వాడి మాటగా చెబుతున్నా..

హాల్లో ఉన్న నాకు వాడి మాటలు వినిపిస్తున్నాయి. బహుశా నేను లేననుకున్నాడేమో! ‘... నాన్న ఏమనుకుంటున్నారు. నేనేమైనా చిన్నపిల్లాడినా? నాకు ఏది మంచో ఏది చేడో తెలియదా? వాళ్లు

Published : 14 Nov 2020 00:14 IST

హాల్లో ఉన్న నాకు వాడి మాటలు వినిపిస్తున్నాయి. బహుశా నేను లేననుకున్నాడేమో! ‘... నాన్న ఏమనుకుంటున్నారు. నేనేమైనా చిన్నపిల్లాడినా? నాకు ఏది మంచో ఏది చేడో తెలియదా? వాళ్లు ప్రేమించుకున్నారు. నన్ను నమ్మి వచ్చారు. ఒక్క పూట ఉండి వెళ్లిపోతారు.. ఆయన అడ్డుచెప్పరనే నమ్మకంతో ఇంటికి తీసుకొచ్చా. వాళ్లేమనుకుంటారు. నేను ఇప్పుడు వాళ్లకి ఏం చెప్పాలి..’ ఇలా ఏవేవో పెద్ద పెద్ద మాటాలు చాలానే. వాళ్ల అమ్మ ఏదో చెప్పడానికి ప్రయత్నించినా.. పట్టించుకోకుండా టేబుల్‌పై కారు తాళాలు తీసుకుని బయటికి వచ్చాడు. నన్ను చూసి చూడనట్టుగా విసురుగా వెళ్లిపోయాడు. నేను పిలిచినా వినిపించుకోకుండా వాళ్లని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయాడు. వాడి ఆవేశంలో అర్థం ఉంది గానీ.. ఆలోచనల్లో పరిపూర్ణత లేదు. ఆ విషయం వాడికి అర్థం కావడానికి టైమ్‌ పడుతుందని సరిపెట్టుకున్నా. వాడితో పాటే బయటికి వచ్చిన నా భార్య ముఖంలో ఆందోళన. వాడి వయసు అలాంటిది. సాయంత్రానికి కాస్త చల్ల బడతాడు. అప్పుడు మాట్లాడదాంలే అని న్యూస్‌ పేపర్‌ అందుకున్నా. కాసేపటికి  టేబుల్‌పై ఫోన్‌ రింగ్‌ అయ్యింది. ఏదో కొత్త నెంబర్‌. లిఫ్ట్‌ చేశా. ‘మీ అబ్బాయికి కారు యాక్సిడెంట్‌ అయ్యింది. హాస్పిటల్‌లో ఐసీయూలో ఉన్నాడు. మీరు త్వరగా రండి..’ అని విన్న మాటలకు నా తల తిరిగింది. స్కూటర్‌పై వెళ్తున్న నాకు వాడి ఆలోచనలే. మొదట్నుంచీ స్నేహితులంటే ప్రాణం వాడికి. ఎప్పుడూ ఇద్దరు ముగ్గురు స్నేహితులు ఇంటికి వచ్చేవారు. ఒక్కడే కొడుకు కావడంతో.. ఎప్పుడూ వాడి స్వేచ్ఛకి అడ్డుపడలేదు. చదువులో చాలా చురుకు. ఇంజినీరింగ్‌లో ఉండగానే ఓ స్టార్టప్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేశాడు. ఇప్పుడు ఓ మల్టీనేషనల్‌ కంపెనీ నుంచి పెట్టుబడులు సేకరించే పనిలో ఉన్నాడు. ఇంతలోపే ఇలా అవుతుంది అనుకోలేదు.
ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న వాడిని చూస్తుంటే గుండె చెరువైంది. కోమాలోకి వెళ్లిపోయాడు. పక్క గదిలోనే స్వల్ప గాయాలతో వాడు ఇంటికి తీసుకొచ్చిన జంట. అప్పటికే వాళ్ల పేరెంట్స్‌ కూడా వచ్చారు. కాసేపటికే వాళ్లిద్దరూ ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. నా కొడుకు మాత్రం కదల్లేని స్థితిలో ఉన్నాడు. రోజులు వారాలయ్యాయి.. వారాలు నెలలు అయ్యాయి. చివరికి ఏడాది తర్వాత స్పృహలోకి వచ్చాడు. నోరు తెరిచి వాడు అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? వాడితో ఉన్న జంట ఎలా ఉన్నారని? వాడికి ఫ్రెండ్స్‌ అంటే అంత ఇష్టం. బాగానే ఉన్నారని చెప్పా.. కానీ, పక్కనే ఉన్న వాళ్ల అమ్మ కోపాన్ని ఆపుకోలేక.. ‘వాళ్లకేంటి ఎవరింట్లో వాళ్లు ఉన్నారు. నువ్వే ఏడాది పాటు కదలకుండా బెడ్‌పై ఉన్నావు. ఈ ఏడాదిలోనే వాళ్ల ప్రేమకి వాస్తవాల రుచి తెలిసింది అనుకుంటా. హ్యాపీగా వేరే సంబంధాలు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. కనీసం నువ్వు ఎలా ఉన్నావో అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు వాళ్లు..’ అని కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి వెళ్లిపోయింది. ఆ క్షణం నా కొడుకు ముఖంలో నేను చూసిన బాధని ఎప్పటికీ మర్చిపోలేను.
జీవితంలో సెటిల్‌ అవ్వకముందే... ఆకర్షణతో ఘర్షణ పడకుండా... అది ప్రేమేనని ఫీలయ్యి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కొందరు. కానీ, నా కొడుకు అలా కాదు. ఎదిగీ ఎదగని ఇద్దరి ప్రేమికుల్ని ఒక్కటి చేసే  ప్రయత్నంలో కదలకుండా బెడ్‌పై ఏళ్ల తరబడి గడిపాడు. విలువైన సమయం వృథా చేసుకున్నాడు. చివరిగా ఈ తరానికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. ఉరకలేసే వయసులో మీకు ఆవేశం ఉంటే.. జీవిత అనుభవసారాన్ని గ్రహించిన మాకు ఆలోచనలు ఉంటాయి. అవే మీకు చెప్పాలనుకుంటాం. క్లాస్‌ రూంలో పెద్ద పెద్ద టెక్స్ట్‌ పుస్తకాలు చూసి చెప్పే పాఠాల్ని శ్రద్ధగా విని మార్కులు తెచ్చుకోవడమే కాదు. పేరెంట్స్‌ చెప్పే జీవిత పాఠాల్నీ వినండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని