అదీ స్థల ప్రభావం!

శ్రవణకుమారుడు వృద్ధులు, అంధులు అయిన తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ తీర్థయాత్రలకు బయల్దేరాడు. ఒక రాత్రి బస చేయటానికి ఓ పల్లెలో ఆగాడు. అక్కడికి రాగానే శ్రవణకుమారుడి ఆలోచనలు మారిపోయాయి.

Published : 05 Oct 2023 00:28 IST

శ్రవణకుమారుడు వృద్ధులు, అంధులు అయిన తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ తీర్థయాత్రలకు బయల్దేరాడు. ఒక రాత్రి బస చేయటానికి ఓ పల్లెలో ఆగాడు. అక్కడికి రాగానే శ్రవణకుమారుడి ఆలోచనలు మారిపోయాయి. తనలో తాను ‘నా తల్లిదండ్రులకు కళ్లు కనబడకపోవచ్చు. కానీ కాళ్లు బాగానే ఉన్నాయి. నేనిలా కావడిలో ఎందుకు మోయాలి?’ అనుకున్నాడు. ఆ వెంటనే ‘నేనిక మిమ్మల్ని మోయలేను. నా చేయి పట్టుకొని నడవండి’ అన్నాడు. ఆ హఠాత్పరిణామానికి ఖిన్నులైన వృద్ధ దంపతులు మారు మాట్లాడకుండా కొడుకు వెంట నడుస్తున్నారు. ఆ ఊరి పొలమేర దాటగానే శ్రవణ కుమారుడు ఆత్మపరిశీలన చేసుకోసాగాడు. ‘అయ్యో! నేనెంత కఠినాత్ముణ్ణి? కళ్లు కనిపించని తల్లిదండ్రుల్ని నడిపిస్తున్నానేంటి? దేవుడు నన్ను క్షమించడు!’ అనుకుని రోదించసాగాడు. అప్పుడతడి తండ్రి కొడుకును ఓదారుస్తూ ‘బాధపడకు నాయనా! ఇందులో నీ తప్పేమీ లేదు. అది ఆ ఊరి ప్రభావం. అక్కడ ఒకప్పుడు మయుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడు కన్న వాళ్లను హింసించి చంపేశాడు. ఆ స్థలప్రభావం వల్ల నీ బుద్ధి అలా వికటించింది. ఆ ప్రాంతాన్ని వదిలి రాగానే తప్పు తెలిసొచ్చింది. అక్కడ గనుక బస చేసి ఉంటే ఇంకెన్ని అనర్థాలు వచ్చేవో’ అన్నాడు. దుష్టులతో సాంగత్యమే కాదు, వారున్న ప్రదేశం కూడా దుష్ప్రభావానికి లోనవుతుందని ఈ ఉదంతం తెలియజేస్తోంది.

చక్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని