చప్పట్లోయ్‌ సాయాలోయ్‌!

ప్రతిదాన్నీ సవాలుగా తీసుకునే ఓ కుర్రాడు.. తన 21 ఏటే తొలి ప్రయత్నంలోనే సీఏ పాస్‌ అయ్యాడు.. ఇంకేంటి సెటిల్‌ అయిపోదాం అనుకోలేదు.. ఇంకేదైనా ఛాలెంజ్‌ని స్వీకరించాలనుకున్నాడు.. నాన్న సపోర్టుతో తనదైన శైలిలో ఆలోచించాడు.. నలుగురికీ ఉపయోగపడే ప్లాట్‌ఫామ్‌ కోసం తపన పడ్డాడు..

Published : 22 Feb 2020 00:30 IST

థింక్‌ డిఫరెంట్‌

ప్రతిదాన్నీ సవాలుగా తీసుకునే ఓ కుర్రాడు.. తన 21 ఏటే తొలి ప్రయత్నంలోనే సీఏ పాస్‌ అయ్యాడు.. ఇంకేంటి సెటిల్‌ అయిపోదాం అనుకోలేదు.. ఇంకేదైనా ఛాలెంజ్‌ని స్వీకరించాలనుకున్నాడు.. నాన్న సపోర్టుతో తనదైన శైలిలో ఆలోచించాడు.. నలుగురికీ ఉపయోగపడే ప్లాట్‌ఫామ్‌ కోసం తపన పడ్డాడు.. ‘గుడ్‌క్లాప్‌’ పేరుతో క్రౌడ్‌ ఫండింగ్‌ని ప్రారంభించాడు.. ఏడాదిన్నర లోనే రూ.1.6 కోట్ల ఫండ్స్‌ని సేకరించాడు.. వాటితో 250 మంది జీవితాల్లో వెలుగుని, బతుకుపై ఆశని చిగురించేలా చేశాడు.. అంతేనా.. క్రౌడ్‌ ఫండింగ్‌ని ఈతరానికి కొత్తగా పరిచయం చేస్తూ తన ఆలోచనల్ని ‘ఈతరం’తో పంచుకున్నాడు గుడ్‌క్లాప్‌ కాన్సెప్ట్‌ ఫౌండర్‌ శశాంక్‌..

పుట్టింది ఆంధ్రాలో అయినా పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నేనో హైదరాబాదీ అని చెప్పుకోవడమే నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచీ ఎవరైనా అది నువ్వు చెయ్యలేవు అంటే.. అదే చేయాలని మొండిగా ప్రయత్నించేవాడిని. అలా ఛాలెంజ్‌ని స్వీకరించే ధోరణి సంప్రదాయ డిగ్రీ.. ఏంబీఏ.. రూటుని పక్కకు పెట్టి కసిగా సీఏలోకి మళ్లేలా చేసింది. 21 ఏళ్లకే సీఏ పూర్తి చేశా. అదీ తొలి ప్రయత్నంలోనే. నేను ఉత్తీర్ణత సాధించినప్పుడు పాస్‌ పర్సంటేజీ కేవలం 3 శాతమే. ఇంకేంటి.. ఇంట్లో అంతా హ్యపీ. చిన్న వయసులోనే మంచి ప్యాకేజీతో సెటిల్‌ అయిపోతాడు అనుకున్నారంతా. కానీ, అది నాకు ఇష్టం లేదు. నాన్న హెచ్‌ఆర్‌ ప్రొఫెషనల్‌ కావడంతో నా తొలి ఇష్టానికి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఒక్కటే చెప్పారు.. ‘ఏది ప్లాన్‌ చేసినా నలుగురికీ ఉపయోగపడే ప్లాట్‌ఫామ్‌ అయ్యుండాలని అన్నారంతే! నా వయసు చిన్నదే కాబట్టి ఏదైనా ప్రయోగం చేద్దాం అని నిర్ణయించుకున్నా. తేడా వస్తే మళ్లీ కెరీర్‌ని సెట్‌ చేసుకోవడానికి టైమ్‌ ఉంటుంది కదా!

ఓ యూట్యూబ్‌ వీడియోతో...

స్టార్టప్‌ ఐడియాల ఆలోచనలో పడ్ఢా దేన్ని జల్లెడ పట్టినా ఎక్కడా కిక్‌ దొరలేదు. ఓ రోజు అనుకోకుండా స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో వీడియో క్లిప్‌ చూశా. అదేంటంటే.. ఫుట్‌బాల్‌ జగ్లింగ్‌. కళ్లు చెదిరే ట్రిక్స్‌తో ఒకతను జగ్లింగ్‌ చేస్తున్నాడు. చూడ్డానికి పేదవాడిలా ఉన్నా ఆటలో మాత్రం ఛాంపియనే. క్లిప్‌ని వీక్షించిన వాళ్లందరూ మెచ్చుకోలు కామెంట్‌లే. కానీ, వాటితో అతనికి ఏం లాభం? అవే పొగడ్తలు తనకి సాయంలా మారితే. తను నిజంగానే ఛాంపియన్‌ అవుతాడేమో అనిపించింది నాకు. ఆ క్షణం మదిలో మెరిసిన ఆలోచనే ‘గుడ్‌క్లాప్‌’. ఏదైనా టాలెంట్‌ని చూసి మనం కొట్టే చప్పట్లు కేవలం మన ఆనందాన్ని ప్రదర్శించడానికే కాదు. వారికి సాయమైతే.. మెరుగైన సమాజానికి ఊపిరులూదొచ్చు అనిపించింది. డ్యాన్స్‌, సంగీతం, ఆటలు, పాటలు.. దాగున్న కళ దేనికైనా ఊతమివ్వాలనే ఆలోచనతో మొదటి అడుగు వేశాం. మొదట్లో 500 మంది దాకా ప్లాట్‌ఫామ్‌లో సభ్యులయ్యారు. పది మంది సభ్యులం బృందంగా ఏర్పడి క్రౌడ్‌ ఫండింగ్‌ చేసే పనిలో పడ్డాం. అప్పుడే మా ప్రయత్నంలో మేం గమనించని గ్యాప్‌ ఎక్కడుందో అర్థం అయ్యింది.

‘కారణం’ బలమైనదై ఉండాలి..

ఎప్పుడైనా నిధులు సేకరించాలంటే.. ఎదుటివారిని కదిలించేంత బలమైన కారణం ఉండాలి. అప్పుడే సాయం చేయడానికి సమాజం ముందుకొస్తుందని ఆ క్షణంలో అర్థమయ్యింది. ‘గుడ్‌క్లాప్‌’ పరిధిని పెంచాలని నిర్ణయించుకున్నా. చదువు, వైద్యం.. లాంటి ప్రధాన సమస్యల్ని ముందు వరుసలో పెట్టాం. వారికొచ్చిన కష్టాన్ని కథలా చెప్పడం మొదలు పెట్టాం. వివరాలు, ఫొటోలతో వారికి ఎదురైన సమస్యల్ని నిజ నిర్ధారణతో వెలుగులోకి తెచ్చాం. ఓ లింక్‌ని సృష్టించి సాయం చేయడం మీ బాధ్యత అని గుర్తు చేస్తూ ప్రచారం ప్రారంభించాం. ఆ లింక్‌ని బాధితులతో పాటు మా బృందం మొత్తం పలు సోషల్‌ మీడియా వేదికల్లో షేర్‌ అయ్యేలా చేశాం. డబ్బులు సాయం చేయలేని వారు కనీసం లింక్‌ని షేర్‌ చేసైనా బాధితులకు ఫండింగ్‌ వచ్చేందుకు సాయపడొచ్ఛు కొన్ని సార్లు క్యాంపెయిన్‌ పోస్ట్‌ చేసిన నిమిషాలు, గంటల్లోనే క్రౌడ్‌ ఫండింగ్‌ మొదలయ్యేది. కొందరికైతే ఒక్కరోజులోనే వారికి కావాల్సినంత ఫండ్‌ చేకూరడం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఇప్పటి వరకూ సుమారు 15 వేల మందికి పైనే దాతలు తోచినంత సాయం అందించి మా ప్రయత్నంలో భాగస్వాములయ్యారు. అంతేకాదు.. సాయం చేసే స్థోమతలేని వారు లెక్కకు మిక్కిలే మా క్యాంపెయిన్‌లను షేర్‌ చేస్తూ తమ వంతు బాధ్యతగా స్పందించడం గొప్ప విషయం. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు. వారి పాకెట్‌ మనీ నుంచి తీసి ఇవ్వలేకపోయినా పోస్ట్‌ చేసిన క్యాంపెయిన్‌లను వీలైనంత ఎక్కువ మందికి చేరవేయడంలో వారిది కీలక పాత్ర. మా వెబ్‌సైట్‌లలో క్యాంపెయిన్‌కి రెండు బటన్లు ఉంటాయి. ఒకటి డొనేట్‌.. రెండు అడాప్ట్‌. డబ్బు ఇవ్వలేని వారు అడాప్ట్‌ చేసుకుని క్యాంపెయిన్‌ని ఎక్కువ మందికి చేరేలా చేయొచ్చు.

‘టెక్నాలజీ’తోనే పారదర్శకత..

సాయం చేసిన వారెవరైనా మా డబ్బులు ఏమవుతున్నాయ్‌? నిజంగా చేరాల్సిన వారికి అందాయా? అని కచ్చితంగా ఆలోచిస్తారు. అందుకే.. వారు డొనేట్‌ చేసిన ప్రతి రూపాయి దేనికి సాయంగా మారిందో తెలిపేందుకు మా దగ్గర ప్రత్యేక టెక్నాలజీ సిద్ధంగా ఉంది. ఎప్పటికప్పుడు సంబంధిత రిపోర్టులు దాతలకు చేరిపోతాయి. నిధులు సేకరించే ప్లాట్‌ఫామ్‌ కావడంతో మోసాలు జరగడానికి అవకాశం ఉంది. గుడ్‌క్లాప్‌లో ఏది పోస్ట్‌ చేస్తే ఆ క్యాంపెయిన్‌ లైవ్‌లోకి రాదు. మేము నిజ నిర్ధారణ చేసుకుని ఆమోదించాకే లైవ్‌లోకి వస్తుంది. వైద్యానికి సంబంధించిన వాటిని హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడాకే క్యాంపెయిన్‌కి ఆమోదిస్తాం. అంతేకాదు.. మా ప్రయత్నంలో ఇంకొందరిని భాగస్వాముల్ని చేస్తూ నెట్‌వర్క్‌ని సిద్ధం చేస్తున్నాం. పలు కంపెనీలు, కాలేజీలు, ప్రముఖులు.. అందర్నీ గుడ్‌క్లాప్‌ ప్లాట్‌ఫామ్‌తో చేతులు కలిపేలా ఈవెంట్‌లు చేస్తున్నాం. నెలవారీ నిర్దేశిత మొత్తాన్ని మాకు ఫండింగ్‌ చేసే కాన్సెప్ట్‌ని (సిస్టమాటిక్‌ గుడ్‌నెస్‌ ప్లాన్‌) తీసుకొచ్చాం. ఆయా ఫండ్‌లను దేనికి వినియోగించామో తెలుపుతూ నెలవారీ రిపోర్టుల్ని వారికి చేరవేస్తాం. దీంతో వీలైనంత త్వరగా సాయం చేరాల్సిన వారికి చేరుతోంది. కంపెనీల్లోకి వెళ్లి ఫండ్‌ రైజ్‌ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం వస్తుంది. ఒకసారి మూడు గంటల్లో రూ.2.5 లక్షల ఫండ్‌ని సేకరించగలిగాం. ఒక్క చదువు, వైద్యానికే కాదు. కళలు, ఆవిష్కరణలకూ క్రౌడ్‌ ఫండింగ్‌ని అందిస్తున్నాం. మా ప్లాట్‌ఫామ్‌పై సేకరించిన ఫండ్స్‌తో పలు షార్ట్‌ఫిల్మ్‌లు అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేశారు కూడా. అలాగే, ప్రాజెక్టు వర్క్‌లు, పేపర్‌ ప్రజంటేషన్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర దేశాలకు వేళ్లే విద్యార్థులకు ఫండింగ్‌ చేస్తున్నాం.

అది విద్యార్థుల విజయం..

యశ్వంత్‌ బీటెక్‌ చదివాడు. యాక్సిడెంట్‌ కారణంగా బ్రెయిన్‌ సర్జరీ చేయాల్సివచ్చింది. ఆ విషయం గుడ్‌క్లాప్‌ దృష్టికి రావడంతో కాలేజీ విద్యార్థులతో కలిసి క్యాంపెయిన్‌ స్టార్ట్‌ చేశారు. ఆ రోజు ఆ ఒక్క పేజీలోకి 50 వేల మంది వచ్చారు. 1300 మంది డబ్బు సాయం చేశారు. మొత్తం రూ.5 లక్షలు వచ్చాయి. యశ్వంత్‌కి సర్జరీ అయ్యింది. ప్రమాదం తప్పింది. అది పూర్తిగా విద్యార్థుల విజయం అంటున్నాడు శశాంక్‌.

ఈ తరం జనరేషన్‌ జెడ్‌ (జెన్‌ జీ). వీళ్లు ప్రతి దాంట్లోనూ వారికి వచ్చే ప్రయోజనం ఏంటి? అనేదే చూస్తారు. వారికి ఏది సంతృప్తినిస్తోందో దాన్నే భుజాలపైకి ఎత్తుకుంటారు. సంప్రదాయ పద్ధతిలో వీరిని ప్రభావితం చేయడం కష్టం. అందుకే వారి రూటులోకి వెళ్లి డిజిటల్‌ మాధ్యమాల్ని వేదిక చేసుకున్నాం. వాళ్లు నిత్యం చురుగ్గా ఉండే సోషల్‌ మీడియానే మా లక్ష్యం. అక్కడే వారిని ప్రభావితం చేస్తూ ‘సాయం చేయడం మన బాధ్యత’ అని గుర్తు చేస్తున్నాం. దీంతో విద్యార్థులు క్యాంపెయిన్‌లను అడాప్ట్‌ చేసుకుని ఫండ్‌ రైజింగ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియా అత్యంత శక్తిమంతమైన కమ్యూనికేషన్‌ వేదికగా మార్చుకుని ప్రపంచాన్నే ప్రశ్నిస్తున్నారు ఈ జెన్‌ జీ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని