త్రిమూర్తులతో సమానుడు

భూమ్యాకాశాలు ఉన్నంత వరకూ శాశ్వతంగా నిలిచే వేదమంత్రాలను చతుర్వేదాలుగా విభజించాడు. పంచమవేదంగా స్తుతించే మహాభారతాన్ని సృజించాడు. సృష్టి ఆది నుంచి అంతం వరకు జరిగే వివిధ పరిణామాలు, కాలస్వరూపాన్ని విశదపరిచే అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలూ రచించాడు.

Updated : 29 Jun 2023 02:58 IST

భూమ్యాకాశాలు ఉన్నంత వరకూ శాశ్వతంగా నిలిచే వేదమంత్రాలను చతుర్వేదాలుగా విభజించాడు. పంచమవేదంగా స్తుతించే మహాభారతాన్ని సృజించాడు. సృష్టి ఆది నుంచి అంతం వరకు జరిగే వివిధ పరిణామాలు, కాలస్వరూపాన్ని విశదపరిచే అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలూ రచించాడు. ఆ వేదవ్యాసుడు నారాయణాంశ సంభూతుడు.

అచతుర్వదనో బ్రహ్మాద్విబాహురపరోహరిః

అఫాలలోచనః శంభుః భగవాన్‌ బాదరాయణః

నాలుగు ముఖాలు లేకున్నా బ్రహ్మదేవుడితో సమానుడు వ్యాసభగవానుడు. రెండు చేతులే ఉన్నా శ్రీమహావిష్ణువుకు సాటి. మూడో కన్ను లేకపోయినా సాక్షాత్తు పరమశివుడే. ఇంతటి మహర్షి గురువు కావడం మన అదృష్టం.

ఈ మహనీయుడు జన్మించిన ఆషాఢ పౌర్ణమి గురుపూర్ణిమగా వేడుక చేసుకోవడం ఆచారమయ్యింది. మన జీవితకాలంలో ఎందరి నుంచో ఎన్నో నేర్చుకుంటాం. వారందరికీ కృతజ్ఞతలు చెప్పే అవకాశం తారసపడకపోవచ్చు. గురుపూర్ణిమ నాడు వ్యాసుడి వంశక్రమాన్ని తెలియజేసే..

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్‌

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌

ఈ శ్లోకాన్ని పఠిస్తే గురువులందరి ఆశీస్సులూ అందుతాయంటారు.

అజ్ఞానపు తిమిరంతో నిండి ఉండే మన హృదయక్షేత్రాన్ని సద్గురు బోధనా కిరణాలు ప్రకాశవంతం చేయడంతో పదుగురి మన్ననలు అందుకుంటాం. మన సంస్కృతిలో గురువుకు విశిష్ట స్థానముంది. తల్లిదండ్రుల తర్వాత దైవం కన్నా ముందు గురువే ప్రస్తుతి పొందాడు.

ఎవరు నిజమైన గురువు

గురువు అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిచ్చేవారు. ఎలాంటి గురువును ఆశ్రయిస్తే జ్ఞానదాహం తీరుతుందో గురుగీత తెలియజేసింది. విద్యాబోధతో ధనాన్ని ఆర్జించేవారే ఎక్కువే. కానీ శిష్యుడి హృదయతాపాన్ని పోగొట్టే గురువులు అరుదు. అలాంటి సద్గురువు లభిస్తే ఎన్నడూ దూరం చేసుకోకూడదు.

గురవో బహవః సంతి శిష్యవిత్తాపహారకాః

తమేకం దుర్లభం మన్యే శిష్య హృత్తాప హారకమ్‌

గురువు నామాన్ని మనసులో స్మరించి నంతనే అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి ప్రతిమను పూజించి సర్వవిద్యల్నీ నేర్చుకున్న సంగతి తెలిసిందే. గురువు దైవంతో సమానమని, ఆయన్ని దర్శించుకున్నంతలో పాపాలు తొలగుతాయని చెబుతారు.

యో విష్ణోః ప్రతిమాకారే లోహబుద్ధిం కరోతిచ

యో గురౌ మానుషం భావ ముఖానరకపాతినౌ

విష్ణుమూర్తిని కేవలం ప్రతిమగా, గురువును మానవమాత్రుడిగా భావించేవారు నరకానికి పోతారన్నది ఈ శ్లోకభావం. మన మనసుల్లో పేరుకున్న అజ్ఞానాన్ని తొలగించేందుకు నారాయణుడు ధరించిన మరో అవతారమే వ్యాసుడి రూపం.

గురువు మందలింపు

తల్లిదండ్రుల్లాగే మన జీవితం బాగుండాలని మనసా వాచా కోరుకుంటాడు గురువు. బాల్య, యవ్వనాల్లో ఇంట్లో కంటే ఎక్కువ సమయం గురువు చెంతనే గడుపుతాం. విద్యతోబాటు వ్యక్తిత్వం, సత్ప్రవర్తనలు నేర్పేది గురువులే. మన దోషాలను సరిదిద్ది ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి ఒక్కోసారి మందలింపో, దండింపో కద్దు. ఇది వ్యక్తిగత కక్ష కాదు. ఈ దండన గురించి..

సామృతైః పాణిభర్హన్తి గురువో న విషోక్షితైః

లాలనా శ్రయిణో దోషా స్తాడనాశ్రయితో గుణాః

వ్యాసుడు చెప్పిన శ్లోకమిది. గురువర్యులు అమృతతుల్య హస్తాలతో దండిస్తారే గానీ విషపు చేతులతో కాదు. లాలనతో దోషాలు, దండనతో సద్గుణాలు కలుగుతాయి. దీపం వేల జ్యోతులను వెలిగించినట్లు సదాచార సంపన్నుడై ప్రతిభా సామర్థ్యాలున్న గురువు శిష్యులను తనంతటి వారిగా మలచి సమాజానికి అందిస్తాడు. గురువుల గొప్పదనాన్ని గుర్తించి వ్యాస పూర్ణిమ నాడు వారి ఆశీస్సులను అందుకోవడం మన సంస్కృతి, సంప్రదాయం.

రామచంద్ర కనగాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు