తల్లికే కనువిప్పు కలిగించాడు

వేదాలు, భగవద్గీత, తదితర గ్రంథాలను పరిశోధించి రచనలు చేశారు బాలగంగాధర్‌ తిలక్‌. స్వాతంత్య్రోద్యమనేతగానే కాదు, ఆధ్యాత్మికవేత్తగానూ మన్నన పొందారు.

Updated : 21 Sep 2023 03:05 IST

వేదాలు, భగవద్గీత, తదితర గ్రంథాలను పరిశోధించి రచనలు చేశారు బాలగంగాధర్‌ తిలక్‌. స్వాతంత్య్రోద్యమనేతగానే కాదు, ఆధ్యాత్మికవేత్తగానూ మన్నన పొందారు. గాంధీజీ ఆ లోకమాన్యుడిని గురువుగా భావించారు. తల్లి పార్వతీబాయి నేర్పిన నైతిక విలువలు, పురాణేతిహాసాలు ఆయన్ను గొప్ప ధార్మికుడిగా తయారుచేశాయి. చిన్నతనంలో మాతృమూర్తి ‘నాయనా! మనకున్నది ఇతరులతో పంచుకోవాలి. ఉదారంగా ఎదుటివారికి ఇచ్చిన ఏ వస్తువునూ తిరిగి తీసుకోకూడదు’ అని చెప్పేవారట. ఒకరోజు ఓ సాధువు వారి ఇంటి ముందు నిలిచి ‘భవతీ భిక్షాం దేహి’ అన్నాడు. పార్వతీబాయి అలవాటు ప్రకారం పాత్రలో బియ్యం తెచ్చి అతడి జోలెలో వేసింది. బాల తిలక్‌ ఆ సమయంలో తల్లి వెంటే ఉన్నాడు. సాధువు జోలెలో బియ్యంతో పాటు బంగారు ఉంగరం కూడా పడింది. ఆ రోజుల్లో గృహిణులు చిన్న చిన్న బంగారు ఆభరణాలను బియ్యండబ్బా, పోపుల డబ్బాల్లో దాచేవారు. అలా దాచిన ఉంగరం పడేసరికి.. అప్రయత్నంగా ఆమె దాన్ని తీసుకోబోయింది. తిలక్‌ వెంటనే ‘వద్దమ్మా! నువ్వే కదా ఒకరికి ఇచ్చిన ఏ వస్తువునైనా తిరిగి తీసుకోకూడదని చెప్పావు!’ అన్నాడు. ఆ మాటతో పార్వతీబాయి చలించిపోయింది. చెమ్మగిల్లిన కళ్లలో కొడుకును హృదయానికి హత్తుకొని ‘నా కళ్లు తెరిపించావు నాయనా! భవిష్యత్తులో నువ్వింకా గొప్పవాడివి కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అంది.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు