కార్టూన్స్‌ చూసి.. యానిమేషన్‌ చేసి..

చిన్నప్పుడు కార్టూన్స్‌ చూశాడు. కాస్త పెద్దయ్యాక వీడియోగేమ్స్‌ ఆడాడు. పెరిగి పెద్దయ్యాక యానిమేషన్‌ చిత్రాలు తీసే స్థాయికి ఎదిగాడు. యానిమేషన్‌ రంగంలో ఆస్కార్‌కు నామినేషన్‌ పొందాడు హైదరాబాద్‌కు చెందిన కళ్యాణ్‌ సూర. ఆసక్తి, కష్టపడేతత్వం... ఉంటే చాలు అనుకున్న లక్ష్యం చేరడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించిన యువకుడు కళ్యాణ్‌ శ్రీకాకుళంలో పుట్టాడు.

Updated : 22 Jun 2019 01:11 IST

విజువిల్‌ కళ్యాణ్‌

చిన్నప్పుడు కార్టూన్స్‌ చూశాడు. కాస్త పెద్దయ్యాక వీడియోగేమ్స్‌ ఆడాడు. పెరిగి పెద్దయ్యాక యానిమేషన్‌ చిత్రాలు తీసే స్థాయికి ఎదిగాడు. యానిమేషన్‌ రంగంలో ఆస్కార్‌కు నామినేషన్‌ పొందాడు హైదరాబాద్‌కు చెందిన కళ్యాణ్‌ సూర. ఆసక్తి, కష్టపడేతత్వం... ఉంటే చాలు అనుకున్న లక్ష్యం చేరడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించిన యువకుడు కళ్యాణ్‌ శ్రీకాకుళంలో పుట్టాడు. హైదరాబాద్‌లో పెరిగాడు. హిమాయత్‌నగర్‌లో సెయింట్‌పాల్స్‌ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివాడు. బిట్స్‌ పిలానీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతూనే ఫిల్మ్‌ మేకింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. కళాశాలలోని క్రియేటివ్‌ ఆర్ట్స్‌ సొసైటీ యాక్టివిటీ క్లబ్‌కు అధ్యక్షుడై ప్రతిభ చూపాడు.

‘‘భారత్‌లో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు పెద్దగా లేవు. టాలీవుడ్‌, హాలీవుడ్‌ సంస్కృతులను మేళవించేలా సినిమాలు రూపొందించే ఆలోచనలో ఉన్నా. ఈ రెండు సంస్కృతుల వ్యత్యాసంపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నా.’’

ఆసుపత్రి మంచంపై నుంచే ఇంటర్వ్యూకి..
కాలిఫోర్నియాకు చెందిన ‘డ్రీమ్‌వర్క్స్‌ యానిమేషన్‌’ సంస్థ బిట్స్‌లో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. కళ్యాణ్‌ ఆ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. యానిమేషన్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్లపై శిక్షణ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అందుకు రూ.2లక్షలు అవుతుందనడంతో వెనకడుగు వేయక తప్పలేదు. తపన ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు మనల్ని ఆపలేవు. శిక్షణకు ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా... యూట్యూబ్‌లోని వీడియోల్ని చూస్తూ 20 వరకు సాఫ్ట్‌వేర్లను అధ్యయనం చేశాడు. ఇంతలో జీవితంలో చిన్న కుదుపు. ప్రమాదవశాత్తు కాలికి దెబ్బ తగలడంతో ఆసుపత్రి పాలయ్యాడు. నెలన్నరపాటు బెడ్‌పైనే గడపాల్సి వచ్చినా కుంగిపోలేదు. ప్రత్యేక అనుమతి తీసుకొని బెడ్‌పై నుంచే ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. బిట్స్‌లో సుమారు 400 మంది ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తులు చేస్తే ఒక్కడే ఎంపికయ్యాడు. 2012లో అమెరికా నుంచి ఆహ్వానం అందడంతో అక్కడికి వెళ్లి శిక్షణ పొందాడు. తొలి ఆరు నెలలు శిక్షణ ఇచ్చిన సంస్థ నిర్వాహకులు.. బెంగళూరులోని తమ శాఖకు టెక్నికల్‌ డైరెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు. అలా మొదటిసారి ప్రతిభను నిరూపించుకునేలా అతడి చేతికి ఓ ప్రాజెక్టు వచ్చింది. ‘హౌ టు ట్రెయిన్‌ యువర్‌ డ్రాగన్‌-2’ అనే కంప్యూటర్‌ యానిమేటెడ్‌ యాక్షన్‌ ఫాంటసీ ఫిల్మ్‌కు గ్రాఫిక్స్‌లో సహకారం అందించాడు. ఆ ఫిల్మ్‌ 2014లో ‘అన్ని అవార్డ్స్‌’ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. ‘మిస్టర్‌ పీబాడీ అండ్‌ షెర్మన్‌’, ‘పెంగ్విన్స్‌ ఆఫ్‌ మెడగాస్కర్‌’ సినిమాల కోసం సుమారు 600 మంది బృందానికి టెక్నికల్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు.

ఆస్కార్‌ విజేత మార్గదర్శకత్వంలో ప్రయాణం
అమెరికాలో కథారచన, దర్శకత్వం, విజువల్‌ ఎఫెక్ట్స్‌, సౌండ్‌ డిజైనింగ్‌ వంటి ఆర్ట్స్‌పై శిక్షణ ఇవ్వడంలో ప్రఖ్యాత ఫిల్మ్‌ స్కూల్‌ ‘యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌రెన్‌ కాలిఫోర్నియా(యూఎస్‌సీ)’కు కళ్యాణ్‌ దరఖాస్తు చేశాడు. 2015 జనవరిలో అక్కడికెళ్లి హాలీవుడ్‌ ప్రయాణం మొదలుపెట్టాడు. ఆస్కార్‌ విజేత ‘మైక్‌ ఫింక్‌’ యూఎస్‌సీ ఫిల్మ్‌ విభాగం హెడ్‌గా ఉండటంతో కళ్యాణ్‌లోని ప్రతిభ వెల్లివిరిసింది. ఆ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ సొసైటీ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం దక్కడం అతడి పనితనానికి నిదర్శనంగా నిలిచే అంశం. ఈ నాలుగేళ్ల కాలంలో 20 షార్ట్స్‌ స్క్రిప్ట్స్‌, 3 ఫీచర్‌ ఫిల్మ్స్‌, 6 లఘుచిత్రాలకు దర్శకత్వం వహించడంతోపాటు 12 చిత్రాలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌గా పనిచేశాడు.

-  మల్యాల సత్యం, ఈనాడు, హైదరాబాద్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు