ఏ వారం.. ఏ పూజ... ఏ ఫలితం?

కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి. దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది.

Updated : 25 Jun 2019 16:34 IST

కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి. దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ నాలుగు రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది. పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చెయ్యాల్సి ఉంటుంది.

ఆదివారం: ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్ర సమస్యలు, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.

సోమవారం: సోమవారం సంపద కోరుకోనేవారు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.

మంగళవారం: రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.

బుధవారం: బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

గురువారం: గురువారం ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు.

శుక్రవారం: శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల సంతృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించాలి.

శనివారం: శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేది శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు. సృష్టి ప్రారంభంలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండిటినీ శివుడు కల్పించాడు. పాపం చేయటం లేదా పుణ్యం చేయటమనేది మానవుల పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది. చేస్తున్నది పాపమని పెద్దలు లేదా గురువుల నుంచి తెలుసుకొని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను, కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకొంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు