పరిశోధకులకు పట్టం!

ఇద్దరు కుర్రాళ్లు... పరిశోధనలతోనే ఎదగాలనే పంతం వారిది! ఉన్నత చదువులు చదవలేని పేదరికం ఒకరిది... లక్షల డాలర్ల జీతం వదిలిన నేపథ్యం మరొకరిది... కొన్నాళ్లకే లక్ష్యం చేరారు. యువతకు స్ఫూర్తిగా నిలిచారు....

Published : 21 Aug 2021 03:29 IST

ఇద్దరు కుర్రాళ్లు...

పరిశోధనలతోనే ఎదగాలనే పంతం వారిది! ఉన్నత చదువులు చదవలేని పేదరికం ఒకరిది...

లక్షల డాలర్ల జీతం వదిలిన నేపథ్యం మరొకరిది... కొన్నాళ్లకే లక్ష్యం చేరారు. యువతకు స్ఫూర్తిగా నిలిచారు.


అమెరికా మెచ్చిన పరిశోధకుడు

ముందునుంచీ చదువులో మెరిట్‌. ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీలో చదివాడు. అమెరికాలో లక్షల డాలర్ల ఉద్యోగాన్ని వదిలాడు. ఎందుకు? ఆ కొలువు తన పరిశోధనలకు ఆటంకంగా మారుతుందని. ఆపై అలుపెరుగక చేసిన పరిశోధనలకు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయస్థాయి అవార్డు అందుకున్నాడు. ఆ యువకుడే నల్గొండ జిల్లా మిర్యాలగూడ యువకుడు మేకల ధీరజ్‌.

ధీరజ్‌.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, శాండియాగోలో ఎంఎస్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసిన తర్వాత కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ అంశాలపై పీహెచ్‌డీ చేస్తున్నాడు. ముందునుంచీ కంప్యూటర్‌, టెక్నాలజీపై ఇష్టం చూపించే తను బీటెక్‌లో చేరేనాటికే దానిపై పట్టు సాధించాడు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ-కాన్పూర్‌లో ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడు రెండు, అమెరికాలో ఎం.ఎస్‌.చేస్తున్నప్పుడు మూడు పరిశోధక వ్యాసాలు రాశాడు. ఇవన్నీ ప్రముఖ అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితం అయ్యాయి. ఐఐటీ నుంచి పట్టా అందుకోగానే ఆరంకెల వేతనంతో ఉద్యోగం దక్కింది. కొన్నాళ్లు అక్కడ పని చేశాక తన ఆశయానికి అడ్డంకిగా భావించి దాన్ని వదిలేశాడు. ప్రస్తుతం తను పరిశోధనలు చేస్తున్న యూనివర్సిటీ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌కి ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటి. 2017లో ఐఐటీలో తను రాసిన రిసెర్చ్‌ పేపర్లపై సింగపూర్‌, కోపెన్‌హాగెన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మెషిన్‌ లెర్నింగ్‌ సదస్సులో చర్చించారు.‘కంప్యూటర్‌ క్లాసిఫికేషన్‌ అనాలసిస్‌’ అంశంపై రాసిన పరిశోధక వ్యాసాలు లోతైన పరిజ్ఞానంతో ఉన్నాయని నిపుణులు కొనియాడారు. ప్రస్తుతం తక్కువ శ్రమతో, ఎక్కువ వేగంగా పనిచేసే కంప్యూటర్‌ లాంగ్వేజెస్‌ రూపొందించే పనిలో ఉన్నాడు ధీరజ్‌. ఈ పరిశోధనలు, ప్రతిభను గుర్తించిన కాలిఫోర్నియా యూనివర్సిటీ ‘మాస్టర్స్‌ అవార్డు ఫర్‌ ఎక్స్‌లెన్సీ ఇన్‌ రిసెర్చ్‌’గా గుర్తించింది. ఓ తెలుగు విద్యార్థి ఈ తరహా అవార్డు పొందటం ఇదే మొదటిసారి. తమ కళాశాల పూర్వ విద్యార్థి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు సాధించడం గర్వంగా ఉందని ఐఐటీ-కాన్పూర్‌ కంప్యూటర్‌ సైన్సు విభాగం ప్రొఫెసర్లు ట్విటర్‌ వేదికగా ప్రశంసించారు.

- భువనగిరి అశోక్‌ కుమార్‌, మిర్యాలగూడ


తండ్రి కాగితం మిల్లులో.. కొడుకు కరెన్సీ భద్రతలో!

మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ సెక్యూరిటీ పేపర్‌ మిల్లు. అక్కడి మొత్తం 1,500 మంది ఉద్యోగుల్లో ఒకే ఒక్క తెలుగు యువకుడు దండనాయకుల సాయి ప్రభాకర్‌ రావు. కరెన్సీ నోట్లకు వినియోగించే పేపరు నాణ్యతను పెంచడం, వాటి తయారీ ఖర్చు తగ్గించడంలో ఎనిమిదేళ్లుగా పరిశోధనలు చేస్తున్నాడు. తన కృషికి గుర్తింపుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అవార్డు ప్రకటించారు.

సాయిది కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌. హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేసి కొన్నాళ్లు లెక్చరర్‌గా పాఠాలు బోధించాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు సాధ్యం కాలేదు. అదేసమయంలో ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఫ్రొఫెసర్‌గా పనిచేసే పెదనాన్న సూచనతో పరిశోధన రంగంపై ఆసక్తి పెంచుకున్నాడు. 2013లో సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా పరీక్ష రాస్తే హోషంగాబాద్‌లోని కరెన్సీ పేపర్‌మిల్లు లాబోరేటరీలో పర్యవేక్షకుడిగా ఉద్యోగం వచ్చింది. అత్యుత్తమ ప్రమాణాలతో కరెన్సీ నోట్లు తయారు చేయడం, తయారీలో ఖర్చు తగ్గించడం, దొంగనోట్లు గుర్తించడం.. తన విధులు. దేశంలో అక్రమంగా పట్టుబడిన నోట్ల కట్టలు ఇక్కడికే తీసుకొస్తారు. అందులో చాలావాటిని ఈ ల్యాబోరేటరీలోనే దొంగనోట్లుగా తేల్చాడు సాయి.

పనిలో మంచి ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అవార్డులు ప్రకటిస్తారు. అత్యుత్తమ ప్రమాణాలు పాటించిన ల్యాబోరేటరీలకు సైతం కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డు నుంచి ఐఎస్‌వో, ఐఈసీ 1705, 2017 ధ్రువపత్రాలు జారీ చేస్తుంది. దీంట్లో ప్రతిభ, సామర్థ్యం నిరూపించుకోవడానికి పరీక్షలు నిర్వహిస్తుంటారు. దీనికోసం మైసూరు, హోషంగాబాద్‌ మిల్లుల నుంచి చాలామంది ఉద్యోగులు పోటీ పడ్డారు. కొత్త టెక్నాలజీ ఉపయోగించి కరెన్సీ నోట్ల తయారీ ఖర్చు తగ్గించడం, కొన్నిరకాల రసాయనాలు వాడి దొంగనోట్లు తయారు చేయకుండా చూడటం, ఇతర లోపాలు సవరించడం.. ఈ అంశాలన్నీ వివరించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు సాయి. దాంతో నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డు గుర్తింపు పత్రంతో పాటు అవార్డు దక్కింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవాల్సి ఉన్నా.. కొవిడ్‌ కారణంగా జనరల్‌ మేనేజర్‌ వివేక్‌ ఠాక్రే నుంచి తీసుకున్నాడు.

- చొక్కాల రమేశ్‌, ఆసిఫాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని