కనకవర్షం కురిపించిన ఆదిశంకరులు

సనాతన భారతీయ మార్గాన్ని తేజోమయం చేసిన ఆదిశంకరాచార్య ఎనిమిళ్లకే నాలుగు వేదాలూ, పన్నెండేళ్ల చిరుప్రాయంలో సర్వశాస్త్రాలూ నేర్చుకున్నాడు.

Published : 06 Jul 2023 00:37 IST

అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశే సర్వశాస్త్ర విత్‌
షోడశే కృతవాన్భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్‌

సనాతన భారతీయ మార్గాన్ని తేజోమయం చేసిన ఆదిశంకరాచార్య ఎనిమిళ్లకే నాలుగు వేదాలూ, పన్నెండేళ్ల చిరుప్రాయంలో సర్వశాస్త్రాలూ నేర్చుకున్నాడు. పదహారేళ్ల కౌమారంలో బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి ముప్పైరెండేళ్లకే అస్తమించిన మధ్యాహ్న మార్తాండుడు.

అత్యంత గుణమేధావి చతుర్నా మేక భాజనమ్‌
అల్పాయు రనమత్యో వా దరిద్రోహి రుజానతా భవిష్యతి

అత్యధిక ప్రతిభ, అల్పాయుష్షు, సంతానహీనత, దారిద్య్రం, దీర్ఘరోగం- అంటూ మృచ్ఛకటికంలో శూద్రకుడి వర్ణన శంకరాచార్య విషయంలో నిజమైనట్లు తోస్తుంది.
చదువుకుంటున్న రోజుల్లో శంకరులు ఓ పేదరాలింటికి భిక్షాటనకు వెళ్లారు. పెట్టేందుకు ఏమీలేక పాత్రలో ఉసిరికాయ వేసిందామె. ఆయన మనసు కరిగి 22 శ్లోకాల కనకధారాస్తోత్రం చదవగా కనకవర్షం కురిసి ఆమె దైన్యత తొలగింది. మరో సందర్భంలో గోవిందుడనే గురువు వద్దకెళ్లి తనను శిష్యుడిగా స్వీకరించమని అడిగితేే ఇంతకీ నువ్వెవరివి- అన్నాడాయన. నేతి, నేతి (ఇది కాదు, ఇది కాదు) అంటూ పరిశేష న్యాయంతో...

నభూమిర్నతోయం న తేజో న వాయుః
న ఖం నేంద్రియం వా న తేషాం సమూహః
అనేకాన్తికత్వాత్‌ సుషుప్త్యేక సిద్ధః
తదేకోవశిష్టః శివః కేవలోహమ్‌

నేను పంచ భూతాలైన భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం వంటి రూపాలేవీ కాను. ఇంద్రియాల సమూహాన్నీ కాను. అవన్నీ అస్థిరమైనవేనంటూ చివరికి మిగిలే మంగళకరమైన ఆత్మ తానని 10 శ్లోకాల్లో సమాధానమిచ్చాడు. అదే ‘దశ శ్లోకి’గా ప్రసిద్ధమైంది.

శంకరాచార్య ఉత్తరాన బదరీనాథ్‌లో జ్యోతిష్పీఠం, పశ్చిమాన ద్వారకలో కాళికా పీఠం, తూర్పున పూరీ జగన్నాథంలో గోవర్ధన పీఠం, దక్షిణాన శృంగేరిలో శారదా పీఠం, కంచిలో కామకోటి పీఠం స్థాపించాడు. ఈ పీఠాధిపతులను పరంపరగా శంకరాచార్య పేరుతోనే పిలవడం ఆచారం. అందుకే ఆయన్ను ఆదిశంకరాచార్యుడు అంటున్నాం.

రామచంద్ర కనగాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని