భిక్షాటనలో అంతరార్థం

గౌతమబుద్ధుడి జీవితంలో కొన్ని సంఘటనలు.. ఆయన సౌశీల్యతకు అద్దం పడతాయి. దుర్భర పరిస్థితులు ఎదురైనప్పుడు లేదా తనను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులను ఎదుర్కొన్నప్పుడు ఎంత ఉదాత్తంగా వ్యవహరించారో చాటే కథలు అనేకం ఉన్నాయి

Updated : 14 Dec 2023 04:03 IST

బుద్ధభూమి

గౌతమబుద్ధుడి జీవితంలో కొన్ని సంఘటనలు.. ఆయన సౌశల్యతకు అద్దం పడతాయి. దుర్భర పరిస్థితులు ఎదురైనప్పుడు లేదా తనను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులను ఎదుర్కొన్నప్పుడు ఎంత ఉదాత్తంగా వ్యవహరించారో చాటే కథలు అనేకం ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితం గడపటానికి ఆయన అనుసరించి పద్ధతులు మార్గనిర్దేశాలు. వాటిల్లో ఓ సంఘటనను గుర్తుచేసుకుందాం..

భరద్వాజుడు అనే ఒక బ్రాహ్మణ భూస్వామి, పంట సమయంలో ఉత్సవం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో బుద్ధుడు భిక్షాటనకు అక్కడికి వచ్చాడు. ఆయన గొప్పతనం గురించి తెలిసిన కొందరు బుద్ధుడికి భక్తి గౌరవాలతో వందనం చేశారు. ఆరోగ్యంగా, బలంగా ఉన్న వ్యక్తి భిక్షకు రావడం భరద్వాజుడికి నచ్చలేదు. కోపం కట్టలు తెంచుకోగా.. ‘సిగ్గుచేటు! ఇలా అడుక్కు తినడం కన్నా పనిచేసుకుని బతకడం గౌరవప్రదం. చూడూ! నేను నేలను దున్ని విత్తనాలు నాటి.. శ్రమించి జీవనం సాగిస్తున్నాను. నువ్వు కూడా నాలా చేస్తే.. ఇలా బిచ్చమెత్తాల్సిన అవసరం లేకుండా, తినడానికి చక్కగా సమకూరి ఉండేది’ అన్నాడు. అంత కఠినమైన మాటలు విని కూడా గౌతమ బుద్ధుడు ఎంతమాత్రం ఆగ్రహించలేదు. ఎంతో ప్రశాంతంగా.. ‘ఓ బ్రాహ్మణుడా! నేను కూడా దున్నడం, నాట్లువేయడం లాంటి పనులు చేయడం వల్లే తింటున్నాను’ అన్నాడు. అది విన్న భూస్వామికి మరింత చిరాకేసింది. ‘ఏంటీ, నువ్వు వ్యవసాయం చేశావా? నీకు ఎడ్లు, విత్తనాలు, నాగలి ఉన్నాయా?’ అనడిగాడు. ఈసారి కూడా బుద్ధుడు సంయమనం కోల్పోలేదు. ఎంతో సౌమ్యంగా ‘విశ్వాసం అన్నదే నేను నాటిన విత్తనం. మంచి నడవడితో కూడిన వివేకం నాగలి. ఆలోచనలే నా ఎడ్లు. వాటి ఫలసాయమే అమరఫలమైన నిర్వాణం. అంటే సమస్త దుఃఖాలనూ అంతం చేసేది’ అంటూ బదులిచ్చాడు. ఆ వ్యాఖ్యానం విన్న ద్విజుడికి జ్ఞానోదయం అయ్యింది. లోనికి వెళ్లి, బంగారు గిన్నెలో పాయసం తెచ్చి బుద్ధుడికి అర్పిస్తూ.. ‘గుర్తించలేక పోయాను స్వామీ! అమరత్వాన్ని ఫలసాయంగా అందించే పొలాన్ని దున్నగలిగేది మరెవరో కాదు.. బుద్ధభగవానుడే. నా తొందరపాటును క్షమించి.. ఈ ప్రసాదాన్ని స్వీకరించు స్వామీ’ అంటూ ప్రార్థించాడు.

 గోవిందం ఉమామహేశ్వర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని