అమ్మ చూపిన మార్గం

పదముల హతి పద్ధతి. అంటే నలుగురు నడిచిన లేదా నలుగురు నడవాల్సిన మార్గం పద్ధతి. అదే సమాజానికి మార్గదర్శకం. దీన్నే గీతాచార్యుడు ‘యద్యదాచరతి శ్రేష్ఠః’ అన్నాడు.

Published : 22 Jun 2023 00:42 IST

పదముల హతి పద్ధతి. అంటే నలుగురు నడిచిన లేదా నలుగురు నడవాల్సిన మార్గం పద్ధతి. అదే సమాజానికి మార్గదర్శకం. దీన్నే గీతాచార్యుడు ‘యద్యదాచరతి శ్రేష్ఠః’ అన్నాడు. పాండిత్యపు దారులంట పరుగులెట్టే ఆధ్యాత్మిక రథాన్ని భూమార్గం పట్టించి పారమార్థిక భావనను, పరమాత్మ తత్వాన్ని పామరుల ముంగిట నిలిపిన ఆధ్యాత్మిక సామ్యవాది జిల్లెళ్లమూడి అమ్మ. పాండిత్యంతో బెదరగొట్టే పదాడంబరం నిండిన పరమాత్మ తత్వాన్ని సులువైన, సరళమైన మాటల్లో వివరించి పామరులను కూడా ఆధ్యాత్మిక మార్గంలో వేలుపట్టి నడిపించిన కల్పవల్లి జిల్లెళ్లముడి అమ్మ.
ఒక స్వామీజీ అమ్మతో ధార్మిక విషయాలు చర్చిస్తూ ‘అమ్మా! ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలకు తేడా ఏమిటి?’ అనడిగారు. అమ్మ ఎదురుగా ఉన్న అరటిపండును చూపి ‘ఇది అద్వైతం. అరటిపండు పూర్తిగా ఒలిచి తొక్కను, పండును విడివిడిగా ఉంచితే ద్వైతం. ఇదిగో.. తొక్కను సగానికి ఒలిస్తే విశిష్టాద్వైతం’ అంటూ అరటిపండు ఒలిచి నోటికి అందించినంత సులభంగా ఆధ్యాత్మిక రహస్యాన్ని బోధించింది. అలాగే శ్రోతల స్థాయిని బట్టి అమ్మ వివరించే తీరు మారుతుంది. ‘అద్వైతం అంటే ఏమిటమ్మా?’ అనడిగిన ఒక గృహిణితో ‘కూతుర్నీ కోడల్నీ సమానంగా చూడటమే అద్వైతం’ అంటూ నవ్వింది అమ్మ. మరో ఇల్లాలికి ‘నీ బిడ్డలో ఏం చూస్తున్నావో అందరిలో దాన్ని చూడటమే బ్రహ్మస్థితి’ అంటూ వివరించింది. విశ్వంలోని సర్వవస్తువులూ ఒకే శక్తి భిన్నరూపాలుగా కనిపించడమే విశ్వరూప సాక్షాత్కారం.. అంతటా తానుగా (ఆత్మగా) కనిపించటమే ఆత్మసాక్షాత్కారం- అట. ఇదే కదా పరమాత్మ గీతలో చెప్పిన ఆత్మవత్‌ సర్వభూతాని. సంకల్ప రాహిత్యం అంటే సంకల్పాలు లేకపోవడం కాదు, అన్నీ భగవంతుడు ఇచ్చినవేనని భావించడమట! అలాగే రూపరహితుడంటే రూపం లేనివాడు కాదు అన్ని రూపాలూ తనవే అయినవాడని, నామరహితుడంటే అన్నీ నామాలూ తనవే అయినవాడని ప్రవచించింది అమ్మ. మానవత్వం, మాధవత్వం, సిద్ధి, సాధన, ధ్యానం, స్వర్గం, కైవల్యం, దేవుడు, దెయ్యం, నైవేద్యం, మౌనం, పెళ్లి, వివేకం- ఇలా అనేకానేక విషయాలను అమ్మ నిర్వచించిన తీరు జ్ఞానదాయకం.
డా.ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని