ప్రేమంటే సులువు కాదురా!

కన్నూ కన్నూ కలుసుకుంటాయి... మనసూ మనసూ మాటాడుకుంటాయి... చాటింగ్‌ గుండెల్ని తీయగా మీటుతుంది... కుర్రకారు నిండా లవ్‌లో మునిగిపోతారు... పెద్దలు ఒప్పుకుంటే లవ్‌ మ్యారేజ్‌. లేదంటే ప్రేమ వివాహం... అదో...

Updated : 13 Feb 2021 06:21 IST

రేపు ప్రేమికుల దినోత్సవం

కన్నూ కన్నూ కలుసుకుంటాయి... మనసూ మనసూ మాటాడుకుంటాయి... చాటింగ్‌ గుండెల్ని తీయగా మీటుతుంది... కుర్రకారు నిండా లవ్‌లో మునిగిపోతారు... పెద్దలు ఒప్పుకుంటే లవ్‌ మ్యారేజ్‌. లేదంటే ప్రేమ వివాహం... అదో అందమైన ప్రేమకథ. ఇంతటితో శుభం కార్డు పడుతుందా?
అంత లేదు గురూ! ప్రేమ, పెళ్లి.. తేలికేం కాదు... ఇక్కడే అసలు కథ మొదలవుతుంది... అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయ్‌.. సవాలక్ష సవాళ్లు కాచుకొని ఉంటాయ్‌...
అందుకే కడగండ్లను అవలీలగా దాటగలిగితేనే అడుగు ముందుకేయాలి... ఎవరి అండ లేకున్నా బతకగలం అనే భరోసా ఉంటేనే ఎదిరించాలి... ఆల్‌ ది బెస్ట్‌.

ప్రేమ.. అందరినీ జీవితంలో ఒక్కసారైనా పలకరిస్తుంది. అప్పుడిక ఊహల్లో ఊరేగుతుంటాం. హీరోల్లా ఫీలైపోతాం. నిజానికి ప్రేమలో పడినవాళ్లంతా హీరోలు కాదు. ప్రేమలో పడ్డాక.. ఎదురయ్యే కష్టాలను అధిగమించి, అందరినీ ఒప్పించి, కొత్త జీవితం మొదలుపెట్టేవాళ్లే నిజమైన హీరోలు, ప్రేమికులు.

పెద్దలు విలన్లు కాదు
సినిమా ప్రభావమో, మరొకటో చాలా జంటలు మా ప్రేమకు పెద్దలే విలన్లు అంటుంటారు. వాస్తవానికి పిల్లల ప్రేమను నిరాకరించిన వారికంటే ఒప్పుకున్న వాళ్లే ఈ సమాజంలో ఎక్కువ. వాళ్లు ‘నో’ అంటున్నారంటే కచ్చితంగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే పెద్దలు అనుభవాన్ని కాచి వడబోస్తారు. ప్రేమ, పెళ్లిలో ఉండే సాధకబాధలు దాటుకొని ముందుకొచ్చి ఉంటారు. ఆ బాధలు మా పిల్లలు పడొద్దని తపిస్తారు. అందుకే కని, పెంచి, ప్రేమను ధారపోసిన వాళ్లు మన లవ్‌ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలి. మన ఎంపిక తప్పా? ఒప్పా? అవలోకించుకోవాలి. అయినా ఏ లోపం లేదనుకుంటే ధైర్యంగా ముందుకెళ్లిపోవచ్చు.
సమాజం వెంటాడుతుంది
మనిషి సంఘజీవి. ‘ఎవరేమనుకున్నా ఐ డేంట్‌ కేర్‌’ అని మీరనుకున్నా సమాజం మిమ్మల్ని వెంటాడటం మానదు. ప్రేమ పెళ్లితో ఒక్కరైన జంటని ‘మన కులం కాదట?’, ‘మన మతం కాదట..’ అంటూ ఈటెల్లాంటి మాటలతో గుచ్చుతుంది. చేతల్లో వివక్ష చూపిస్తుంది. బంధువులు దూరం పెడతారు. చుట్టాలు పట్టించుకోరు. పల్లెలు, చిన్నచిన్న పట్టణాల్లో ఈ రకమైన ఇబ్బందులు ఎక్కువ. ఇవన్నీ మనసుని బాధిస్తాయి. అయినా దేనికీ చలించని గుండె నిబ్బరం మీకుంటే హ్యాపీ. చేయని తప్పునకు అంతా చిన్నచూపు చూస్తున్నారే.. అని బాధపడే మనస్తత్వం మీదైతే అలాంటి ప్రేమ జోలికి వెళ్లకుండా ఉంటేనే ఉత్తమం. 

కెరీర్‌ ముఖ్యం
నువ్వు నా సొంతమైతే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అంటాడు కుర్రాడు. నా గుండెల్లో కలకాలం నిలిచి ఉంటావ్‌ అంటుంది కుర్రది. ఈ బాసలు, ఊసులు నెరవేరాలంటే.. ప్రేమ ఒక్కటే సరిపోదు. మేడలు, కార్లు.. లాంటి విలాసాలు కాకపోయినా కనీస సౌకర్యాలకు కొరత లేకుండా ఉండాలంటే ఇద్దరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి. చదువు, కెరీర్‌ని నిర్లక్ష్యం చేస్తే జీవితం స్వర్గం కాదు కదా.. బతుకే దుర్భరం అవుతుంది. పచ్చని ప్రేమలో చిచ్చు రేగుతుంది. నువ్వు చేతగానివాడివి చిన్నచిన్న కోర్కెలు తీర్చలేకపోతున్నావ్‌ అంటుంది భార్య. కెరీర్‌ని పక్కనపెట్టేలా నీ చుట్టే తిప్పుకున్నావ్‌ కదా అంటాడు అబ్బాయి. అందుకే ప్రేమలో సఫలం కావాలంటే ముందు కెరీర్‌లో విజయం సాధించాలి.

మార్చుకోవాల్సింది ఎంతో
నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు ఒక్కడివే. ప్రేమలో పడితే ఇద్దరొక్కటి. కష్టాలు, కన్నీళ్లు.. ఇష్టాలు, బాధలు, సంతోషాలు అన్నీ కలిసి పంచుకోవాల్సిందే. దానికి తగ్గట్టు ప్రేమికులు కొన్ని మార్చుకోవాల్సిందే.
స్వార్థం: ఇద్దరిలో ఉండకూడదు. నాకోసమే ఈ రిలేషన్‌షిప్‌ అనుకోకూడదు. ఏదీ అతిగా ఆశించొద్దు.
వ్యామోహం: ఇష్టపడ్డ వ్యక్తి నాకే సొంతం అనే అతి వ్యామోహం ఉండకూడదు. భాగస్వామి వేరేవాళ్లతో మాట్లాడొద్దు, నన్నే ఇష్టపడాలి అనే ఆంక్షలొద్దు.
నమ్మకం: నీ ఫోన్‌ ఎంగేజ్‌ వస్తోంది.. ఎవరితో మాట్లాడుతున్నావ్‌? ఇలాంటి అనుమానాలు బంధానికి ఎసరు పెడతాయి. నమ్మకం కొరవడితే అవతలి వైపు ప్రేమ మంచుముక్కలా కరిగిపోవడం ఖాయం.
సానుభూతి: మనని అర్థం చేసుకోవాలి, మన కష్టాల్ని పట్టించుకోవాలి అని ఆలోచించడమే కాదు.. మనం అవతలివాళ్లనీ అర్థం చేసుకోవాలి.
అర్థం చేసుకోవడం: అమ్మాయికి గుడికెళ్లడం ఇష్టం. అబ్బాయి సినిమా అంటాడు. ఎవరైనా ఒకరు వెనక్కి తగ్గాల్సిందే. అలాగే పొరపాటు జరిగినప్పుడు సారీ చెప్పడానికి వెనకాడొద్దు. క్షమించడానికి ముందుండాలి. ప్రేమ ఒప్పుకోగానే అమ్మాయి/అబ్బాయి నా సొంతం అన్నట్టుగా ఉండొద్దు.వాళ్లకి కావాల్సిన స్పేస్‌ ఇవ్వాలి.

మూడూ ఉంటేనే ముందుకు

ప్రేమలో పడటం కాదు.. ప్రేమని నిలుపుకోవడం గొప్ప. ప్రేమలో పడేముందు, పడ్డ తర్వాత నేను ఈ బంధంలో సౌకర్యంగా ఉండగలనా? అని ప్రశ్నించుకోవాలి. అది లేనప్పుడు బయటికొచ్చేయడమే మేలు. మంచి రివార్డు, నష్టభయం లేకపోవడం, మెరుగైన ఎంపిక.. ఈ మూడూ ఉంటే మీ ఎంపిక సబబే అన్నట్టు. రివార్డు అంటే.. అవతలి వ్యక్తి నుంచి సంతోషం, సాంత్వన, ఆనందంలాంటి రివార్డులు దక్కాలి. నష్టభయం లేకపోవడం అంటే ప్రేమ కారణంగా లక్ష్యాన్ని వదులుకోవడం, సౌకర్యాలు కోల్పోవడం, అమ్మానాన్నలు దూరమవడంలాంటివి లేకపోవడం. ఎంపిక అంటే.. మనకు తెలిసిన ఓ మంచి అమ్మాయి/అబ్బాయి కన్నా మన లవర్‌ వ్యక్తిత్వంలో మిన్నగా ఉండటం. వీటితోపాటు ప్రేమ నిలవాలంటే కులం, మతం, సమాజం, డబ్బూ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రేమలో పడేముందే వీటిని ఎదురించగలమా? ఇంట్లో ఆమోదం లభిస్తుందా? అంచనా వేసిన తర్వాతే ముందుకెళ్లాలి. ప్రేమ మోజులో కెరీర్‌ని నిర్లక్ష్యం చేయొద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని