నేను మీ పాలేరునే!

ఒక పాలేరు- అన్నం వడ్డిస్తుంటే.. తనకు జావ కూడా కావాలని వంటమనిషిని అడిగాడు. అక్కడే ఉన్న జమీందారు ‘నీకు భోజనం పెట్టడమే ఎక్కువ.

Published : 07 Sep 2023 02:09 IST

క పాలేరు- అన్నం వడ్డిస్తుంటే.. తనకు జావ కూడా కావాలని వంటమనిషిని అడిగాడు. అక్కడే ఉన్న జమీందారు ‘నీకు భోజనం పెట్టడమే ఎక్కువ. ఇంకా జావ కూడానా?’ అన్నాడు చిరాగ్గా. పాలేరు విరక్తిగా ‘ఎందుకీ జీవితం?’ అనుకుని భోజనం చేయ కుండానే వెళ్లిపోయాడు. అలా పట్నం వెళ్లి ఒక మఠం అరుగు మీద కూర్చున్నాడు. అక్కడి సాధువులు జరిగింది తెలుసుకుని, అన్నం పెట్టి.. అతణ్ణి మఠంలోనే ఉండమన్నారు. వారి సాంగత్యంలో అతడు ఔన్నత్యం సాధించాడు. అతడికి చదువుకోవాలనే ఆశ కలిగిందని తెలిసి.. సాధువులు అతణ్ణి కాశీకి పంపారు. అక్కడ పాండిత్యం సంపాదించి.. కాలక్రమంలో మఠాధిపతి అయ్యాడు. ఒకరోజు గతంలో అతడు పనిచేసిన జమీందారు వచ్చి, తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. పండితుడితో సహా సాధువులు భోజనానికి కూర్చున్నారు. జమీందారు వినయంగా ‘స్వామీ! నా చేతులతో మిఠాయి వడ్డించనివ్వండి’ అన్నాడు. పండితుడు నవ్వి ‘నేను ఒకప్పటి మీ పాలేరుని. గుర్తించలేదా? అప్పుడు వేడుకున్నా గంజి కూడా ఇవ్వలేదు. ఈరోజు తమరు బతిమాలి తినమంటున్నారు’ అన్నాడు. సజ్జన సాంగత్యం నిరక్షరాస్యులకూ జ్ఞానం ప్రసాదిస్తుంది. కోటీశ్వరులు కూడా ప్రణమిల్లేలా చేస్తుంది. డబ్బు కంటే జ్ఞానం గొప్పదంటూ రామకృష్ణ పరమహంస చెప్పిన కథ ఇది.     

పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని