మైక్‌లో నవ్వుల మైకం!

స్టాండప్‌ కామెడీ అంటే మిమిక్రీ కాదు.. కామెడీ స్కిట్‌ అంతకన్నా కాదు.. స్టాండప్‌ కమెడియన్‌ స్టేజ్‌మీదకొచ్చి మైక్‌ పట్టుకుంటే.. అంతా తానై బాహుబలిలా విజృంభించాలి... మాటలతో మాయ చేయాలి.. హావభావాలతో అలరించాలి.. నటనతో మెప్పించాలి.. మొత్తంగా ఈ అద్భుత వాక్చాతుర్య విన్యాస కళని స్టేజీపై ఒక్కడే పోషించాలి.. ఇలా తెలుగులో తమదైన శైలితో రాణిస్తున్నారు నేటి తరం మిలీనియల్స్‌. దీన్నో కళగానే కాదు. కెరీర్‌లా మలుచుకుంటూ తమదైన ముద్ర వేస్తున్నారు తెలుగు స్టాండప్‌ కమెడియన్లు..  ‘ఈతరం’ వారిని పలకరించింది.

Published : 30 Mar 2019 00:25 IST

స్టాండప్‌ కామెడీ అంటే మిమిక్రీ కాదు.. కామెడీ స్కిట్‌ అంతకన్నా కాదు.. స్టాండప్‌ కమెడియన్‌ స్టేజ్‌మీదకొచ్చి మైక్‌ పట్టుకుంటే.. అంతా తానై బాహుబలిలా విజృంభించాలి... మాటలతో మాయ చేయాలి.. హావభావాలతో అలరించాలి.. నటనతో మెప్పించాలి.. మొత్తంగా ఈ అద్భుత వాక్చాతుర్య విన్యాస కళని స్టేజీపై ఒక్కడే పోషించాలి.. ఇలా తెలుగులో తమదైన శైలితో రాణిస్తున్నారు నేటి తరం మిలీనియల్స్‌. దీన్నో కళగానే కాదు. కెరీర్‌లా మలుచుకుంటూ తమదైన ముద్ర వేస్తున్నారు తెలుగు స్టాండప్‌ కమెడియన్లు..  ‘ఈతరం’ వారిని పలకరించింది.

నా మాటలతో ఒత్తిడికి మందేస్తున్నా..

మాది కొత్తగూడెం. నేను ఎంబీఎ చదివాక మూడేళ్లపాటు బెంగుళూరులో ఉద్యోగం చేశా.  ఆ సమయంలో ‘పబ్లిక్‌ స్పీకింగ్‌ ఫోరమ్‌’లో హాస్య ప్రసంగాలిచ్చేవాణ్ని. అప్పుడే.. ఏ సాయం లేకుండా ఉండే నిజమైన కళ స్టాండప్‌ కామెడీ గురించి తెల్సింది. నచ్చింది. సవాల్‌గా తీసుకున్నా. 2012లో హైదరాబాద్‌లో ఇంగ్లీషులోనే స్టాండప్‌ కామెడీ ప్రారంభించా. నేనే హోస్ట్‌ చేసేవాణ్ణి. కమెడియన్లను పిలిచి కార్యక్రమం నిర్వహించటం ఓ సవాల్‌గా ఉండేది. ఇష్టంగా చేశా. 2015లో ‘చతుర్లు’ అనే తెలుగు స్టాండప్‌ కామెడీని నిర్వహించారు. ఆ పోటీలో బహుమతి గెలుచుకున్నా. ప్రస్తుతం తెలుగులో నెలకు రెండు షోలు చేస్తున్నాం. ఇవి గంటన్నర నిడివితో ఉంటాయి. సోషల్‌ మీడియా వల్ల ఈ స్టాండప్‌కి క్రేజ్‌ వచ్చింది. ఇటీవలే దేశంలోని 21 నగరాల్లో సందేశ్‌ జానీ, భవనీత్‌తో కలిసి స్టాండప్‌ కామెడీ టూర్‌ చేశా. అదో మంచి అనుభూతి. మనదేశంలో ఇప్పుడిప్పుడే ఈ కళకి ఆదరణ పెరుగుతోంది. ఈ రంగంలోకి రావాలనుకునేవారికి  నవ్వించే సత్తా ఉండాలి. బాగా రాయాలి. అద్దంముందు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేదు.. ఓపెన్‌ మైక్స్‌కి వచ్చి లైవ్‌లో జనాలను నవ్విస్తేనే కిక్‌ తెలుస్తుంది.

- రాజశేఖర్‌ మామిడన్న

నిమిషంలో నాలుగు సార్లు నవ్వించాలి...

హైదరాబాద్‌లో పుట్టిపెరిగాను. కన్సల్టెంట్‌గా ఫ్రీలాన్స్‌ జాబ్‌ చేస్తున్నా. ఇంట్లోవారినో, స్నేహితులనో కాదు తెలీని వాళ్లని నవ్వించటమే ఇక్కడ మాకో పెద్ద సవాల్‌. ఇప్పటివరకూ నేనైతే ఓ పాతిక షోలకు పైగా తెలుగులో చేశాను. మేం కొన్ని వందలసార్లు సాధన చేశాక వీడియో షూట్‌ చేస్తాం. పత్రికలు, టీవీ, సమాజం నుంచే కామెడీకి కావాల్సిన ఇన్‌పుట్స్‌ తీసుకుంటా. గత ఫిబ్రవరి 11 వ తేదీన నేను చేసిన ‘డార్క్‌ స్కిన్‌’ వీడియోకి నలభై ఎనిమిది లక్షలకి పైగా క్లిక్స్‌ వచ్చాయి. షో ప్రారంభం అయినప్పటి నుంచీ నిమిషానికి నాలుగుసార్లు నవ్వించాలి. బాగా నవ్విస్తే ‘కిల్లింగ్‌’ అంటారు.. నవ్వించకుంటే ‘బాంబింగ్‌’ అంటూ పెదవి విరుస్తారు. మేం హార్డ్‌వర్క్‌ చేసి షోకి వెళ్లినపుడు వేదిక, లైటింగ్‌, ప్రేక్షకులు, వాతావరణం. ఇలా అన్నీ కుదరాలి. జోక్‌ వేసేప్పుడు ఎవరైనా తలుపు తీస్తే దాని ప్రభావం పడుతుంది. ఇటువైపు రావాలనుకుంటే.. సలహాలతో పని లేదు. సాధన చేయండి. ముంబైలో స్టాండప్‌ కమెడియన్లు సినిమా నటులు, రచయితలవుతున్నారు. మీకో విషయం తెలుసా.. కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కమెడియన్లకు ఉద్యోగాలు ఇస్తున్నాయి.

- సాయికిరణ్‌

నాకు ఎదురైన సంఘ‌ట‌న‌లే కామెడీ..

నాన్న చర్చి పాస్టర్‌. నా బాల్యం అంతా హిమాచల్‌ ప్రదేశ్‌, నేపాల్‌ ప్రాంతాల్లో గడిచింది. అందుకే ఉత్తరాది యాస మాటల్లో కానొస్తుంది. హైదరాబాద్‌లో అమెజాన్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నపుడు.. 2016లో ఓ స్టాండప్‌ కామెడీ చూశాను. థ్రిల్లయ్యాను. అరే.. నేను కూడా ఇలాగే నవ్విస్తాను కదా అని మనసులో అనుకున్నా. ఆత్మవిశ్వాసంతో ఓపెన్‌ మైక్స్‌కి వెళ్లాను. నా ఆలోచనలకి ఎదుటివాళ్లు నవ్వుతుంటే భలే అనిపించింది. ఆ వెంటనే నా జీవితంలో జరిగిన కామెడీ అంశాలతో షో చేశా. నవ్వించగలిగా. ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశా. ఇటీవలే 21 రోజుల్లో బెంగళూరు, గోవా, ముంబయి, ఢిల్లీ.. ఇలా 21 నగరాల్లో స్టాండప్‌ కామెడీ చేశా. ఈ ప్రయాణంతో క్రమశిక్షణ అలవడింది. నా సత్తా తెల్సింది. యువతకి నేను చెప్పేదొక్కటే.. ఎవరి స్టయిల్‌ వారిది. ఎవరి అనుభవాలు వారివి. కామెడీ రాసుకో.. ప్రదర్శించు..అంతే. ఈ రంగంలో సహనం అవసరం. నేను ఇప్పటివరకూ తెలుగులో 20 షోలు చేశాను. నేను ఒక్కణ్నే ఒకే టాపిక్‌ మీద గంట పాటు కామెడీ చేస్తూ దేశంలోని నగరాలన్నీ తిరగాలనేది నా కల.

- సందేశ్‌ జానీ

ప్లాస్టిక్‌ నవ్వులుండవు!

నేను బెంగళూరులో పెరిగాను. బీటెక్‌ చదివా. మా అమ్మ ఫిజిక్స్‌ లెక్చరర్‌, మా నాన్న ఫార్మసీ రంగంలో ఉద్యోగం చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంది మా కుటుంబం. స్టాండప్‌ కామెడీ అంటే ఆసక్తి కాబట్టి మా ఇంట్లో కాకుండా ఆఫీసుకి దగ్గరగా ఉండే హాస్టల్‌లో ఉంటున్నా. మా అమ్మానాన్న ఈ రంగానికే వద్దన్నారు. నా ఆసక్తిని చూసి సరేనన్నారు. స్టాండప్‌ కామెడీ నాకు ఉద్యోగం లాంటిది కాదు.. లైఫ్‌ స్టయిల్‌. మూడేళ్లకితం యూట్యూబ్‌లో స్టాండప్‌ కామెడీ చూశా. ఆ తర్వాత హైదరాబాద్‌ కామెడీ క్లబ్‌, హాట్‌ కప్‌ కాఫీ షాప్స్‌ వేదికలపైన తెలుగులో కామెడీ చేశా. ప్రస్తుతం టెక్నికల్‌ లీడ్‌గా ఉద్యోగం చేస్తూనే.. మా ఆఫీసుకు దగ్గర్లో ఉండే ‘కోవర్కింగ్‌ 24’, మాదాపూర్‌ లో తెలుగు ఓపెన్‌ మైక్స్‌ నిర్వహిస్తున్నా. ప్రేక్షకులను తీసుకురావటం, కమెడియన్లను గుర్తించటం, ఓపెన్‌మైక్స్‌కి హోస్ట్‌లను వెతకటం.. చేస్తుంటా. మా షోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తా. స్టాండప్‌ కామెడీలో ప్లాస్టిక్‌ నవ్వులుండవు. మొదట మనం రాసింది మనకు నవ్వు తెప్పించాలి.. అప్పుడే ఇతరులు కచ్చితంగా నవ్వుతారు. మళ్లీ మళ్లీ రాసుకునే సహనం ఉండాలి. సినిమాలకే కాదు. తెలుగు స్టాండప్‌ కామెడీ షోలకూ టిక్కెట్లు త్వరగా అమ్ముడవ్వాలి. అలాంటి రోజులు వస్తాయి.

- ప్రణవి

నవ్వించలేక అభాసుపాలయ్యా!!

నాలో వెటకారమే ఇటువైపు లాక్కొచ్చింది. మాది ఒంగోలు జిల్లాలోని రెడ్డిపాలెం అనే గ్రామం. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాక బెంగళూరులో ఉద్యోగం చేశా. అప్పుడే స్టాండప్‌ కామెడీ ఓపెన్‌ మైక్స్‌కి వెళ్లాను. ఇంగ్లీషులో కూడా కామెడీ చేశాను. భాషమీద పట్టులేక నవ్వించలేక.. అభాసుపాలయ్యా. అయినా ప్రయత్నాలు ఆపలేదు. కన్నడం నేర్చుకుని మరీ ఓపెన్‌మైక్స్‌లో కన్నడిగుల్ని నవ్వించా. హైదరాబాద్‌కి మారాక తెలుగు ఓపెన్‌మెక్స్‌కి క్రమం తప్పకుండా వెళ్తున్నా. జేబులో 150 రూపాయలుంటే నాటకాలు, కామెడీషోలకు వెళ్లకుండా సినిమాకి వెళ్లే మనస్తత్వం మనది. మా అమ్మానాన్నకి స్టాండప్‌ కామెడీ అంటే ఏంటో తెలీదు. నేను చెప్పినా అర్థం కాదు. ‘ఉద్యోగం వదలకు’ అంటారంతే. నాకు మా అన్నయ్య సహకారం ఉంది. మన తెలుగు స్టాండప్‌ కామెడీకి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది.

- బబ్బూరి వెంకటేశ్వర్లు
 
 
 
 

- రాళ్లపల్లి రాజావలి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని