ఒట్టు.. వెళ్లి వస్తా!! అని చెప్పండి

బాబూ.. నిన్నే! ఎక్కడికి వెళ్తున్నావ్‌? బుజ్జెమ్మా.. చెప్పు! ఎప్పుడు వస్తావ్‌? హాలులో పేపర్‌ చదువుతూనో... వంటింట్లో కూరొండుతూనో.. తల్లిదండ్రులు అడుగుతూనే ఉంటారు! వినబడినా చెవిన పడనట్టుగానే.. వెళ్లిపోతారు పిల్లలు. లేదా విసుగ్గా సమాధానం.. ‘వస్తాలే.. రాకుండా పోతానా?’ అంటూ గడపదాటేస్తారు!

Published : 04 May 2019 00:03 IST

జరసోచో!

బాబూ.. నిన్నే! ఎక్కడికి వెళ్తున్నావ్‌? బుజ్జెమ్మా.. చెప్పు! ఎప్పుడు వస్తావ్‌? హాలులో పేపర్‌ చదువుతూనో... వంటింట్లో కూరొండుతూనో.. తల్లిదండ్రులు అడుగుతూనే ఉంటారు! వినబడినా చెవిన పడనట్టుగానే.. వెళ్లిపోతారు పిల్లలు. లేదా విసుగ్గా సమాధానం.. ‘వస్తాలే.. రాకుండా పోతానా?’ అంటూ గడపదాటేస్తారు! ఫ్రెండ్స్‌తో లాంగ్‌డ్రైవ్‌లు.. పార్టీలు.. సినిమాలు.. షికార్లు.. ఆకాశమే హద్దు..! అనే హుషారులో దూసుకెళ్తుంటారు. కట్‌ చేస్తే..ఓ ఫోన్‌ కాల్‌.. జాహ్నవి మీ అమ్మాయేనా? వరుణ్‌రెడ్డి మీ అబ్బాయేనా? వెంటనే హాస్పటల్‌కి రండి! మాటలు వినగానే కాళ్ల కింద భూమి కంపిస్తుంది తల్లిదండ్రులకు.. అప్పుడు ఏళ్లుగా పెంచుకున్న గంపెడు ఆశల కోసం పడే ఆవేదన ఎలా ఉంటుందో తెలుసా? టీనేజర్లూ మీకు వారి ఏడుపు వినిపిస్తోందా? మీరు పురుడు పోసుకుంది మొదలు మీకిచ్చిన మాటని నిలబెట్టుకుంటూనే వస్తున్నారు. మరి, మీరేం చేస్తున్నారు? వాళ్లను పెడచెవిన పెడుతున్నారు. వాళ్ల మాట వినడం లేదు. వాళ్లకిచ్చిన మాట నిలుపుకోవడం లేదు. ఒక్కసారి ఫోన్‌ని మ్యూట్‌లో పెట్టి అమ్మా, నాన్నల మనసు వేదనని వినండి..


కొంచెం కేరింగ్‌!
*బండి మీద త్రిబుల్‌ రైడింగా?
* లైసెన్సులున్నాయా?
* కారులో అయితే సీటు బెల్ట్‌ పెట్టుకున్నారా?
* డ్రైవింగ్‌ చేసేవారికి సరిగ్గా వచ్చా?
* కారులో ఎయిర్‌ బెలూన్లు ఉన్నాయా?
* అసలు ఎంత మంది ప్రయాణిస్తున్నారు?మద్యం తాగుతున్నారా?
* తాగి డ్రైవింగ్‌ చేస్తున్నారా?
ఇలా మీరు ప్రశ్నించుకుంటే... తల్లిదండ్రులకు గర్భశోకం తప్పుతుంది. మీ మీదే ఆశలన్నీ పెట్టుకొని బతుకుతున్న అమ్మానాన్నలకు భరోసా దొరుకుతుంది.
* ఒట్టు... కొంచెం కేరింగ్‌గా ఉంటా’ అని ఒట్టేయండి.


ఉయ్యాలలో ఉన్నప్పుడు..

తొమ్మిది నెలలు అమ్మ కడుపులో భద్రంగా మీరు.. అపురూపంగా చూసుకున్న నాన్న.. మూడు నాలుగు కేజీలతో మీరు భూమిపై పడగానే వారికి వేల టన్నుల భరోసా. అది మొదలు. మీ చుట్టూనే వై-ఫైలా తిరుగుతారు. మీ కేరింతలు, తుళ్లింతలే పబ్‌లు, డిస్కోటెక్‌లు, ఐమ్యాక్స్‌లు. ఉయ్యాలలోనో.. బామ్మ ఒడిలో హాయిగా నిద్రపోతున్నా.. ఆడుకుంటున్నా.. అడిగినా.. అడక్కపోయినా.. మీకో మాటిస్తారు. ‘ఆఫీస్‌కి వెళుతున్నా బుజ్జి కన్నా.. సాయంత్రానికి వచ్చేస్తా’ అని. మాటిచ్చినట్టే.. ఆఫీస్‌ అవ్వగానే సరాసరి ఇంటివైపే పరుగు. మిమ్మల్ని కాసేపు ఎత్తుకుని ఆడిస్తేగానీ ఆ కొన్ని గంటల బెంగ తీరదు. అందుకే.. మీరూ బయటికి వెళ్లే ముందు క్షణం ఆగండి..
* ‘ఒట్టు ఫలానో చోటికి.. వెళ్లొస్తా’ అని చెప్పండి.

దూరంగా ఉన్నప్పుడూ..
వేలు పట్టుకుని నడిచిన పిల్లలు.. భుజంపై చెయ్యి వేసి నడుస్తుంటే బలంగా ఫీల్‌ అవుతారు. నా బిడ్డలు ఉన్నతమైన చదువులతో నా కంటే ఎత్తులో నిలబడాలన్న కోరికతో బెంగను దాచేసి రెక్కలు తొడిగి ఎగిరేలా చేస్తారు. ఎందుకంటే.. ప్రపంచాన్ని వారు చూడని కోణంలో చూడాలనే. తలెత్తి దునియా మిమ్మల్ని చూడాలని. అంతేగానీ.. మీరు అందనంత దూరం వెళ్లిపోవడానికి కాదు. ఒక్కటి గుర్తుంచుకోండి.. మీ క్యాలెండర్‌ మొదలయ్యిందంటే.. కన్నవాళ్ల క్యాలెండర్‌ ముగుస్తున్నట్టు. వారి బుక్‌మార్క్‌లన్నీ మీ ఎదుగుదల కోసం చేసినవే. మరి, మీరు పెట్టుకునే బుక్‌మార్క్‌లు ఎవరి కోసం? స్నేహితులతో పార్టీలు.. గెట్‌ టు గెదర్స్‌కేనా?
అందుకే.. భావావేశాల్ని నియంత్రించుకోండి.
* ‘ఒట్టు.. మీ కోసమే నా ఎదుగుదల’ అని చెప్పండి.

స్కూల్‌లో వదిలి వెళ్లేప్పుడూ..
చేతుల్ని రెడ్‌ కార్పెట్‌లా పరుస్తారు.. వారి కాళ్లను మీ కాళ్లు చేస్తారు.. నడకలు నేర్పుతారు. ప్రపంచాన్ని పరిచయం చేస్తారు. మూడు, నాలుగేళ్ల వరకూ అన్నీ తామై ఇంటా.. బయటా తిరుగుతారు. ఆ రోజు రానే వస్తుంది. స్కూల్‌ గేటు లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌లా (ఎల్‌ఓసీ) అనిపిస్తుంది. దాటి వెళ్లనని మొరాయిస్తారు. మీతో పాటు చంటి పిల్లల్లా ఏడ్చేస్తారు. అప్పుడూ మాటిస్తారు. స్కూల్‌ ముగిసేసరికి గేటు బయటే ఉంటానని. అన్నట్టుగానే.. గంట కొట్టకముందే మీ కంటే ఆత్రుతగా ఎదురు చూస్తూ కనిపిస్తారు. బ్యాగు తగిలించుకుని మీరొస్తుంటే.. మీరేదో సాధించేసినట్టు ఫీల్‌ అవుతారు. ఎత్తుకుని ముద్దాడేస్తారు. పొగిడేస్తారు. ఎన్నో జాగ్రత్తలు చెబుతారు. నాలుగు గోడల మధ్య మీరు చదువుకునేందుకు వెళ్తేనే తల్లడిల్లిపోతారు. మరి అలాంటి అమ్మానాన్నలకు ఎక్కడికి వెళుతున్నారో? ఎప్పుడు తిరిగొస్తారో చెప్పలేమా?
* ‘ఒట్టు.. క్షేమంగా వస్తానని’ మాటివ్వండి.

మాటిస్తారు కదూ!!
ఇప్పుడే. ఈ క్షణమే. వాట్సాప్‌ స్టేటస్‌లోనో.. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లోనో రాయండి. అల్లరి చేష్టలతోనో.. ఆకతాయి పనులతోనో... పిడికిలి బిగించి రైజ్‌ చేసే బండి ఎక్సలేటర్‌.. బలంగా తొక్కే కారు ఎక్‌సలేటర్‌ కంటే.. అమ్మా, నాన్న కనే కలలకే వేగం ఎక్కువ అని. ముందు వాటిని అందుకునే ప్రయత్నం చేయాలని ఒట్టు పెట్టుకోండి. అవి అందుకుంటే వచ్చే కిక్కే వేరప్పా అని మీకు మీరే చెప్పుకోండి. అప్పుడే మీకు అసలైన మజా వస్తుంది. ఆ క్షణం మీకో ఉన్నతమైన వ్యక్తిత్వం సంతరించుకుంటుంది. మీరు గెలిచిన రోజు ప్రపంచం దృష్టిలో హీరోలు అవుతారు. అలా కాకుండా.. అనిపించేదేదో చేస్తూ.. కనిపించిన వాటిని అందుకోవాలనుకుంటే పేపర్‌లో వార్తలుగా. పది మంది నోట ఆకతాయి యువతగా మిగిలిపోతారు. అంతేనా.. మీరే ప్రాణాలుగా పెంచిన పేరెంట్స్‌కి తీరని శోకంగా మిగిలిపోతారు. మీరు క్యార్‌... క్యార్‌ అని ఏడిస్తే తట్టుకోలేని తల్లిదండ్రులు... మీ కోసం ‘కేర్‌... కేర్‌’ అని మొత్తుకొంటున్నారు. కాస్త జాగ్రత్తగా వినండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని