దురాశతో దేవుడు దూరం

రామకృష్ణ పరమహంస మేనల్లుడి పేరు హృదయ రాం. అతడు వారితోనే కోల్‌కతా దక్షిణేశ్వరాలయ నివాసగృహంలో ఉండేవాడు.

Published : 09 Nov 2023 00:38 IST

రామకృష్ణ పరమహంస మేనల్లుడి పేరు హృదయ రాం. అతడు వారితోనే కోల్‌కతా దక్షిణేశ్వరాలయ నివాసగృహంలో ఉండేవాడు. ఓ రోజు అతడో కోడెదూడను తెచ్చి దగ్గర్లో ఉన్న తోటలో కట్టేశాడు. వాహ్యాళికి వెళ్తూ దాన్ని చూసిన గురుదేవులు- ‘ఇదెక్కడిది? ఇక్కడెందుకు కట్టేశావు?’ అనడిగారు. ‘మావయ్యా! దీన్ని నేనే తెచ్చాను. దీనికి చక్కగా మేతవేసి పెంచి, పెద్దయ్యాక మా ఊరికి తీసుకు వెళ్లాలన్నది నా ఆలోచన. ఇప్పుడిలా పెంచితే రేపు నాకు ఉపయోగపడుతుంది కదా’ అన్నాడు మేనల్లుడు. ఆ మాటలు విని రామకృష్ణులు ఆశ్చర్యపోయారు. తర్వాత కాళీ ఆలయానికి వెళ్తూ పక్కనున్న శిష్యుడితో ‘ఆహా! మహామాయ విలాసం ఎలా ఉంటుందో చూడు. ఈ దక్షిణేశ్వరం ఎక్కడా? 80 మైళ్ల దూరంలో ఉన్న మేనల్లుడి ఊరెక్కడా? దూడను ఇక్కడ పెంచుతాడట. అది పెద్దయ్యాక ఆ ఊరికి తోలుకెళ్లి పొలం దున్నిస్తాడట! ఆహా.. మనిషి దురాశ ఎంతటిది! స్వలాభం కోసం, స్వార్థప్రయోజనాల కోసం ఎన్ని పథకాలు వేసుకుంటారు! ఎన్నెన్ని పాట్లు పడుతుంటారు!’ అన్నారు. దురాశ దైవసన్నిధి నుంచి మనల్ని దూరం చేస్తుందంటూ హితవు పలికారు.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని