నీ మాట కోసం నిలువెల్ల కనులై..

నేను ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. రెక్కలు కట్టుకొని హైదరాబాద్‌కెళ్లా. సాఫ్ట్‌వేర్‌ కోర్సు నేర్చుకోవడానికి ఓ ఇన్‌స్టిట్యూట్‌లో చేరా. క్లాసులో కొత్తగా అనిపించింది. చేరిన నాలుగో రోజనుకుంటా... సత్యం థియేటర్‌ వైపు నుంచి ఓ అమ్మాయి... వెనకాలే ఫాలో అయ్యా....

Updated : 21 Sep 2019 04:21 IST

నేను ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. రెక్కలు కట్టుకొని హైదరాబాద్‌కెళ్లా. సాఫ్ట్‌వేర్‌ కోర్సు నేర్చుకోవడానికి ఓ ఇన్‌స్టిట్యూట్‌లో చేరా. క్లాసులో కొత్తగా అనిపించింది. చేరిన నాలుగో రోజనుకుంటా... సత్యం థియేటర్‌ వైపు నుంచి ఓ అమ్మాయి... వెనకాలే ఫాలో అయ్యా. తనకంటే వేగంగా ముందుకెళ్లి ఫోను మాట్లాడుతున్నట్టు బిల్డప్‌ ఇచ్చా.. ఆమె మోమును మళ్లీ చూడటానికి. బొమ్మరిల్లు సినిమాలో జెనీలియాని సిద్దార్థ్‌ చూశాక ‘సరిగమప..’ అనే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరులా గాలి ఏదో ఓ కొంటెరాగంతో కోరస్‌ పాడింది. ఆమె క్షణాల్లో నన్ను దాటి వెళ్లిపోయింది. ఆశ్చర్యమేంటంటే.. మేం ఇద్దరం ఒకే చోట శిక్షణ తీసుకుంటున్నాం. తను రెండో వరుసలో కూర్చుంది.. మధ్య వరుసలో కూర్చున్నానన్న మాటేకానీ.. నా మనసు మాత్రం ఎగిరి గంతేస్తోంది. తనతో మాట్లాడాలి.. కానీ, ఎలా? అసలు ఎలా పరిచయం చేసుకోవాలో తెలీని ఉద్విగ్న పరిస్థితిలో అల్లల్లాడిపోయా.
మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ చాయ్‌ కొట్టు దగ్గర తన కోసం ఎదురుచూస్తున్నా. ఎంతసేపైనా రాలేదు. మూడోరోజు కనిపించింది. ‘హలో..’ అంటూ తన దగ్గరికెళ్లి పలకరించా. ‘నేనూ మీ క్లాసే..’ అంటూ మాట కలిపా. పేరు అడిగా. ‘ప్రియానంద్‌’ అంటూ చెప్పింది. ‘సినిమా హీరోయిన్‌ పేరు కాదండీ.. నేనడిగింద’న్నా. నవ్విందంతే. ‘మీ పేరేంట’ని అడిగింది. ‘నీ పేరులో సగం’ అన్నానంతే. పజిల్‌ వేయడం నాకు నచ్చదండీ అంది. ‘నీ పేరులో ఆనంద్‌ ఉంది కదా. అదే నా పేరు’ అన్నా. ‘అవునా’ అని సన్నగా నవ్వింది. ఆమె అమాయకమైన ఆ మాటలు, అందమైన ఆ నవ్వు చూసి మతి పోయినట్లయింది.
రోజులు గడుస్తున్నాయి. మాటలూ కలుస్తున్నాయి. తన అభిరుచులు, ఇష్టాయిష్టాలు, బాల్యం.. చెప్పీచెప్పనట్లు చెప్పేది. అన్నీ బుద్ధిగా వినేవాణ్ణి. చూస్తుండగానే.. కాలానికి ఏమి తొందరయ్యిందో తెలీదు గానీ.. తన మాటలు వింటూనే.. రెండు నెలలు గడిచిపోయాయి.
ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు ముగిసే సమయమది. అనుకోకుండా నేను చెన్నైలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లాల్సి వచ్చింది. తనకి వాట్సప్‌ చేశా. రిప్లయ్‌ లేదు. ఫోన్‌ చేస్తుందనుకున్నా. చేయలేదు. నేనారోజు పనిపడి ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లలేదు. మరుసటి రోజు తను నాకెదురైంది. ‘నిన్న రాలేదే’ అని అడిగింది. విషయం చెప్పాను. అవును నువ్వేంటీ.. రిప్లయ్‌ ఇవ్వ లేదన్నా. ‘ఫోన్‌ టచ్‌ పోయింది’ అంది. మనసులో నన్ను నేను తిట్టుకున్నా. అవునూ.. సారథి స్టూడియో వైపు నుంచి ఎందుకు వస్తున్నావని అడిగా. నా ఫ్రెండు ఉంటుందక్కడ. తను రమ్మంటే వెళ్లానంది. ఇద్దరం క్లాసుకెళ్లాం. వెళ్లేప్పుడు ‘బాయ్‌.. మిస్‌ యూ’ అని చెబుతుండగానే.. ‘బస్సెక్కడ ఎక్కాలి?’ అని అడిగింది. ఎస్సార్‌నగర్‌ ఐసీఐసీఐ బ్యాంకు దగ్గరన్నా. నేనూ వస్తానంది. సరిగ్గా బస్సు సమయానికి గంట ముందు కాల్‌ చేసింది. ‘జాబ్స్‌ వస్తాయంటావా’ అంటూ భవిష్యత్తు గురించి కాసేపు... ఇంకా ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం. బస్సు వచ్చింది. తను ‘ఆనంద్‌ బై. టేక్‌ కేర్‌’ అంది. ఆ అమ్మాయినీ, అమీర్‌పేట్‌ను వదిలెళ్లటం.. అమ్మనొదిలి వెళ్లినంత బాధగా అనిపించింది. చెన్నైకి వెళ్లా. దూరమయ్యాక క్లోజ్‌ అయ్యాం. వాట్సప్‌లో రాత్రిళ్లు ఛాటింగులు మొదలయ్యాయి. ఓ రోజు తను వీడియోకాల్‌ చేసింది ఉదయాన్నే. ‘బావున్నావా..నా కోర్సు ఫినిష్‌’ అంది. ఆ తర్వాత తనకు ఉద్యోగమొచ్చింది. కాల్‌ చేసి.. కంగ్రాట్స్‌..పార్టీ ఇవ్వు అన్నాను. ‘అమీర్‌పేటకి వచ్చేయ్‌’ అంటూ నవ్వింది. ఉద్యోగాల వేటలో కాలం గడిచిపోతోంది. తననుంచి వాట్సప్‌ మెసేజ్‌లు లేవు. నేను చేసినా రిప్లయ్‌ లేదు. అదృష్టం కొద్దీ ఉద్యోగమొచ్చింది నాకు. తొలిమాట తనకే చెప్పాలని కాల్‌ చేశా. స్పందనలేదు. ఐదారుసార్లు చేశా. లిఫ్ట్‌ చేయలేదు. ఏదైనా సమస్యేమో అని మెసేజ్‌ చేశా. ఆ రోజు రాత్రి ‘నువ్వు నాకు వెరీ స్పెషల్‌’ అని వాట్సప్‌ చేశా. మెసెంజర్‌లో కూడా ఇదే పెట్టా. మరుసటి రోజు కాల్‌ చేసి.. ‘కంగ్రాట్స్‌ ఆనంద్‌’ అంది. యోగక్షేమాలు అడుగుతోంటే.. తనలో ఏదో మార్పు వచ్చిందనిపించింది. ‘అవునూ.. నువ్వు నాకు వెరీ స్పెషల్‌’ అన్నావెందుకు అంది. తర్వాత చెప్తానని ఫోన్‌ పెట్టేశా. మరుసటిరోజు చాలాసార్లు ఫోన్‌ చేశా. స్పందన లేదు. తన దగ్గర నుంచి కాల్‌ వస్తుందేమోనని వేచి చూస్తూనే ఉన్నాను. ఇప్పటికీ రాలేదు.
‘నీ గురించి అన్ని విషయాలు పంచుకున్నావ్‌. ఏ సమస్య ఉన్నా చెప్పావ్‌. నువ్వు నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అన్నావ్‌. ఏమైందో చెప్పకుండా ఇలా ఒంటరిని చేశావ్‌’.
నువ్వు మారిపోయావా?నన్ను మర్చిపోయావా..?

-నీ ‘ప్రియ’మైన ‘ఆనంద్‌’


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని