త్రికోటేశ్వర స్వామి...కోటప్పకొండ

పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ. సృష్టికర్త బ్రహ్మదేవునికే జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా యుగయుగాల నుంచి ఖ్యాతిచెందింది. ‘చేదుకో కోటయ్య.. మమ్మాదుకోవయ్యా...’ అంటూ యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయం...

Updated : 09 Oct 2023 12:44 IST

పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ. సృష్టికర్త బ్రహ్మదేవునికే జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా యుగయుగాల నుంచి ఖ్యాతిచెందింది. ‘చేదుకో కోటయ్య.. మమ్మాదుకోవయ్యా...’ అంటూ యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయం గుంటూరు జిల్లా నరసరావు పేట సమీపంలోని కోటప్పకొండ గ్రామంలో ఉంది. మహాశివరాత్రి పర్వదినాల్లో అత్యంత రద్దీగా భక్తజనంతో నిండిపోతుంది.

దేవాలయ చరిత్ర 

దీనికి కచ్చితమైన ఆధారాలేమి లేకపోయినప్పటికీ శాసనాల ఆధారంగా ఈ ఆలయాన్ని క్రీ.శ 1172లో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులలో ఒకరైన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు భూరి విరాళాలు ఇచ్చారని శాసనాలు తెలుపుతున్నాయి. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కొండను ఏ కోణం నుంచి చూసిన మూడు శిఖరాలు కనబడుతుంటాయి. అందుకే దీనికి త్రికూటాచలమనే పేరు వచ్చింది. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు.

పురాణ కథనం 

శివుడు దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత బాలదక్షిణామూర్తి అవతారంలో బాలునిగా మారి కైలాసంలో కఠిన తపస్సును ఆచరిస్తూంటాడు. ఆ సమయంలో బ్రహ్మ దేవతలందరితోను కలిసి దక్షిణామూర్తిని సందరిస్తాడు. స్వామి వారిని మాకు జ్ఞానబోధ చేయమని వేడుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు త్రికూటాచలానికి వస్తే జ్ఞానాన్ని ఇస్తానని చెప్తాడు. అప్పుడు బ్రహ్మతో పాటు ఇతర దేవతలందరు కూడా త్రికూటాచలానికి వస్తారు అప్పుడు శివుడు త్రికూట కొండపైనే వెలసి వారందరికి జ్ఞానోపదేశాన్ని బోధిస్తాడు. ఆ ప్రదేశంలో ఉన్న గుడికే పాత కోటప్పగుడి అని పేరు. ఆలయం లోపలి లింగం కేవలం ఒక్క అడుగు మాత్రమే ఉంటుంది. గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరమని, పక్కన ఉన్న శిఖరాన్ని విష్ణు శిఖరమని అంటారు.

దక్ష యజ్ఞం సమయంలో హవిస్సును స్వీకరించిన పాపం పోవడానికి విష్ణువు ఈ శిఖరం పై తపస్సు ఆచరిస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో నేల మీద పొడుస్తాడు. అలా పొడిచినప్పుడు ఏర్పడ్డ రంధ్రాల నుంచి వచ్చిన జలాన్ని స్వీకరించి స్నానమాచరిస్తే సకల పాపాలు తొలుగుతాయని చెప్తాడు. విష్ణువు శివుడు చెప్పిన విధంగా చేసి తన పాపాలను పోగొట్టుకుంటాడు. ఆ విధంగా ఇక్కడ వెలసిన శివున్ని పాపవినాశనేశ్వరుడనే పేరుంది. 

రుద్ర శిఖరానికి నైరుతి భాగంలో ఉన్న శిఖరానికి బ్రహ్మ శిఖరమని పేరు. రుద్రవిష్ణు శిఖరాలపై స్వయంభువుగా లింగాలు వెలిశాయి. కానీ బ్రహ్మ శిఖరం పై ఏమి లేకపోవడంతో బాధపడిన బ్రహ్మ శివుని కోసం తపస్సు చేసి లింగావిర్భవం అయ్యేటట్లు చేస్తాడు. ఈ ప్రదేశానికి తూర్పున మునిమంద/ ఎల్లమంద అనే పేర్లు గల చిన్న పల్లెటూరు ఉంది. ముందుగా బ్రహ్మదిదేవతలంతా ఈ ప్రదేశంలో ఉన్నారని అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని ప్రశస్తి.   బ్రహ్మ శిఖరం మీద ఉన్న లింగానికే కొత్త కోటప్పకొండ అని పేరు.

మహాభక్తురాలు.. ఆనందవల్లి.. 

స్థలపురాణం ప్రకారం శివభక్తుడైన సాలంకయ్యకు శివఅనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది.  పరమేశ్వరుడు కొన్ని రోజుల పాటు జంగమదేవర రూపంలో అతని ఇంటికి వచ్చేవాడు. కొన్నాళ్లకు కనిపించలేదు. దీంతో సాలంకయ్య నిరాశ చెందాడు. ఆ సమయంలోనే ఒక దంపతులకు ఆనందవల్లి అనే పాప జన్మించింది. పెరిగేకొద్ది శివునిపై భక్తి పెంచుకొని శైవగీతాలు ఆలపించేది. కొంతకాలం అనంతరం తపస్సు చేయడంతో స్వామి ప్రత్యక్షమయ్యారు. ఆనందవల్లి ప్రతిరోజూ రుద్రాచలానికి వచ్చి శివలింగానికి పూజలు నిర్వహించేది. ఈ సంగతి తెలుసుకున్న సాలంకయ్య తనకు కూడా శివదర్శనం ఇప్పించాలని కోరాడు. అయితే ఆమె అంగీకరించక శివుని ఆరాధనలో కొనసాగింది. ఒక రోజు అభిషేకం కోసం జలం తీసుకువెళుతుండగా నీటి కొరకు ఒక కాకి బిందె మీద వాలింది. దీంతో ఆగ్రహించి కాకులు ఇక్కడకు రాకూడదని శాపం పెట్టింది. ఇప్పటికీ కాకులు ఈ క్షేత్రంలో రాకపోవడం విశేషం. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను కుటుంబజీవితం కొనసాగించమని బ్రహ్మచారిణిగా ఉన్న ఆమెను గర్భవతిగా మారుస్తాడు. అయినా ఆమె శివారాధన చేయడం మానలేదు. ఆమె భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై తానే ఆమె వెంట వచ్చి పూజలు స్వీకరిస్తానని అయితే ఇంటికి వెళ్లే సమయంలో తిరిగి చూడకుండా వెళ్లాలని ఆజ్ఞాపిస్తాడు. ఆనందవల్లి కొండ మెట్లు దిగుతూ ఒక చోట కుతూహలం కొద్దీ వెనక్కు తిరిగి చూడటంతో స్వామి వెంటనే అక్కడ వున్న గుహాలో లింగరూపం ధరించాడు. ఆనందవల్లికి కుమారుడు జన్మించాడు. తాను వెనక్కు తిరిగిచూడటంపై వల్లి బాధపడింది. మరణానికి సిద్ధం కావడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో బాలుడు కూడా అదృశ్యమవుతాడు. ఇదంతా శివమాయ అని ఆనందవల్లి గ్రహిస్తుంది. అనంతరం శివునిలో ఆమె ఐక్యమైంది.

ప్రభలు.. 

మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా సాగుతోంది. జంగమయ్య చిత్రాలతో చిన్న ప్రభల నుంచి భారీ ఎత్తున ప్రభలను వూరేగింపుగా తీసుకువస్తారు. కొన్ని ప్రభలు యాభై అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండటం విశేషం. గతంలో ఎడ్లబండ్లలో తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

దర్శన వేళలు 

ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. స్వామివారికి అర్చన, ఉచిత దర్శనం సమయంలో తీసుకుంటే రూ.5 టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ప్రత్యేక దర్శనం రూ.75, అష్టోత్రం రూ.100, అభిషేకం దంపతులకు మాత్రమే రూ.200, పంచ హారతి ఒక్కొక్కరికి రూ.100, పిల్లలకు అన్నప్రాసన చేయిస్తే రూ.150, అక్షరాభ్యాసం చేయిస్తే రూ.150 వీటితో పాటు వాహన పూజలు చేయించుకోవచ్చు. నవగ్రహ పూజ, శనిత్రయోదశి సందర్భాల్లో రూ.200 చెల్లించి పూజలు చేయించుకోవాలి. శాంతి యాదశాల పూజకు రూ.1116లు, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం (ఒకే కుటుంబానికి) రూ.1116లు చెల్లించాల్సి ఉంటుంది. మూలవిరాట్‌ అభిషేకం పర్వదినాల్లో అయితే రూ.400 చెల్లించాలి. ఇవి కాకుండా ప్రత్యేక స్కీములు ద్వారా కూడా స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. జీవితకాల అభిషేకం (పదేళ్లు) రూ.2116లు, జీవిత కాల అష్టోత్రం (10 ఏళ్లు) రూ.1116లు, నిత్య గోత్రనామ పథకం ఏడాదికి రూ.1116లు చెల్లించాలి. కొండ వద్ద వసతిగృహాలు ఉన్నాయి. ఆనందవల్లి అతిథిగృహంలో గదికి రూ.250 చెల్లించాలి. తోట వారి అతిథిగృహంలో అయితే రూ.300, నంది అతిథిగృహంలో రూ.750 చొప్పున రుసుములు చెల్లించాల్సి ఉంది.

పర్యాటక క్షేత్రం 

కోటప్పకొండ పర్యావరణ పర్యాటక క్షేత్రంగానూ అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే భక్తుల కోసం బోట్‌ షికారు, టాయ్‌ ట్రైన్‌, బోట్‌ షికారు కోసం కాళింది మడుగు, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆట వస్తువులతో ఏర్పాటు చేసిన పిల్లల రాజ్యం, అక్వేరియం ప్రత్యేకంగా ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. త్వరలో తీగమార్గం రాబోతోంది. కార్తీక మాసం అనగానే సహజంగానే వనభోజనాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. అనేక పట్టణాల నుంచి, పిల్లల నుంచి పాఠశాలల విద్యార్థులను కార్తీక మాసంలో ఇక్కడ క్షేత్రానికి తీసుకువచ్చి అన్ని చూపించి భోజనాలు ఆయా పాఠశాలల యాజమాన్యాలే ఏర్పాటు చేస్తున్నాయి. ఇవికాకుండా కొండ కింద అన్ని సామాజిక వర్గాలకు అన్నదాన సత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సత్రాలకో ప్రత్యేకత ఉంది. గతంలో అయితే పండుగల సమయంలోనే ఉచిత భోజనం ఉంది. ఇప్పుడు భక్తులు ముందుగా వచ్చి చెబితే నిత్యం భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

రాకపోకలకు మార్గాలు 

విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకలూరిపేట మీదుగా, నరసరావుపేట మీదుగా కూడా కోటప్పకొండకు చేరుకోవచ్చు. సత్తెనపల్లి, పెదకూరపాడు ప్రాంతాల భక్తులు నరసరావుపేట మీదుగానే కోటప్పకొండకు చేరవచ్చు. మాచర్ల, గురజాల, కారంపూడి యాత్రికులు కూడా నరసరావుపేట మీదుగా కోటప్పకొండకు వెళ్లే మార్గం ఉంది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి, కురిచేడు, త్రిపురాంతంకం, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల భక్తులు వినుకొండ మీదుగా నరసరావుపేట వచ్చే మార్గంలో పెట్లూరివారిపాలెం మీదుగా కోటప్పకొండకు చేరవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని