చివరిగా ఒక్క మాట.!

‘నేనే ఎందుకు చేయాలి? తనెందుకు చేయదు?’ తొమ్మిదేళ్లుగా నాలో ఇదే మథనం. చాలాసార్లు ‘హాయ్‌’ అని మెసేజ్‌ టైప్‌ చేసేవాణ్ని. సెండ్‌ చేయకుండానే డిలీట్‌ చేసేవాణ్ని. భయం, ఇగో.. కారణం ఏదైనా ఇదే తంతు. నా ఇబ్బందిని పైనున్న దేవతలు గమనించారేమో! నేను కోరుకున్నట్టే మే 21న ఆ అమ్మాయి నుంచి ‘హలో’ అనే సందేశం వచ్చింది....

Published : 31 Aug 2019 00:33 IST

‘నేనే ఎందుకు చేయాలి? తనెందుకు చేయదు?’ తొమ్మిదేళ్లుగా నాలో ఇదే మథనం. చాలాసార్లు ‘హాయ్‌’ అని మెసేజ్‌ టైప్‌ చేసేవాణ్ని. సెండ్‌ చేయకుండానే డిలీట్‌ చేసేవాణ్ని. భయం, ఇగో.. కారణం ఏదైనా ఇదే తంతు. నా ఇబ్బందిని పైనున్న దేవతలు గమనించారేమో! నేను కోరుకున్నట్టే మే 21న ఆ అమ్మాయి నుంచి ‘హలో’ అనే సందేశం వచ్చింది. ఆ క్షణం చూడాలి నా ఆనందం. పాదాలు నేలపై ఉంటే ఒట్టు. తొమ్మిదేళ్లుగా నన్నంత వేదనకు గురి చేసిన ఆ అమ్మాయి శాన్వీ. మామయ్య కూతురు. మేం పుట్టగానే కాబోయే భార్యాభర్తలన్నారు పెద్దలు. ఆ మాట మనసులో నాటుకుపోయింది. వయసుతోపాటు తనపై ఇష్టం పెరుగుతూ వచ్చింది. అదెంత గాఢంగా మారిందంటే నేను మరో అమ్మాయితో మాట్లాడ్డమూ తప్పే అన్నంత. ఇంత ప్రేమ ఉన్నా వ్యక్తం చేయడానికి భయపడేవాణ్ని.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా. మామయ్య కష్టపడి డబ్బులు సంపాదించి పట్టణంలో స్థిరపడ్డారు. అదేసమయంలో కొన్ని కారణాల వల్ల మా కుటుంబంతో పొరపొచ్చాలొచ్చాయి. రోజులు గడిచేకొద్దీ మా మధ్య దూరం పెరుగుతోంది. ఈ సమయంలో పిడుగులాంటి వార్త. శాన్వీకి పెళ్లి చేసేందుకు మామయ్య వేరే అబ్బాయిని చూశారని తెలిసింది. ఏడవడం తప్ప ఏమీ చేయలేని దుస్థితి. అప్పుడు డిగ్రీ ఫైనలియర్‌లో ఉన్నా. చదువింకా పూర్తి కాకముందే ‘శాన్వీని నాకిచ్చి పెళ్లి చేయండి’ అని ఎలా అడిగేది? అదిగో అప్పుడే ‘ఉద్యోగం వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోన’ని తెగేసి చెప్పిందట శాన్వీ. నాకు పెద్ద రిలీఫ్‌. ఆపై నా కర్తవ్యమేంటో బోధ పడింది.

డిగ్రీ అయిపోగానే ప్రభుత్వోద్యోగమే లక్ష్యంగా హైదరాబాద్‌ వచ్చేశా. కొలువు కొడితే మామయ్యతో మా పెళ్లి చేయమని అడగాలని. కానీ ఏం లాభం? ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. మరింత సమయం వృథా చేయొద్దని ఎలాగోలా కష్టపడి ఓ ప్రైవేటు సంస్థలో జాబ్‌ సంపాదించా. శిక్షణలో ఉండగా చెల్లి పెళ్లి జరిగింది. అత్తమ్మ, మామయ్యలతో పాటు శాన్వీ వచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత తనని చూడటం. సంతోషంతో నోట మాట రాలేదు.

తను మా ఇంటినుంచి తిరిగెెళ్లిన రోజే ఈ ‘హలో’ అని మెసేజ్‌. కాసేపు కుశల ప్రశ్నలయ్యాక ‘మీ చెల్లి పెళ్లిలో అందరూ నీ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. నువ్వు సెటిల్‌ అయ్యావు. నాకూ ఉద్యోగమొచ్చింది. నీకు నేనంటే ఇష్టముంటే బావని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెబుతా’ అంది. కోరుకున్న దేవతే నాముందుకొచ్చి నీకేం వరం కావాలన్నట్టుగా ఉంది నా పరిస్థితి. ‘చిన్నప్పట్నుంచీ నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం’ అన్నా. ‘అయితే ఒక్కసారైనా నాతో మాట్లాడావా..? కనీసం మెసేజ్‌ పెట్టావా..?’ అని చిరుకోపంతో కసురుకుంది. అలా మా మనసులు కలిశాక పెద్దల్ని ఒప్పించడానికి సన్నద్ధమయ్యాం.
మర్నాడే మామయ్యకి ఫోన్‌ కలిపా. ‘ఇద్దరూ కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. కొన్ని నెలలపాటు ఏం ఆలోచించకుండా పనిపై శ్రద్ధ పెట్టండి. తర్వాత పెళ్లి విషయం మాట్లాడదాం’ అన్నారు. అభయమిచ్చినట్టేనని ఆనందపడ్డా. కానీ కొద్దిరోజుల తర్వాత శాన్వీతో ఓ మాటన్నారట. ‘అబ్బాయి మంచోడే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకొచ్చే తక్కువ జీతంతో మీరు సర్దుకుపోగలరా?’ అని. కూతురిపై ఆయనకున్న ప్రేమ అలా మాట్లాడించి ఉండొచ్చు. అందులో తప్పేం లేదు. కానీ మామయ్యా మీకో మాట చెబుతున్నా. నా సంపాదనతో శాన్వీ అడిగినవన్నీ కొనిపెట్టలేకపోయినా తనకెలాంటి లోటు లేకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్నాను. మీతో పోటీ పడుతూ మీ కూతురికి అమితమైన ప్రేమ పంచుతానని మాటిస్తున్నాను. చివరగా నేను ఎన్ని చెప్పినా మీ సమ్మతం ఉంటేనే తనతో ఏడడుగులు నడుస్తాను. వందేళ్లు తోడుగా నిలుస్తాను. ఎందుకంటే నాది పదేళ్ల ప్రేమైతే.. మీది 23 ఏళ్ల బాధ్యత. తన పక్కన ఎవరుండాలో అందరికంటే మీకే బాగా తెలుసు. నిర్ణయం మీదే.

- మీ కార్తీక్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని