గ్రీన్‌వీరులు

జోరుగా కార్ల హోరు.. మెరుపు వేగంతో బైక్‌ రైడ్‌లు..  ఇవే కాదు. గత కొన్నేళ్లుగా కూల్‌గా తొక్కుకెళ్లే సైక్లింగ్‌ ట్రాక్‌లూ కనిపిస్తున్నాయ్‌.. ఎందుకంటే? మిలీనియల్స్‌ రూటు మారుతోంది!! పర్యావరణంపై ప్రేమే వీరిని కాలుష్యానికి కారణం కావొద్దని ప్రేరేపిస్తోంది! ప్రభుత్వ పాలసీల కోసం వేచి చూడ్డం కంటే.. ముందడుగు వేసి పర్యావరణ పరిరక్షణకు తగిన మార్పుల్ని స్వీకరించేందుకు సిద్ధం చేస్తోంది.

Published : 15 Feb 2020 01:07 IST

దారి మార్చేస్తున్న మిలీనియల్స్‌
థింక్‌ డిఫరెంట్‌

జోరుగా కార్ల హోరు.. మెరుపు వేగంతో బైక్‌ రైడ్‌లు..  ఇవే కాదు. గత కొన్నేళ్లుగా కూల్‌గా తొక్కుకెళ్లే సైక్లింగ్‌ ట్రాక్‌లూ కనిపిస్తున్నాయ్‌.. ఎందుకంటే? మిలీనియల్స్‌ రూటు మారుతోంది!! పర్యావరణంపై ప్రేమే వీరిని కాలుష్యానికి కారణం కావొద్దని ప్రేరేపిస్తోంది! ప్రభుత్వ పాలసీల కోసం వేచి చూడ్డం కంటే.. ముందడుగు వేసి పర్యావరణ పరిరక్షణకు తగిన మార్పుల్ని స్వీకరించేందుకు సిద్ధం చేస్తోంది. దీంతో ఎవరికి వారే రోజువారీ ప్రయాణాల్లో మార్పులు చేసుకుంటూ కర్బన కాలుష్యానికి చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి, మీరేం చేస్తున్నారు? మార్గాలు చాలానే ఉన్నాయ్‌ అంటుంది నేటితరం.. మీరూ ఫాలో అయ్యి ట్రావెల్‌ ట్రయల్‌ వేయండి...

‘పబ్లిక్‌’తో కలవండి..
రోజూ రెడీ అయ్యామా.. బైక్‌ కిక్‌ కొట్టామా.. హెల్మెట్‌ పెట్టామా.. కాలేజీ, ఆఫీస్‌లకు వెళ్లామా.. ఇంతేనా? రోజూ హెల్మెట్‌లో నుంచి కాకుండా ఆర్టీసీ బస్సు విండో నుంచో.. మెట్రోరైల్‌ మిర్రర్‌ నుంచో.. పబ్లిక్‌, పరిసరాల్ని చూడండి. సమాజాన్ని దగ్గరగా చూడడంతో పాటు.. ప్రకృతికీ మీ ప్రేమని పంచినట్లు అవుతుంది. వీలైనప్పుడల్లా సొంత కార్లు, బైక్‌లు, ప్రైవేటు వాహనాలకు బ్రేక్‌అప్‌ చెప్పి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ని వాడడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించిన వారవుతారు. హైటెక్స్‌లో పని చేస్తున్న అను ఏడాది నుంచి తాను ఫాలో అవుతున్న మార్గం ఇదేనంటోంది. ‘మెట్రో ఇప్పుడు మరింత సౌకర్యంగా మారింది. దీంతో నా బైకుని నెలలో ఒకటి, రెండు సార్ల కంటే ఎక్కువ వాడడం లేదు. నా వంతు ప్రయత్నంగా ప్రయాణాన్ని ఎకో ఫ్రెండ్లీగా మార్చుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని చెబుతోంది.

కార్‌పూలింగ్‌తో కలిసికట్టుగా..
నగరాల్లో రద్దీగా ఉండే రోడ్లు.. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌తో ఆఫీస్‌, కాలేజీలకు వెళ్లాలంటే ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. అలాంటప్పుడు సొంత బండో, కారో వేసుకెళ్లడం తప్ప మారో మార్గం ఏముంది? అనుకోవద్దు. ఇంట్లో ఒక్కొక్కరూ ఒక్కో బైక్‌ లేదా కారు వేసుకెళ్తే రోడ్లు నిండిపోవడమే కాదు. కాలుష్యం కూడా పెరిగిపోతుంది. అందుకే మిలీనియల్స్‌ స్మార్ట్‌గా కార్‌పూలింగ్‌కి ఓటేస్తున్నారు. ఒకే రూటులో వెళ్తూ.. ఇంచు మించు ఒకే ప్రాంతంలో పని చేసే వారు కలిసికట్టుగా వెళ్తున్నారు. ఒక్కో కారులో ఒకరు వెళ్లే బదులు ఒక కారులోనే నలుగురు కలిసి పూలింగ్‌ పద్ధతిని ఫాలో అవుతున్నారు. ‘ఇలా చేయడంతో మేము వెళ్లే రూటులో ట్రాఫిక్‌ తగ్గించేందుకు మా వంతు సాయం చేస్తున్నాం అనే కిక్‌ నాకు చాలా సంతోషాన్నిస్తుంది’ అంటున్నాడు ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్‌ అజయ్‌ పీకా. ‘నేను, మా చెల్లి, మరో ఇద్దరు..  నలుగురం ఒకే కారులో వెళ్తాం. దీంతో నాకు రోజూ డ్రైవింగ్‌ చేసి అలసిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే.. నలుగురం వంతుల వారీగా డ్రైవ్‌ చేస్తాం. దీంతో నా వంతు మూడు రోజులకుగానీ రాదు. కంఫర్ట్‌తో పాటు కార్బన్‌ మోనాక్సైడ్‌ని తగ్గిస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని అంటున్నాడు.

నడిస్తే పోలా..
భిన్నమైన పని వేళలు.. ఎప్పుడు గూటికి చేరి నిద్రిస్తామో తెలియని లైఫ్‌స్టైల్‌. ఈ తరహా జీవన శైలిలో ఉదయం నడక ఉండదు. అందుకే అవకాశం చిక్కినప్పుడల్లా నడిచేందుకు ఆసక్తి చూపుతున్నారు యువత. ఆఫీసు, కాలేజీలకు వెళ్లే క్రమంలో రెండు, మూడు కిలోమీటర్ల దూరాన్ని నడిచి వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. కలిసుంటే కబుర్లు చెప్పుకొంటూ.. ఒక్కరుంటే ఫోన్‌ కాల్స్‌ మాట్లాడుతూ నడిచేస్తున్నారు. దీంతో పాకెట్‌ మనీ ఆదాతో పాటు.. వారి ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ‘బస్‌ స్టాప్‌ నుంచి మా కాలేజీ 1.5 కిలోమీటర్లు. వేసవిలో తప్ప.. ఎప్పుడూ నడిచే వెళ్తాం. ఇలా చిన్న చిన్న దూరాలకి వాహనాల్ని వాడకుంటే పర్యావరణానికి ఎంతో మేలు.. ప్రత్యక్షంగా మన ఫిట్‌నెస్‌కీ మంచిదే’ అంటోంది ఎంబీఏ విద్యార్థిని వైశాలి.


ఈ-బైక్‌లు ఉన్నాయ్‌గా..

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌, కార్‌పూలింగ్‌.. ఇంతలా ఎకో ఫ్రెండ్లీగా వెళ్లినా కొందరికి ఆఫీస్‌ని చేరుకోవడానికి ఇంకా కాస్త ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మెట్రోలో వెళ్లే వారికి స్టేషన్‌ నుంచి ఆఫీస్‌, కాలేజీలు ఐదారు కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. ఆ కాస్త దూరం వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందని కొందరు ఇంటి నుంచే బైకు లేదా కారులో వచ్చేస్తుంటారు. అంత కష్టం అక్కర్లేదు. కాస్త స్మార్ట్‌గా ఆలోచిస్తే చుట్టూ ఈ-బైక్‌ లేదా స్కూటర్‌ రెంటల్‌ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మీరు బస్సు లేదా రైలు దిగిన చోట ఆయా యాప్‌ సర్వీసుల్ని ఓపెన్‌ చేసి చూస్తే చాలు. మెట్రోస్టేషన్‌ కిందో.. మీరు నిలబడి ఉన్న చోటో బైక్‌లు సిద్ధంగా ఉంటాయి. ‘నాకు ఇంపోర్టెడ్‌ బైక్‌ ఉంది. కానీ, నేను చాలా వరకూ ఆఫీస్‌కి మెట్రో లేదా ఇతర పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లోనే వెళ్తా. మా ఆఫీస్‌ మెట్రో స్టేషన్‌కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్టేషన్‌ నుంచి దిగగానే బైక్‌ని అద్దెకు బుక్‌ చేసుకుంటా. అదీ తక్కువ ఖర్చుకే. మా ఆఫీస్‌ ముందే పార్క్‌ చేసేస్తా. దాన్ని మరొకరు బుక్‌ చేసుకుని వేసుకెళ్తారు. ఇది నాకెంతో సౌకర్యంగా ఉంది. అంతేకాదు.. నా వంతు బాధ్యతగా పొల్యూషన్‌ తగ్గిస్తున్నందుకు హ్యాపీగా ఉంది’ అంటున్నాడు ఫిల్మ్‌ రైటర్‌గా పని చేసే స్మరేంద్ర మోదుకూరి.


సైకిల్‌ తొక్కేద్దాం!

బైక్‌లపై ఎంత ప్రేముందో అదే స్థాయిలో సైకిళ్లపైనా ప్రేమని పెంచుకుంటున్నారు నేటి జనరేషన్‌. దిల్లీ, హైదరాబాద్‌.. లాంటి మెట్రో నగరాల్లో ఇప్పటికే తమ రోజువారీ పనులకు సైకిళ్లను ప్రైమరీ ట్రాన్స్‌పోర్ట్‌గా వాడుకుంటున్నారు కూడా. ఇక కాలేజీ క్యాంపస్‌లలో బైక్‌లతో సమానంగా సైకిళ్లు కనిపిస్తున్నాయ్‌. ఒక బ్లాక్‌ నుంచి మరో బ్లాక్‌కి వెళ్లేందుకు సైకిల్‌ వాడకానికే మా ఓటు అంటున్నారు దినేష్‌, రవి. ఇక కార్పొరేటు ఆఫీస్‌ల్లో పని చేసే ఉద్యోగులు కూడా సైకిల్‌ని ప్రయాణ సాధనంగా వాడేస్తున్నారు. 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఆఫీస్‌లు ఉన్నవారు వారంలో రెండు, మూడు రోజులు సైకిల్‌పైనే వెళ్లొస్తున్నారు. ‘నా ఆఫీస్‌ రానూ, పోనూ 25 కిలోమీటర్లు. వారంలో మూడు రోజులు సైకిల్‌పైనే వెళ్తా. ట్రాఫిక్‌లో చిక్కుకుంటా అనే బాధ ఉండదు. కాకపోతే కాస్త ముందు బయలుదేరాల్సి వస్తుంది. రోడ్లపై ప్రత్యేకంగా సైకిల్‌ ట్రాక్‌లు సిద్ధం చేస్తే మరింత ఎక్కువ మంది సైక్లింగ్‌పై ఆసక్తి చూపేందుకు వీలుంటుంది. సైకిల్‌పైన వెళ్లిన రోజు నాకెందుకో చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. అంతేకాదు.. నా ఈ ప్రయత్నం పర్యావరణానికి మేలు చేస్తుందనే కిక్‌ బాగుంది’ అని ఫ్యాషన్‌ డిజైనర్‌ దినేష్‌ చెబుతున్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని