తప్పు చేశా... కుమిలిపోతున్నా

పచ్చని పంట పొలాలు... గలగలా పారే సెలయేళ్లు... ఎవరికిష్టం ఉండదు? అందుకే కాలేజీకి ఒక్కరోజు సెలవొచ్చినా పిన్ని వాళ్లూరిలో వాలేవాణ్ని. ‘ఒరేయ్‌ సలీం సబీహా ఆంటీ వాళింటికెళ్లి ....

Updated : 09 Dec 2022 13:14 IST

చ్చని పంట పొలాలు... గలగలా పారే సెలయేళ్లు... ఎవరికిష్టం ఉండదు? అందుకే కాలేజీకి ఒక్కరోజు సెలవొచ్చినా పిన్ని వాళ్లూరిలో వాలేవాణ్ని. ‘ఒరేయ్‌ సలీం సబీహా ఆంటీ వాళింటికెళ్లి కొంచెం పంచదార పట్రాపో’ కేకేసింది ఓసారి పిన్ని. గుమ్మంలో అడుగు పెడుతుంటే ఓ చక్కనిచుక్క ఎదురొచ్చింది. ‘ఏం కావాలి?’ ముఖంపై పడ్డ ముంగురుల్ని సవరించుకుంటూ అడిగింది. తడబడుతూనే వచ్చిన పనితోపాటు మా పిన్నీతో ఉన్న చుట్టరికం చెప్పా. ఆపై కావాలనే తనని పలకరించేవాణ్ని. బదులిచ్చేది. కొద్దిరోజులకే మా పరిచయం ప్రేమ పట్టాలెక్కింది.

చదువు పూర్తైంది. లగేజీ సర్దేసుకొని పిన్నింటికి బయల్దేరా. చూపుల సైగలు... వాళ్లింట్లో ఎవరూ లేకపోతే కలుసుకోవడాలు... ఇదీ మా దినచర్య. ఓరోజు పెరట్లో చాలాసేపే మాట్లాడుకున్నాం. ఎండకి చెమట్లు పట్టేశాయి. తన ఓణీతో నా చెమట్లు తుడిచింది. ఒంట్లో నరాలు జివ్వుమన్నాయ్‌. ‘పదా... ఎండ ఎక్కువగా ఉంది. ఇంట్లోకెళ్లి మాట్లాడుకుందాం’ అంది. ఇద్దరం ఒకే మంచంపై కూర్చున్నాం. తగినంత ఏకాంతం. లబ్‌డబ్‌... నా గుండె శబ్దం నాకే వినిపిస్తోంది. తప్పు చేయమంది తనువు. వారించింది మనసు. చటుక్కున అక్కణ్నుంచి లేచా. ‘మనం సాధ్యమైనంత తొందర్లో పెళ్లి చేసుకుందాం’ అంటూ బయల్దేరా.

మా ప్రేమ విషయం వాళ్లింట్లో తెలిసింది. అదీ నా మంచికే అయింది. వాళ్ల అన్నయ్య మాట్లాడటానికొచ్చాడు. మా ఇల్లు చాలా చిన్నది. కుర్చీ కూడా లేదు. పక్కింట్లో కూర్చోబెట్టా. అమ్మ టీ తెచ్చేలోపే వెళ్లిపోయాడు. నాకు ఒకటే టెన్షన్‌. ‘అబ్బాయి గుణవంతుడే. చదువు, అందం ఉంది. కానీ మరీ పేదోళ్లు. మనకి సరిపోరు’ తేల్చేశాడట. దుఃఖం పొంగుకొచ్చింది. వాళ్లని ఎలా ఒప్పించాలో ఆలోచిస్తుండగానే తనకి పెళ్లిచూపులు జరిగి, పెళ్లి నిశ్చయం అయిపోయింది. మమ్మల్ని కలవకుండా, మాట్లాడకుండా కట్టడి చేశారు. నాకు నిద్ర కరువైంది. ‘నా మనసు నీకే సొంతం. వేరొకర్ని పెళ్లాడ్డం నాకిష్టం లేదు. ఏదైనా చెయ్‌’ ఓరోజు ఎలాగో ఫోన్‌ చేసి ఏడుస్తూ చెప్పింది.

రేపే తన పెళ్లి. ముందురోజే రాత్రే స్నేహితులతో కలిసి రెండు కార్లలో బయల్దేరా. వూరి చివర ఉన్నామని ఓ కుర్రాడితో కబురు పంపా. తనటెళ్లగానే నా మెదడులో వేల ఆలోచనలు. మేం పారిపోతే పెళ్లి బాజాలు మోగాల్సినచోట చావు డప్పు మోగుతుందేమో! మేం దొరికిపోతే తనని కచ్చితంగా చంపేస్తారు. వూహిస్తుంటేనే చాలా భయమేసింది. వెనక్కి వెళ్లిపోదాం అన్నా. నా ఫ్రెండ్స్‌ షాక్‌. ఉత్తిచేతులతో వెళ్లొద్దన్నారు. జరగబోయే దారుణాలు వివరించా. చేసేదేం లేక అంతా తిరిగెళ్లిపోయాం. ప్రాణసఖి నాకోసం వచ్చిందో, లేదో తెలియదు.

మర్నాడే తన పెళ్లైంది. కొన్నాళ్లకు వేరే అమ్మాయితో నాది కూడా. విధి ఎంత చిత్రమైందంటే మా ఇంటికి రావాల్సిన అమ్మాయి వేరే వాళ్లింటికి వెళ్లింది. వాళ్లింటికి వెళ్లాల్సిన అమ్మాయి మా ఇంటికొచ్చింది. ఔన్నిజమే. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని నా ప్రేయసి వాళ్లన్నయ్య పెళ్లాడాలనుకున్నాడట. కట్నం విషయంలో తేడాలొచ్చి ముందుకెళ్లలేదు. మరో పిడుగులాంటి వార్త ఏంటంటే... కొన్నాళ్లకే నా ప్రియనేస్తం భర్త ఓ ప్రమాదంలో చనిపోయాడు. వెళ్లి పలకరించాలని చాలాసార్లు అనుకున్నా ధైర్యం చాల్లేదు. ఈ మధ్యే గుండె పగిలే మరో విషయం తెలిసింది. ‘పెళ్లికి ముందురోజు రాత్రి ఆ అమ్మాయి వూరవతలివైపు పరుగెత్తడం... కాసేపయ్యాక వెనక్కి తిరిగిరావడం చూశాన్రా’ అంది పిన్ని. ఆ మాటతో నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆరోజు పెద్ద తప్పు చేశానని ఇప్పటికీ కుమిలిపోతూనే ఉన్నా.

- సలీం (పేర్లు మార్చాం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని