కలిసి ఉండలేను.. విడిపోనూ లేను! 

పేరెంట్స్‌కి లేకలేక పుట్టిన గారాలపట్టీని. అడక్కముందే అన్నీ నా ముందుండేవి. అంత మంచి అమ్మానాన్నల్ని ఇచ్చిన దేవుడు మరో

Updated : 13 Feb 2021 06:14 IST

పేరెంట్స్‌కి లేకలేక పుట్టిన గారాలపట్టీని. అడక్కముందే అన్నీ నా ముందుండేవి. అంత మంచి అమ్మానాన్నల్ని ఇచ్చిన దేవుడు మరో విలువైన కానుకనూ ఇచ్చాడు. తనే బాబీ. కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయం. ప్రశాంతమైన సముద్రంలాంటి నన్ను అలల్లా అల్లరి చేస్తూ నవ్వించేవాడు. ఎగసిపడే అల ఎంత బలమైందో అతడి వ్యక్తిత్వం అంతే. తనతో ప్రయాణం రోజూ పండగలా అనిపించేంది. సరదాలు, షికార్లు, చాటింగ్‌లు.. గంటలు క్షణాల్లా గడిచిపోయేవి. కొన్నాళ్లకు అది అమ్మానాన్నలు గమనించారు. అడిగారు. చెప్పక తప్పలేదు. మొదట్నుంచీ నాపై ఉన్న నమ్మకంతో నా ప్రేమకి విలువిచ్చారు. అప్పుడే అనుకున్నా.. నా తల్లిదండ్రులు నన్ను కూతురిలా కాకుండా ఫ్రెండులా చూశారని. వారిపై గౌరవం రెట్టింపైంది. ఎంతని అడిగితే.. అపురూపంగా పెంచుకున్న వారి కూతురు వయసంత!! దాని వెనకున్న పరువంత అని చెబుతాను.
మా ఇంట్లో ఓకే అని బాబీకి నిబ్బరంగా చెబుదాం అనుకునే లోపే వాళ్లింట్లో తెలిసింది. కులమో.. మతమో.. మరొకటో.. ససేమిరా ఒప్పుకోమన్నారు. తను కావాలో, మేం కావాలో తేల్చుకో అంటే.. బాబీ నేల చూపులు చూశాడు అనే ఆలోచననే నేను జీర్ణించుకోలేకపోయా. కన్నవాళ్లనీ, కడదాకా తోడుంటానని మాటిచ్చిన నన్నూ కన్విన్స్‌ చేయలేక సతమతమవుతున్న బాబీని చూడలేకపోయేదాన్ని. ఈ క్రమంలో ఎంత బాధని దిగమింగుకున్నాడో మాటల్లో చెప్పలేను. ఏదోలా వారిని ఒప్పిస్తాననే ధైర్యంతో నా చేయి వదిలేవాడు కాదు. చిన్న చిన్ని సమస్యలకే బెదిరిపోతూ.. విడిపోయేందుకు కారణాలు వెతుక్కునే పిరికి ప్రేమికులున్న ఈ రోజుల్లో.. ఆరడుగుల నమ్మకం నన్ను చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టే అనిపించేది.
జీవితం అంటే అమ్మానాన్న, నేను అని మాత్రమే తెలిసిన నాకు.. జగమంత కుటుంబం మనది అనే విశాల దృక్పథం నేర్పించాడు బాబీ. ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించే క్రమంలో ఎదురైన సమస్యల్ని ధైర్యంగా నాతోనే చెక్‌ పెట్టించాడు. ఎన్నోసార్లు మేమిద్దరం కలిసి నడుస్తూ వెళుతున్నప్పుడు భుజంపై తన చేయి ఉన్నప్పుడు.. మా నాన్న పక్కనే ఉన్నంత భరోసా ఉండేది. అంతకంటే నమ్మకమైన జంట ప్రయాణం ఏ అమ్మాయైనా వదులుకుంటుందా? నేనూ వదలొద్దనుకున్నా. కానీ.. నన్నెలా మా పేరెంట్స్‌ అపురూపంగా పెంచారో బాబీనీ వాళ్ల అమ్మానాన్నలూ అంతేగా. వాళ్లూ కొడుకును వదులుకోలేరు. నాతో ప్రేమని ఒప్పుకోరు. తను నాకు మాత్రమే సొంతం అనుకునే స్వార్థం నాకు లేదు. మరైతే.. నేనేం చేయాలి? ఎన్నో నిద్రలేని రాత్రులు నాకు సమాధానం ఇవ్వలేకపోయాయి. ఎర్రబారిన కళ్లతో ఓ నిర్ణయం అయితే తీసుకున్నా. కానీ, బరువెక్కిన గుండె మాత్రం తట్టుకోలేకపోతోంది. ఇక నిన్నే నింపుకున్న నా ప్రేమైతే ప్రతి ఊపిరిలో నీ పేరే జపిస్తోంది.  
బాబీ.. మన తల్లిదండ్రుల ప్రేమ ముందు మనం అనుకునే ప్రేమ చిన్నదిలా అనిపిస్తోంది. అలాగని మన ప్రేమ ఓడిపోయిందంటే నేను ఒప్పుకోను. నువ్వు ఎక్కడున్నా గొప్పగా, ఆనందంగా ఉండాలి. దానికి నా ప్రేమని త్యాగం చేసినా తప్పు లేదు అనిపిస్తోంది. నాకు ఇంతకు మించి మార్గం కనిపించడం లేదు. నేను నీ చేతుల్లో పెరిగి వికసించిన ప్రేమ గులాబీని. సదా.. నీ క్షేమం కోరుతూ పరిమళిస్తూనే ఉంటా. ఎప్పటికీ నీమీద ప్రేమ చావదు.. వేరొకరి మీద ప్రేమ పుట్టదు.

- ప్రేమతో.. నీ బుజ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని