కోదండరాముడి కథలో కులశేఖర ఆళ్వారు పారవశ్యం

విశిష్ట అద్వైతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన పన్నెండుమంది ఆళ్వారుల్లో కులశేఖర ఆళ్వారు ప్రముఖులు. వారు కేరళలోని తిరువాన్కూరు రాజ్యానికి ప్రభువు. ఆయనకు రామాయణం అంటే అమిత భక్తిప్రపత్తులు. ఎప్పుడు ఎవరు రామాయణ గాథను పఠిస్తున్నా ఆలకిస్తూ ఆ కథలో నిమగ్నమైపోయేవారు.

Published : 22 Jun 2023 00:32 IST

విశిష్ట అద్వైతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన పన్నెండుమంది ఆళ్వారుల్లో కులశేఖర ఆళ్వారు ప్రముఖులు. వారు కేరళలోని తిరువాన్కూరు రాజ్యానికి ప్రభువు. ఆయనకు రామాయణం అంటే అమిత భక్తిప్రపత్తులు. ఎప్పుడు ఎవరు రామాయణ గాథను పఠిస్తున్నా ఆలకిస్తూ ఆ కథలో నిమగ్నమైపోయేవారు. ఈ నేపథ్యంలో ఓసారి తిరువాన్కూరు ఆస్థానంలో రామాయణ కావ్యఘట్టాలను పండితుడు మధురంగా వినిపిస్తున్నాడు. కథా గమనంలో భాగంగా ఆయన ‘ఒంటరి రాముడి మీదకు ముప్పై వేలమంది ఖరదూషణ త్రిశిరాదులు దండెత్తి వచ్చారు’ అని వివరిస్తున్నాడు. వెంటనే కులశేఖరాళ్వారు ‘ఏమీ? ఒక్క రాముడు.. ముప్పై వేల మంది రాక్షసులా? పదండి! మనం సాయానికి బయల్దేరాలి. సైనికులను సిద్ధం చేయండి!’ అని సైన్యాధ్యక్షుణ్ణి ఆదేశించారు. తనూ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. మంత్రులూ, సైనికులూ ఆశ్చర్యపోయారు. పరిస్థితి ఎటు దారితీస్తుందో అర్థంకాలేదు. పరుగు పరుగున రామాయణాన్ని వర్ణిస్తున్న పండితుడి వద్దకు వెళ్లారు. అప్పుడు వారు ‘ధర్మాత్ముడైన రాముడు ఒక్కడే ముప్పై వేలమంది రాక్షసులను కూల్చాడు’ అని ఉద్ఘాటిస్తూ..
తతస్తు తం రాక్షససంఘమర్దనం సభాజ్యమానం ముదితైర్మహర్షిభిః
పునః పరిష్వజ్య శశిప్రభాననా బభూవ హృష్టా జనకాత్మజా తదా ఈ శ్లోకం చెప్పారు. ‘రాముడు రాక్షసులను సంహరించగా మహర్షులు సంతోషించారు. అలాంటి రాముణ్ణి చంద్రముఖి జానకి చూసి ఆనందపరవశంతో హృదయానికి హత్తుకుంది’ అంటూ వివరించారు. అది విని కులశేఖర ఆళ్వారు సైన్యాన్ని మరలించారు. శ్రీరామచంద్రుడు గెలిచినందుకు తిరువనంతపురంలో సంతోష సంబరాలు నిర్వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు