ఫ్రెండ్స్‌.. కామ్రేడ్స్‌!!

ఎవరు వీళ్లంతా? వాళ్ల స్నేహితుల గురించి ఎందుకు చెబుతున్నారు? అని ఆలోచిస్తున్నారా? వీళ్లంతా ‘కామ్రేడ్‌’ దోస్తులు. అదేనండీ.. ‘డియర్‌ కామ్రేడ్‌’లో విజయ్‌ దేవరకొండ వెనక నడిచిన మిత్రులు. ‘క్యాలేజీ క్యాంటీన్‌ అంటేనే..’ అంటూ విజయ్‌తో కలిసి సందడి చేశారు. అదీ సింగిల్‌ టేక్‌లో.. యూట్యూబ్‌లో విడుదల చేస్తే మిలియన్ల కొద్దీ వ్యూస్‌.. ఇప్పుడు ఆ పాటని సినిమాలోనూ జత చేశారు. రేపటి స్నేహితుల దినోత్సవం (ఫ్రెండ్‌షిప్‌ డే) సందర్భంగా వారి స్నేహగీతాన్ని వినిపించమని కోరితే.. వారి గురించి చెబుతూనే సాధించిన సక్సెస్‌లో ఫ్రెండ్స్‌ పాత్ర ఎంతో ‘ఈతరం’తో పంచుకున్నారు.

Published : 03 Aug 2019 00:26 IST

రేపు స్నేహితుల దినోత్సవం

ఎవరు వీళ్లంతా? వాళ్ల స్నేహితుల గురించి ఎందుకు చెబుతున్నారు? అని ఆలోచిస్తున్నారా? వీళ్లంతా ‘కామ్రేడ్‌’ దోస్తులు. అదేనండీ.. ‘డియర్‌ కామ్రేడ్‌’లో విజయ్‌ దేవరకొండ వెనక నడిచిన మిత్రులు. ‘క్యాలేజీ క్యాంటీన్‌ అంటేనే..’ అంటూ విజయ్‌తో కలిసి సందడి చేశారు. అదీ సింగిల్‌ టేక్‌లో.. యూట్యూబ్‌లో విడుదల చేస్తే మిలియన్ల కొద్దీ వ్యూస్‌.. ఇప్పుడు ఆ పాటని సినిమాలోనూ జత చేశారు. రేపటి స్నేహితుల దినోత్సవం (ఫ్రెండ్‌షిప్‌ డే) సందర్భంగా వారి స్నేహగీతాన్ని వినిపించమని కోరితే.. వారి గురించి చెబుతూనే సాధించిన సక్సెస్‌లో ఫ్రెండ్స్‌ పాత్ర ఎంతో ‘ఈతరం’తో పంచుకున్నారు. ప్రతి ఒక్కరి విజయంలో ఫ్రెండు ‘కామ్రేడ్‌’లా వెనుక నిలబడతాడని నమ్మకంగా చెబుతున్నారిలా...

నాకున్న ఫ్రెండ్స్‌ ఎప్పుడూ నన్ను జడ్జ్‌ చేయలేదు. అందుకే డిగ్రీ చదువుతూనే నటుడినయ్యా.. 

- కిరీష్‌

మిత్రులంతా కలిస్తే ఫోన్‌ పక్కన పడేస్తాం. ముఖాల్లోకి చూస్తూ ముచ్చట్లు పెడతాం. అందుకేనేమో ఒకరి కష్టం మరొకరికి ఇట్టే తెలిసిపోతుంది.. 

- సుహాస్‌

నాకు ఎక్కువ ఫ్రెండ్స్‌ అబ్బాయిలే. కానీ, వారి నుంచి ఎప్పుడూ సెక్యూరిటీని కోరుకోలేదు. ప్రోత్సాహం తప్ప! 

- దివ్య

నో ఫ్రెండ్‌ రిక్వస్ట్‌లు... నాకున్న బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అతి కొద్ది మందే. అందుకేనేమో విడిపోవడం అంటే ఏంటో మాకు తెలియదు... 

- వికాస్‌

స్నేహితులకు ఓపిక ఎక్కువ. ఎందుకంటే.. మేం కలవడానికి వాడుకున్న ఏకైన నెట్‌వర్క్‌.. ‘సైకిల్‌ నెట్‌వర్క్‌’.. తొక్కుతూ వెళ్లాలి. వచ్చే వరకూ వెయిట్‌ చేయాలి. 

- తరుణ్‌

ముఖం చూసి మాట్లాడే ఫ్రెండ్‌ ఉండాలి

నేను సుహాస్‌ అండీ.. మాది విజయవాడ. ఇంటర్‌, డిగ్రీల్లోనే నటుడికి ఏమేం ఉండాలో అన్నీ నేర్చుకున్నా. కాలేజీ ఫెస్ట్‌ల్లో యాక్టింగ్‌లో ఎప్పుడూ నెంబర్‌ వన్‌. స్టూడెంట్‌ లీడర్‌ని. యాక్టర్‌ అవ్వాలనే హైదరాబాద్‌ వచ్చేశా. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగే రోటీన్‌ సీన్స్‌ తర్వాత సొంతంగా వీడియోలు, షార్ట్‌ఫిల్మ్‌లు చేశా. తర్వాత ఛాయ్‌ బిస్కెట్‌ నా లైఫ్‌కో టర్న్‌ అనొచ్చు. సుమారు 100 పైనే షార్ట్‌ఫిల్మ్‌లు, వీడియోలు చేసుంటా. అవన్నీ యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. కొన్ని ఊహించని స్థాయిలో వైరల్‌ అయ్యాయి. దీంతో సినిమా అవకాశాలు తలుపుతట్టాయి. పడిపడిలేచే మనసు, మజిలీ, ఏజెంట్‌ ఆత్రేయ ఇప్పుడు డియర్‌ కామ్రేడ్‌.. మరో రెండు కొత్త సినిమాల్లో చేస్తున్నా. నా మొత్తం ప్రయాణంలో ఇరవై ఏళ్లుగా బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కొద్ది మందే. సుఖేష్‌, పానీ.. వీళ్లు ఎప్పటికీ నా బెస్టీలు. ఏది పంచుకోవాలన్నా వీళ్లతోనే. మాదంతా సైకిల్‌ బ్యాచ్‌. అప్పట్లో వాట్సప్‌లు, జీపీఎస్‌ లైవ్‌లు.. ఏం లేవు. కలవాలంటే సైకిల్‌ తొక్కుకుని వెళ్లడమే. అందరూ అడ్డాకి వచ్చేదాకా వెయిట్‌ చేయడమే. అందుకేనేమో.. అప్పటి స్నేహానికి ఓపిక ఉండేది. అప్పుడూ.. అలా కాదు. ఎక్కడున్నావ్‌? అంటూ నిమిషానికో మెసేజ్‌. లైవ్‌ షేర్‌ చేయమనడాలు.. అంతా ఇన్‌స్టెంట్‌గా అయిపోవాలని కోరుకుంటున్నారు. అసలు ముఖం చూసి మాట్లాడుకోవడమే లేదు. పక్కనున్నా ఫోన్‌ల్లోకి చూస్తూనే మాట్లాడుకోవడం.. ఎమోజీలతో నవ్వుకోవడం.. చిత్రంగా అనిపిస్తోంది. చిన్న గ్యాప్‌ వచ్చినా ఫ్రెండ్‌షిప్‌ నుంచి సైన్‌ఆఫ్‌ అవుతున్నారు. సోషల్‌ మీడియాలో రోజుకో స్నేహితుడు పరిచయం అవ్వొచ్చు..  గంట గంటకీ మెసేజ్‌ పెట్టొచ్చు... కానీ, మనం కలిసినప్పుడు అన్నీ పక్కన పెట్టేసి మన కళ్లలోకి చూస్తూ మాట్లాడే స్నేహితులు ఎంతమంది ఉన్నారో చెక్‌ చేయండి. అలాంటోడు ఒక్కడున్నా మీకో మంచి కామ్రేడ్‌ దొరికినట్టే. వాడే ఎప్పుడూ పక్కాగా రివ్యూ చేస్తూ మనలోని బలాల్ని పరిచయం చేస్తాడు.

ఇప్పటికీ ఏం ఆశించడం లేదు

హాయ్‌.. నేను వికాస్‌. చెన్నైలోనే పుట్టి పెరిగా. తెలుగోళ్లమే. మధ్య తరగతి కుటుంబం. ఇంజినీరింగ్‌ చదువుకున్నా. కాలేజీ ఇంటర్‌ కాంపిటీషన్స్‌లో మైమ్‌తో పరిచయం ఏర్పడింది. దానికి సీనియర్లే కారణం. వాళ్లు బాగా ప్రోత్సహించారు. చదువు తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేశాగానీ ఎక్కడా నాకు కావాల్సిన కిక్‌ దొరకలేదు. నా అడుగులు మళ్లీ మైమ్‌ షోల వైపే పడ్డాయి. బృందంగా ఏర్పడి మైమ్‌ నటనతోనే కెరీర్‌ని స్టార్ట్‌ చేయాలనుకున్నాం. స్కూల్‌ పిల్లలకు ఇదో ఆర్ట్‌గా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాం. పిల్లలకు బోధించాం. అదే టైమ్‌లో దృష్టి షార్ట్‌ఫిల్మ్‌ల వైపు మళ్లింది. అనుకోకుండా డైరెక్టర్‌ శంకర్‌ గారు రీమేక్‌ చేసిన త్రీఇడియట్స్‌ (స్నేహితులు పేరుతో తెలుగులో...) సినిమాలో నటించే అవకాశం దక్కింది. మిల్లీ మీటర్‌ సెంటీమీటర్‌ అయ్యే క్యారెక్టర్‌. తర్వాత నటుడిగా ప్రయాణం మొదలైంది. తమిళంలో వెబ్‌ సిరీస్‌, ఒక సినిమా చేశా. ఇప్పుడు డియర్‌ కామ్రేడ్‌. ఎలాంటి రిఫరెన్స్‌ లేదు. ఆడిషన్‌ చేసి సెలెక్ట్‌ చేశారు. నా మొత్తం జర్నీలో ఫ్రెండ్స్‌ పాత్ర కీలకం. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేటప్పుడు తిరిగి ఆశించకుండా డబ్బు సాయం చేశారు. ఇప్పుడు నేను తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నిస్తే.. నీ నుంచి ఆశించింది డబ్బు కాదురా. నువ్వింకా మంచి నటుడివి అవ్వాలి. అది చాలు అంటారు. లైక్‌లు, కామెంట్‌లు చేసే ఫ్రెండ్స్‌ ఎంత మంది ఉంటే ఏం లాభం. ఇలాంటి ఫ్రెండ్స్‌ ఇద్దరు, ముగ్గురున్నా చాలు. ఇప్పటి సోషల్‌ మీడియాలో ఫ్రెండ్స్‌ సర్కిల్‌ని మేనేజ్‌ చేయడం కొంచెం కష్టమే. ఎప్పుడూ ఏదోఒక మెసేజ్‌ పెడుతుంటారు. రిప్లై ఇవ్వకుంటే ‘నువ్వసలు ఫ్రెండువేనా?’ అంటారు. వెంటనే రియాక్షన్‌ని కోరుకోవడం. అది దొరక్కుంటే.. హర్ట్‌ అవ్వడం.... ఇప్పుడు మామూలైపోయింది. కాకపోతే.. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సాయంతో ఫ్రెండ్స్‌ కాంటాక్ట్స్‌ని పెంచుకోవచ్చు. ఎవరి ద్వారా ఏ అవకాశం తలుపు తడుతుందో చెప్పలేం కదా!

సెక్యూరిటీనే కోరుకోరు...

నేను దివ్య. ఆంధ్రా మూలాలున్న తెలంగాణా అమ్మాయిని. బీబీఏ చేశాను. తర్వాత ఐబీఏంలో కొన్నేళ్లు పని చేశా. జాబ్‌ కాకుండా ఇకేం చేయాలి అనుకున్నప్పుడు? నా ఆప్షన్‌.. యాక్టింగ్‌. చిన్నప్పటి నుంచీ ఉండేది. గ్రౌండ్‌లోకి దిగి పోటీ పడాలంటే నన్ను నేను నమ్మాలిగా. అందుకే కాస్త టైమ్‌ తీసుకున్నా. నటనకు సిద్ధపడుతున్న టైమ్‌లోనే అనుకోకుండా ఒక షార్ట్‌ఫిల్మ్‌లో యాక్ట్‌ చేశా. అది పూరీ జగన్నాథ్‌ చూసి బాగా ప్రోత్సహించారు. తర్వాత ఛాయ్‌ బిస్కెట్‌ నాకో మంచి వేదికయ్యింది. చాలా కామెడీ స్కిట్‌లు, వీకెండ్‌ వీడియోలు, వెబ్‌సిరీస్‌లు చేశాను. సినిమాలో నటించింది మాత్రం డియర్‌ కామ్రేడ్‌లోనే. ఈ మొత్తం జర్నీలో ‘నువ్వు అమ్మాయివి.. జాగ్రత్త!’ అనే ఇన్‌సెక్యూర్డ్‌ వాక్యాన్ని చాలా సార్లు విన్నా. ఒక్క మా అమ్మా, నాన్న నుంచి తప్ప. వాళ్లు నన్ను నమ్మారు. ధైర్యంగా నిన్ను నువ్వే కాపాడుకోవాలని ప్రోత్సహించిన కామ్రేడ్‌లు వాళ్లే. తర్వాత నాకున్న సపోర్టు మొత్తం ఫ్రెండ్స్‌ నుంచే.. ముఖ్యంగా అబ్బాయిలు. వాళ్లు నేనో అమ్మాయి అని స్పెషల్‌ స్టేటస్‌ ఎప్పుడూ ఇచ్చేవారు. వాళ్లతో కలిపేసుకునేవారు. దీంతో నాలో ఇన్‌సెక్యూరిటీ భావన వచ్చేది కాదు. లేట్‌ అవుతోంది.. ఇంటికెళ్లాలి అనే భయం అస్సలు ఉండేది కాదు. సో.. ఏ అమ్మాయి అయినా.. అబ్బాయిల నుంచి సెక్యూరిటీని ఆశిస్తుందంటే పొరబాటే. వాళ్ల మధ్యలో ఎదగాలని కోరుకుంటుంది. అలాంటి వాతావరణం అబ్బాయి, అమ్మాయిల మధ్య స్నేహంలో ఉంటే మంచిది. అలాంటి కామ్రేడ్స్‌ నా చుట్టూ ఉండబట్టే నా జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.

నన్నెప్పుడూ జడ్జ్‌ చేయలేదు..

నేను కిరీష్‌ కౌటిల్య. పక్కా హైదరాబాదీ. బీఫార్మసీ చదువుతున్నా. నాదంతా వాట్సాప్‌ జనరేషన్‌. మా గ్యాంగ్‌ లీడర్‌ విజయ్‌ దేవరకొండని అన్ని సోషల్‌ మీడియా పేజీల్లో ఫాలో అయ్యేవాడిని. అలానే డియర్‌ కామ్రేడ్స్‌ క్యాస్టింగ్‌ కాల్‌ని చూశా. అప్లై చేసి ఆడిషన్‌కి వెళ్లి సెలెక్ట్‌ అయ్యా. ఇంత చిన్న వయసులో సినిమా పిచ్చేంట్రా బై.. అంటే. ఇది ఇప్పటిది కాదు. స్కూల్‌ టైమ్‌ నుంచి సినిమాలంటే ఇష్టం. స్కూల్‌లో స్టేజీ డ్రామాలు చేసేవాళ్లం. చంటిగాడు లోకల్‌!! అంటూ తిరిగేవాడిని. రవితేజకి పిచ్చ ఫ్యాన్‌ని. కాలేజీ డేస్‌కి వచ్చే సరికి నేనూ నటుడవ్వాలనే కోరిక పెరిగింది. బీఫార్మసీ చదువుతూనే ప్రయత్నాలు మొదలెట్టా. అమ్మా, నాన్న  కామ్రేడ్స్‌లా వెన్నుతట్టారు. ఇంటర్‌ తర్వాత షార్ట్‌ఫిల్మ్‌ చేశా. తర్వాత డియర్‌ కామ్రేడ్‌తో జర్నీ మొదలైంది. చదువు, షూటింగ్‌ రెండూ మేనేజ్‌ చేసే క్రమంలో ఫ్రెండ్స్‌ సాయం చాలా ఎక్కువ. నా ఎసైన్‌లు, రికార్డులు వాళ్లే రాసేవాళ్లు. ముఖ్యంగా శ్రావణీ, దీపక్‌. యాక్టర్‌ అవుదాం అనుకుంటున్నా అని వాళ్లకి చెప్పినప్పుడు బ్యాచ్‌లో ఎవ్వరూ నన్ను జడ్జ్‌ చేయలేదు. బహుశా ఎవరైనా నన్ను ఇలా.. అలా.. అని జడ్జ్‌ చేసుంటే వెనకడుగు వేసేవాడినేమో. స్నేహితుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మనల్ని నువ్వు ఇంతేనని నిర్దేశిస్తూ మాట్లాడడు.

సేఫ్‌జోన్‌ని దాటగలిగా..

నేను తరుణ్‌.. బీకామ్‌ చేశా. ఎంబీఏ చదుతున్నా. స్కూల్‌ నుంచే సినిమాల పిచ్చి బాగా ఎక్కువ. స్టోరీ టెల్లింగ్‌ అంటే ఇష్టం. స్కూల్‌లో దుర్యోధనుడి పాత్రలో నటించా. అదే నా మొదటి స్కిట్‌. అప్పుడే ఫిక్స్‌ అయ్యా. నేను యాక్టర్‌ అవ్వాలని. ఇంటర్‌ నుంచే నవలలు చదివేవాడిని.. కథలు రాసేవాడిని. నా దగ్గర సబ్జెక్ట్‌కు సంబంధించిన పుస్తకాలకంటే నవలలేే ఎక్కువ ఉండేవి. క్లాస్‌లో నిద్రోస్తే కథలు రాసేవాడిని. ఇంటర్‌ తర్వాత ఇష్టం లేకపోయినా ఇంజినీరింగ్‌లో జాయిన్‌ చేశారు. చదలేకపోయా. ఇంట్లో చెప్పేశా. రెండేళ్లకి డ్రాప్‌అవుట్‌. చాలా గొడవలు ఇంట్లో. అయినా నా నిర్ణయంలో మార్పు లేదు. తర్వాత కామ్‌గా బీకామ్‌ చదువుతూ షార్ట్‌ఫిల్మ్‌లు, వీడియోలు చేశా. ఇలా డియర్‌ కామ్రేడ్‌ ఫ్రెండ్స్‌లో ఒకడినయ్యా. ఇప్పుడు పేరెంట్స్‌కి నమ్మకం వచ్చింది. ఇన్నేళ్ల జర్నీకి కారణం స్నేహితులే. నా మీదున్న ప్రేమతో పేరెంట్స్‌ ఇన్‌సెక్యూర్డ్‌గా మాట్లాడినప్పుడు.. నన్ను సేఫ్‌జోన్‌ని దాటేలా చేసింది మిత్రులే. లేదంటే.. నేనూ ఓ ఐటీ జాబ్‌ చేసుకుంటూ రోటీన్‌గా లైఫ్‌ని గడుపుతుండేవాడిని. అప్పట్లో ఇద్దరు ఫ్రెండ్స్‌ విడిపోతే పెద్ద టాపిక్‌. ఇద్దర్నీ కూర్చోబెట్టి పంచాయితీ చేసేవాళ్లం. ఇప్పుడు అలా లేదు. వాడుపోతే.. ఇంకొకడు అనేస్తున్నారు. బలమైన స్నేహం లేదు.. అందరూ బల్ల స్నేహితులే. టేబుల్‌ దాటి వెళ్లగానే ఇంకో టేబుల్‌లో కలిసిపోతున్నారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని