఇకపైన కుదిరినప్పుడల్లా నచ్చిన కుక్కపిల్లను ఇంటికి తెచ్చుకుని కొన్ని గంటల తరువాత వెనక్కి తిరిగి ఇచ్చేయొచ్చు. అవును... ఇప్పుడు కుక్కపిల్లల్ని కూడా అద్దెకు ఇస్తున్నారు మరి. పసిపిల్లలే తెలియని వారి దగ్గరకు రారు. అలాంటిది కుక్క ఎలా వస్తుందీ...ఒకవేళ వచ్చినా ఉన్న ఆ కాసేపట్లోనే కరిస్తే అదో తలనొప్పి అనే భయం వద్దు. ఎందుకంటే... సాధారణంగా ఏడాది, రెండేళ్లలోపు కుక్కపిల్లల్ని మాత్రమే ఇలా అద్దెకు ఇస్తారు. పైగా కొత్తవాళ్లతో ఎలా వ్యవహరించాలనేదానిపైనా వాటికి ఎంతో కొంత శిక్షణ కూడా ఇస్తారు కాబట్టి ఈసారి కాసేపు కుక్కపిల్లతో గడపాలనుకుంటే ‘మ్యాడ్‌ ఎబౌట్‌ డాగ్స్‌’, ‘బార్క్‌ అండ్‌ బారో’ వంటి సంస్థల్ని సంప్రదించొచ్చు. లేదూ అంటే... ఇప్పుడు కొన్ని కెనెల్స్‌ తమ దగ్గరున్న కుక్కలతో సరదాగా ఆడుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అంటే... వారాంతంలో లేదా సెలవుల్లో అక్కడికి వెళ్లి వాటితో ఆడుకుని వచ్చేయొచ్చు. ‘హ్యాపీ డాగ్స్‌ కెనెల్‌’ అలాంటిదే.


వీడియోగేమ్స్‌ ఆడాలా...

పిల్లలు వీడియోగేమ్స్‌ ఆడటం మొదలుపెట్టారంటే రోజులు గడిచేకొద్దీ... వాళ్లకు అవగాహన పెరిగేకొద్దీ జాయ్‌స్టిక్స్‌ మొదలు ఆ సెటప్‌ మొత్తం కావాలంటూ పేచీ పెడతారు. పైగా ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన సీడీలను అదనంగా కొనాల్సి ఉంటుంది. ఇదంతా బాగానే ఉంటుంది కానీ వాళ్లు పెద్దవాళ్లై... చదువులూ, ఉద్యోగాల పేరుతో బిజీ అయిపోతే - వాటిని ఎవ్వరికీ ఇవ్వలేకా, వృథాగా పక్కన పెట్టేయలేకా బాధపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాటన్నింటి ధర వేలల్లోనే ఉంటుంది మరి. అలాంటి ఇబ్బందేమీ లేకుండా ఉండాలంటే... ఈసారి వాటిని కూడా అద్దెకు తెచ్చుకుంటే సరి. ప్లేస్టేషన్లు, ఎక్స్‌బాక్స్‌, టీవీ, కంట్రోలర్‌, గేమింగ్‌ సీడీలు... వంటివన్నీ ఇలా అద్దెకు ఇచ్చే జాబితాలో ఉన్నాయి. ఇక, ‘మట్టర్‌ఫై’్ల, ‘గేమ్‌ఫ్లాబ్‌’ వంటి సంస్థలే కాదు... పలు గేమింగ్‌ సంస్థలూ, కంప్యూటర్లు విక్రయించే కేంద్రాలు కూడా వీటిని అద్దెకిస్తున్నాయిప్పుడు.


చూశారా.. ‘గుర్రపు డెక్క’ చీరలు..!

గుర్రపుడెక్క... నీటిలో పెరిగే ఒకరకమైన కలుపు మొక్క. ఒకసారి మొలిచిందంటే క్రమంగా మొత్తం చెరువునే కప్పేస్తుంది. ఈ మొక్క నీటి ప్రవాహానికి అడ్డు పడటంతోపాటు ఆక్సిజన్‌ స్థాయిని తగ్గించి జీవులకూ హాని కలిగిస్తుంది. ఎంత తొలగించినా మళ్లీ మళ్లీ పెరిగి సమస్యల్ని సృష్టించే ఈ గుర్రపు డెక్క ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఆదాయపు వనరుగా మారింది. దాంతో ఏమేం చేస్తున్నారంటే...

పశ్చిమ్‌బంగలోని 24 ఉత్తర పరగణ జిల్లాలోని రైతుల ప్రధాన ఆదాయ మార్గం వ్యవసాయం, చేపల సాగు. అయితే అక్కడ రైతులకు ప్రధాన అడ్డంకిగా మారింది చెరువులూ, కాలువల్లో పెరిగే గుర్రపు డెక్క. అది నీళ్లు ముందుకు వెళ్లకుండా ప్రవాహానికి అడ్డుపడి పంటకి నీరు అందకుండా చేస్తుంది. నీటిలోని అధికశాతం ఆక్సిజన్‌ని తీసుకుని విషవ్యర్థాలను విడుదల చేస్తుంది. దాంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రొయ్యలూ చేపలూ చనిపోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఆ పరిస్థితుల్ని గమనించిన ‘నేచర్‌ క్రాఫ్‌’్ట, ‘స్వచ్ఛతా పుకారే’ అనే రెండు స్థానిక స్వచ్ఛంద సంస్థలు రైతులకు పరిష్కారం చూపాలనుకున్నాయి. అప్పుడే ఈ సంస్థలకు జంషెడ్‌పూర్‌లోని టాటాస్టీల్‌ యుటిలిటీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసెస్‌లో పనిచేస్తున్న గౌరవ్‌ ఆనంద్‌ పరిచయం అయ్యాడు. అతను పర్యావరణ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాక పలు ప్రయోగాలు చేసి గుర్రపుడెక్క నుంచి జనపనార మాదిరిగా దారం తీసి చీరలు తయారు చేసే పద్ధతిని కనిపెట్టాడు. దాంతో రైతుల్ని స్వయం సహాయక బృందాలుగా ఏర్పరచి గౌరవ్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాయి స్వచ్ఛంద సంస్థలు.

రెండు విధాలా మేలు...

ముందు గుర్రపు డెక్కను ఎండబెట్టి దాన్నుంచి నార తీస్తారు. ఆ నార నుంచి నూలు యంత్రాల సాయంతో సన్నని దారపు పోగుల్ని తయారు చేస్తారు. ఈ పోగులతో పశ్చిమ్‌బంగ సంప్రదాయ తాంత్‌ చీరల్ని నేస్తున్నారు. ఈ పోగులకు సహజ రంగులు కూడా అద్ది రంగురంగుల చీరల్ని ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చీరల తయారీకి పలు సంస్థలు పెట్టుబడులు పెట్టడానికీ మార్కెటింగ్‌ చేయడానికీ ముందుకొస్తున్నాయి. అలానే చీరలతోపాటు చాపలూ, యోగా మ్యాట్లూ, టేబుల్‌ మ్యాట్లూ, వాల్‌ టైల్స్‌, అలంకరణకు వాడే విద్యుత్‌ దీపాలూ, బుట్టలూ, పూల సజ్జలూ వంటి వాటినీ తయారు చేస్తున్నారు అక్కడి మహిళలు. ఈ ఉత్పత్తుల్ని స్థానిక మాల్స్‌లోనూ, ప్రభుత్వం ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లలోనూ రైతులే నేరుగా అమ్ముకునే సౌలభ్యాన్నీ కల్పించాయి స్వచ్ఛంద సంస్థలు. ఇప్పుడు 24 ఉత్తర పరగణ జిల్లాలోని చాలా పల్లెల్లో రైతులు ఇదే వృత్తిని ఎంచుకున్నారు. మహిళలు గుర్రపు డెక్కతో చీరలూ, కళాకృతులూ చేస్తుంటే- మగవారు వాటిని సేకరించడం, ఎండబెట్టి నారతీయడం వంటి పనులతో ఆడవాళ్లకి సాయపడుతున్నారు. అంతేకాదు, చేపల చెరువులు కూడా సాగు చేస్తూ ఎప్పటికప్పుడు గుర్రపు డెక్క అడ్డు తొలగించుకుని స్వయం సహాయక సంఘాలకు దాన్ని అమ్మేస్తున్నారు కొందరు. మరోవైపు గుర్రపు డెక్క బెడదా తొలగి చెరువుల్లో చేపలూ, రొయ్యలూ కూడా చక్కగా పెరిగి లాభాÅలు తెచ్చిపెడుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..