దిమాగ్‌ దుస్తూరి

ఏరా.. ఇంకెన్ని రోజులు ఇలా ఖాళీగా..బీటెక్‌ చేసి రెండేళ్లయింది.ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చుగా..’ అని సలహా ఇస్తాడు అమ్మ వైపు బంధువు.. ‘సివిల్‌ సర్వీసా! అది మనలాంటి మధ్యతరగతి వాళ్లకయ్యే పనేనా? అసలే మీ నాన్న జీతం అంతంత మాత్రం. నువ్వూ ఏదైనా జాబ్‌ చేస్తేనే కదరా ఇల్లు గడిచేది..అంటాడు నాన్న బెస్ట్‌ ఫ్రెండు.

Published : 26 Oct 2019 00:55 IST

చెప్పాలంటే టీ షర్టేయండి

* ‘ఏరా.. ఇంకెన్ని రోజులు ఇలా ఖాళీగా..బీటెక్‌ చేసి రెండేళ్లయింది.ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చుగా..’ అని సలహా ఇస్తాడు అమ్మ వైపు బంధువు..
* ‘సివిల్‌ సర్వీసా! అది మనలాంటి మధ్యతరగతి వాళ్లకయ్యే పనేనా? అసలే మీ నాన్న జీతం అంతంత మాత్రం. నువ్వూ ఏదైనా జాబ్‌ చేస్తేనే కదరా ఇల్లు గడిచేది..’ అంటాడు నాన్న బెస్ట్‌ ఫ్రెండు..  
* ‘సివిల్‌ సర్వీసా! అది మనలాంటి మధ్యతరగతి వాళ్లకయ్యే పనేనా? అసలే మీ నాన్న జీతం అంతంత మాత్రం. నువ్వూ ఏదైనా జాబ్‌ చేస్తేనే కదరా ఇల్లు గడిచేది..’ అంటాడు నాన్న బెస్ట్‌ ఫ్రెండు..  
*‘సినిమాల్లో ఛాన్సులు కష్టం బాబూ.. మా ఆఫీసుకు రా.. బాస్‌తో చెప్పి ఉద్యోగం ఇప్పిస్తా..’ అంటారు పక్కింటి అంకుల్‌.

.. ఇలా ఎవరికి తోచిన సలహాలు వాళ్లిస్తారు. సలహాలదేముంది ఫ్రీ కదా! ఇచ్చేస్తారు. మన మదిలో ఏముందో వారికి అనవసరం. అందుకే ఒక్కోసారి వాళ్లిచ్చే సలహాలు చిరాకు తెప్పిస్తాయి. మన ప్రయత్నాలకు అడ్డుగోడల్లా తయారవుతాయి. పోని వారికి నచ్చ చెబుదాం అంటే.. ఏమనుకుంటారో అనే భయం. మరి, మనం ఏం చెప్పకుండానే మనని చూసే సైలెంట్‌గా వెళ్లిపోయేలా చేయాలనుకుంటే? అదెలా కుదురుతుంది.. చాలా సింపుల్‌.
* ‘ఉచిత సలహాలు ఇవ్వొద్దు’ అని రాసున్న టీషర్టు వేసుకోండి.
* ‘నా చావు నేను చస్తా. నీకెందుకు?’ అని ఉన్న స్లీవ్‌లెస్‌ ప్రయత్నించండి..
ఇలా మీరు ఉన్న సందర్భానికి సరిపడేవి ధరించండి. అంతే.. వారికే అర్థమవుతుంది. సర్దుకొని సైడవుతారు. ఐడియా బాగానే ఉందిగానీ.. అలాంటి కొటేషన్లతో ఉన్న దుస్తులు దొరకాలిగా? అంటారా.. అయితే, మీకు ‘దేడ్‌ దిమాగ్‌’ గురించి తెలియదన్నమాట.  ఇద్దరు మిలీనియల్స్‌ మీకంటే ముందే వినూత్నంగా ఆలోచించి ఓ కొత్త ట్రెండ్‌ని పరిచయం చేశారు. అదే దేడ్‌ దిమాగ్‌ టీషర్టుల ట్రెండ్‌.


కిక్కు కోసం ప్రయత్నించే క్రమంలో..

ఖమ్మం జిల్లాకి చెందిన వాసిరెడ్డి హరీశ్‌.. ఒంగోలు వాసి మహి ఇల్లింద్ర ఇద్దరికీ చేసే పనిలో కిక్‌ కావాలి. హరీశ్‌ బీటెక్‌ పూర్తి చేశాక ఏదో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ పోతే తనూ అందరిలో ఒకడినైపోతా అనుకున్నాడు. టీవీ పరిశ్రమలో డైలాగ్‌ రైటర్‌గా.. తర్వాత సినిమా ఛాన్సుల కోసం కృష్ణానగర్‌ కష్టాలు అనుభవించాడు. ‘ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఇలా ఎంత కాలం సినిమాలంటూ చూస్తూ కూర్చుంటావ్‌..’ అని సలహాలిచ్చిన వారెందరో. అవేం పట్టించుకోకుండా కార్పొరేట్‌ బ్రాండింగ్‌, డిజైనర్‌, వీడియో మేకింగ్‌.. ఇలా తనకు ఇష్టమైన రంగాల్లో పని చేశాడు. దేంట్లోనూ సరైన సక్సెస్‌, కిక్‌ దొరకలేదు. ఆలోచనలో పడ్డాడు. మదిలో ఎన్నో బిజినెస్‌ ఐడియాలు. క్రియేటివ్‌గా ఏదైనా చేయాలని అన్నీ వదిలేసి రెండేళ్ల పాటు ఇంట్లోనే కూర్చున్నాడు. చేసేది ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ అయ్యుండాలనుకున్నాడు. తన ఆలోచనలకు సినీ పరిశ్రమలో పరిచయమైన మహి ఇల్లింద్ర తోడయ్యాడు. మహీ కూడా ఇంజినీరింగ్‌ చేశాడు. యూఎస్‌ వెళ్లి ఎంఎస్‌ చేశాడు. అక్కడే మంచి ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. అది తనకు సంతృప్తినివ్వలేదు. తిరిగొచ్చి స్క్రిప్ట్‌ రైటర్‌గా ఆరు సినిమాలకు పని చేశాడు. రచయితగా రాణిస్తూనే వ్యాపార రంగంపైనా దృష్టి పెట్టాలనుకుని ఇద్దరూ ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ క్రమంలోనే తెలుగు కొటేషన్స్‌తో టీషర్ట్‌లు తయారుచేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.


ఆ పేరే ఎందుకు?

తెలుగంటే అంత ప్రేమ ఉన్నప్పుడు పరిశ్రమకి హిందీలో ‘దేడ్‌ దిమాగ్‌’ అని ఎందుకు పెట్టారని అడిగితే.. ‘వ్యాపార పరిధిని పెంచుకోవడానికే తప్ప మరే కారణం లేదు. కానీ, పెట్టిన పేరు వెనక మాత్రం లాజిక్‌ ఉంది. ఎవరైనా కష్టపడేది సక్సెస్‌ కోసమే. ముఖ్యంగా పాతికేళ్లకే సక్సెస్‌ రుచి చూడాలి. లేదంటే సమాజంలో మన మాటకు విలువుండదు. మదిలో ఎంత మంచి క్రియేటివ్‌ ఆలోచనలు ఉన్నా అవేవి పట్టించుకునేవారుండరు. మనం ఎంత కష్టపడుతున్నా పట్టించుకోరు. పైగా మనం ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే.. మన ముందు అనకపోయినా వెనక ‘వీడో పెద్ద దేడ్‌ దిమాగ్‌ గాడ్రాబై..’ అని ముద్ర వేస్తారు. వాళ్లు అంగీకరించనంత మాత్రాన పనికిరాని వారు అయిపోరు అని చెప్పుకోవడానికే మా ఈ దేడ్‌ దిమాగ్‌ టీషర్టులు. ఫన్‌తో పాటు సామాజిక సమస్యల్నీ ప్రస్తావించేందుకు వేదికగా మారుస్తున్నాం. ప్లాస్టిక్‌పై అవగాహన కల్పించేలా కొన్ని.. అడవుల్ని పరిరక్షించాలంటూ ఇంకొన్ని ఉత్పత్తుల్ని తయారుచేస్తున్నాం.. త్వరలో పిల్లల దుస్తుల్నీ తీసుకొస్తాం.’
ఎక్కువగా ఫన్‌కే ప్రాధాన్యం ఇస్తాం. ఒకసారి.. ‘ఫ్రెండ్‌ పెళ్లి ఉంది. ఫన్‌ కొటేషన్స్‌తో చేసిన టీషర్ట్స్‌ కావాలని మా దగ్గరికొచ్చారు. అప్పుడు ‘పూజారి తరఫు’, ‘భోజనాలెక్కడ?’, ‘చదివింపులెక్కడ’, ‘ఏం జరుగుతోందిక్కడ (విదేశీయులకు)’.. అని రాసి ఉన్న టీషర్టుల్ని డిజైన్‌ చేసి ఇచ్చాం. పెళ్లంతా ఆ టీషర్టులతో ఒకటే సందడి.. చాలా నవ్వుకున్నారంతా. ఇలా పలు సందర్భాలకు సరిపడే దుస్తుల్ని డిజైన్‌ చేసి అందించడంలో మాదైన ప్రత్యేకత చూపుతున్నాం. మా ఆలోచన నచ్చి సినీరంగంలోని చాలా మంది యువ హీరోలు మా ఉత్పత్తులకు ఉచిత ప్రమోషన్స్‌ చేశారు. రానున్న చలికాలానికి తగ్గట్టుగా హుడీస్‌ అందిస్తున్నాం.  త్వరలో షర్ట్స్‌, జర్కిన్లు, బ్యాగ్స్‌, వాలెట్స్‌ ఇలా అన్ని రకాల ఉత్పత్తులనూ మా స్టైల్‌లో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాం.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని