చదువుల తేజస్సు

అనుకూలించని ఆర్థిక పరిస్థితులను... ‘తపనొక్కటే’ ఓడించగలదు. అనుకోని కష్టాలను... అకుంఠిత ‘దీక్షే’ గెలవగలదు. ఉన్నత స్థితికి చేరాలనే లక్ష్యాన్ని... ‘శ్రద్ధే’ తీర్చగలదు. తపనతో చదివి... దీక్షతో పోటీ పరీక్షల్లో నెగ్గి.. శ్రద్ధగా ‘భూకంపాన్నే’ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాడో యువకుడు. ఇతని పేరు తేజేశ్‌ గారాల. కేంబ్రిడ్జి ..

Published : 03 Nov 2018 00:37 IST

అనుకూలించని ఆర్థిక పరిస్థితులను... ‘తపనొక్కటే’ ఓడించగలదు. అనుకోని కష్టాలను... అకుంఠిత ‘దీక్షే’ గెలవగలదు. ఉన్నత స్థితికి చేరాలనే లక్ష్యాన్ని... ‘శ్రద్ధే’ తీర్చగలదు. తపనతో చదివి... దీక్షతో పోటీ పరీక్షల్లో నెగ్గి.. శ్రద్ధగా ‘భూకంపాన్నే’ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాడో యువకుడు. ఇతని పేరు తేజేశ్‌ గారాల. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో భూకంపాల తీవ్రతను తట్టుకునే కట్టడాలపై పరిశోధనల్లో రాటుదేలుతున్నాడు. భారతీయులెవరూ ఇప్పటివరకు సాధించలేని ఫిలిప్‌ టర్నర్‌ ప్రైజ్‌ను అందుకొని ప్రశంసలందుకున్నాడు. తన చిన్న కుటుంబానికి ఏమాత్రం భారం కాకుండా... ఉపకార వేతనాలతోనే ఉవ్వెత్తున ఎగుస్తున్నాడు.

చదువుల తేజస్సు

నాకు ఈ దేశం ఎంతో ఇచ్చింది. నేను ఆ రుణాన్ని తీర్చుకోవాలి. అత్యుత్తమ పరిశోధనలు చేసి... ఏదో కొత్త విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేసి దేశానికి పేరు తీసుకురావాలి. నన్ను కష్టపడి పెంచిన తల్లిదండ్రులకు ఎలాంటి కష్టం రాకుండా... నా కుటుంబాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలనేది నా జీవిత ఆశయం.

పేరులోలానే జీవితంలోనూ తేజస్సులు నింపుకోవాలని నిరంతరం శ్రమిస్తున్న తేజేశ్‌ది తిరుపతి దగ్గరలోని తిరుచానూరు. తండ్రి గారాల వెంకటరమణ. ఈయన తితిదే ఆధ్వరంలో నడిచే అన్నదానం ట్రస్ట్‌లో వంటమనిషిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. దిగువ మధ్యతరగతి కుటుంబం. కార్పొరేట్‌ స్కూలు ఫీజులకు భయపడి... తితిదే ఆధ్వర్యంలో కోదండరామ స్వామి ఆలయ పాఠశాలలో తేజేశ్‌ని చదివించారు. చిన్నప్పటి నుంచి కుటుంబ పరిస్థితులు, తండ్రి సంపాదన గురించి తేజేశ్‌ తెలుసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తన చదువుల భారం నాన్నపై మోపకూడదని భావించాడు. అక్కకు పెళ్లి చేసి అంతంత మాత్రంగా ఉన్న కుటుంబానికి భారం కాకూడదని అనుకున్నాడు. పదో తరగతిలో 81 శాతం మార్కులతో బయటపడ్డాడు. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చి... చదువుపై ఇంకా బాగా దృష్టి పెట్టాడు. ఇంటర్‌లో తిరుపతి రంగనాథ జూనియర్‌ కళాశాలలో 94 శాతం మార్కులు.. ఎంసెట్‌లో వేయిలోపు ర్యాంకు సాధించాడు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు పొందాడు. సివిల్‌ ఇంజినీరింగ్‌ను అమితంగా ఇష్టపడే తేజేశ్‌... కళాశాలలో అత్యుత్తమ విద్యార్థిగా 90 శాతం మార్కులతో బయటకు వచ్చాడు.  పీజీ చేయాలనే తలంపుతో గేట్‌కు సన్నద్ధం అయ్యాడు. ఈ విషయంలో తేజేశ్‌కు అతడి బాబాయి రాజగోపాల్‌, పిన్ని రెడ్డెమ్మలు సహకరించారు.

ఐఐటీ నుంచి కేంబ్రిడ్జి వరకూ... 
గేట్‌లో మంచి ర్యాంకు సాధించడంతో హైదరాబాద్‌ ఐఐటీలో ఎంటెక్‌ చేసే అవకాశం లభించింది. ఇక్కడా ఆర్థికంగా ఇంట్లో వాళ్లపై ఆధారపడకుండా... కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వార్షిక ఉపకార వేతనాన్ని సాధించాడు. సివిల్‌ ఇంజినీరింగ్‌లో టాపర్‌గా 9.83 గ్రేడు మార్కులతో రజత పతకంతో ఎంటెక్‌ పూర్తి చేశాడు. పీహెచ్‌డీ చేసేందుకు    కేంబ్రిడ్జి యూనివర్సిటీకు, జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీకు దరఖాస్తు చేసుకున్నాడు. రెండు విశ్వవిద్యాలయాల నుంచి ఆహ్వానం అందింది. అయితే మరోసారి డబ్బు సమస్య ఎదురైంది.

చదువుల తేజస్సు

ఈ సమయంలోనే యూకే ప్రభుత్వం కామన్‌వెల్త్‌ దేశాల్లో చదివే విద్యార్థులకు ఇచ్చే ఎంహెచ్‌ఆర్‌డీ ఉపకార వేతనం గురించి తేజేశ్‌ తెలుసుకున్నాడు. దరఖాస్తు చేశాడు. వేలమంది పోటీ. దీనిలో ఎంపికైతే రూ.కోటి వరకు ఆర్థికసాయం అందుతుంది. కామన్వెల్త్‌ దేశాల నుంచి వచ్చిన అన్నీ దరఖాస్తులను పరిశీలించి లండన్‌లోని కామన్‌వెల్త్‌ స్కాలర్‌షిప్‌ కమిషన్‌ చాలా తక్కువ మంది విద్యార్థుల్ని ఎంపిక చేస్తుంది. మూడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. వీటిల్లో ప్రతిభ చూపిన వారికి ఉపకారవేతనం ఇస్తుంది. భారతదేశంలో 14 మంది ఈ ఉపకారవేతనానికి ఎంపికైతే... సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో తేజ్‌శ్‌ దీనికి అర్హత పొందాడు. పరిశోధన మొత్తానికి రూ.కోటి విడతలవారీగా అందుకుంటున్నాడు.

ఒకే ఒక్కడు 
ఈ అక్టోబరులో తేజేశ్‌ మరో అరుదైన అవార్డును అందుకున్నాడు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రతిష్ఠాత్మకంగా ఏటా అందిస్తున్న ఫిలిప్‌ టర్నర్‌ ప్రైజ్‌ను తేజేశ్‌ అందుకున్నాడు. జియో టెక్నికల్‌ సెంట్రిఫుజి టెస్టింగ్‌లో అద్భుత ప్రదర్శనకు ఈ అవార్డు అందింది. తాను పరిశోధన చేస్తున్న అంశంపై కొత్త విషయాన్ని వివరణాత్మకంగా ప్రదర్శించాలి. ఇందులోనూ ప్రతిభ చూపాడు. 2001వ సంవత్సరం నుంచి  కేంబ్రిడ్జి పరిశోధన విద్యార్థులకు ఈ అవార్డును మూడో సంవత్సరంలో అందిస్తోంది. దాన్ని తేజేశ్‌ అందుకొని, మొట్టమొదటి భారతీయుడిగా రికార్డులకెక్కారు. దీనికి రూ.లక్ష వరకు బహుమతితో పాటు ఆనర్‌బోర్డులో తేజేశ్‌ పేరు ఎప్పటికీ ఉండిపోతుంది. చదువు, పరిశోధనలకే పరిమితం కాకుండా నాయకుడిగానూ తేజేశ్‌ గుర్తింపుపొందాడు. మూడు సంవత్సరాలుగా కేంబ్రిడ్జి యూనివర్సిటీ జీవో టెక్నికల్‌ సొసైటీకు వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. అలాగే కామన్‌వెల్త్‌ స్కాలర్‌షిప్స్‌ స్కాలర్స్‌కు అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నాడు. విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్స్‌ స్టూడెంట్స్‌ అంబాసిడర్‌గా సేవలందిస్తున్నాడు.

కేంబ్రిడ్జి  నుంచి ఫిలిప్‌ టర్నర్‌ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు

ఈ ఉపకారవేతనానికి ఎంపికయ్యే విద్యార్థులకు  వీసా సులభంగా లభిస్తుంది. దీంతో తండ్రి ఆర్థికస్థోమత అడ్డంకిగా మారలేదు. ప్రస్తుతం కేంబ్రిడ్జి యూనివర్సిటీలో భూకంపాల తీవ్రతను తట్టుకొని నిలబడే నిర్మాణాలపై పరిశోధన చేస్తున్నాడు. ప్రస్తుతం మూడోసంవత్సరం చదువుతున్నాడు. దీనికోసం ఏటా రూ.26 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అక్కడ ఉండేందుకు, తినేందుకు అయ్యే ఖర్చులు అదనం. దీనికోసం చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూనే పరిశోధన సాగిస్తున్నాడు. మూడో సంవత్సరంలో తేజేశ్‌ కేంబ్రిడ్జి యూనివర్సిటీ, అట్కిన్స్‌ సంస్థ సంయుక్తంగా అందించే బెస్ట్‌ పోస్టర్‌ అవార్డు పొందారు.

- శివ మావూరి, తిరుపతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని