సెల్యూట్‌.. సతీశ్‌

సీ.ఎస్‌. సతీశ్‌. ముప్ఫై ఏళ్ల పడుచు మాస్టారు... నాది జీతం కోసం కాక, పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దే ఉద్యోగం అనుకునే టైపు! ఆన్‌లైన్‌ క్లాసులలో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంటే తట్టుకోలేకపోయాడు... దాన్ని అధిగమించడానికి

Updated : 24 Jul 2021 01:36 IST

సీ.ఎస్‌. సతీశ్‌. ముప్ఫై ఏళ్ల పడుచు మాస్టారు... నాది జీతం కోసం కాక, పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దే ఉద్యోగం అనుకునే టైపు! ఆన్‌లైన్‌ క్లాసులలో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంటే తట్టుకోలేకపోయాడు... దాన్ని అధిగమించడానికి ఏకంగా చెట్టుపైనే ఒక డిజిటల్‌ క్లాస్‌రూం ఏర్పాటు చేశాడు... పనిపై నిబద్ధతతో దేశం దృష్టిని ఆకర్షించాడు.

కరోనా పుణ్యమాని ఇప్పుడు ఆన్‌లైన్‌ పాఠాల యుగం నడుస్తోంది. దీంట్లోనూ చాలాచోట్ల నెట్‌వర్క్‌ సమస్య. కర్ణాటకలోని కొడగు జిల్లా ముల్లూర్‌ ప్రభుత్వ పాఠశాలలోనూ ఇదే పరిస్థితి. ఏదైనా ఎత్తైన ప్రదేశంలోకి వెళ్తే సిగ్నళ్లు అందేవి. అక్కడే ప్రభుత్వ ఉపాధ్యాయుడు సతీశ్‌. ఒకటి నుంచి ఐదో తరగతులకు ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, కన్నడ బోధిస్తుంటాడు. ఫోన్‌కి సిగ్నళ్లు బాగున్నప్పుడు పాఠం చెప్పి, లేనప్పుడు నెట్‌వర్క్‌ సమస్య అని ఆ పూటకి వదిలేసేవాళ్లు తోటి ఉపాధ్యాయులు. అందరిలా ఉండటం తనకిష్టం లేదు. ఎలాగైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనుకున్నాడు.

స్కూల్‌ పక్కనే పెద్ద మామిడి చెట్టు ఉంది. 20 అడుగుల ఎత్తులో కొన్ని కొమ్మలు నరికేసి వెదురు బొంగులతో గదిలాంటి షెడ్‌ నిర్మించాడు. పాఠాలు రాసేందుకు మూడు బోర్డులు, అవి సరిగ్గా కనిపించేందుకు ఒక మొబైల్‌ స్టాండ్‌, మంచి వెలుతురు ఉండేందుకు ఒక ఫోకస్‌ లైట్‌ ఏర్పాటు చేశాడు. వర్షం పడితే నీళ్లు లోపలికి రాకుండా రెండు దృఢమైన టార్ఫాలిన్లు పైన కప్పాడు. డిజిటల్‌ క్లాస్‌రూం సిద్ధమైంది. సిగ్నళ్ల ఇబ్బంది లేకుండా పోయింది. అప్పట్నుంచి రోజూ చెట్టుపైకెక్కి ఆన్‌లైన్‌ బోధన చేయసాగాడు. రెండు నెలలు కష్టపడి, సొంత డబ్బులతోనే ఇదంతా చేశాడు. అన్నట్టు సతీశ్‌ విద్యార్థుల్లో 10మందికి మాత్రమే స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. మిగతా 12మందికి స్టడీ కార్డుల పేరుతో హోంవర్క్‌ పంపిస్తాడు. అదికూడా పిల్లలు ఇష్టపడేలా యాక్టివిటీస్‌ రూపంలో రూపొందించాడు. సతీశ్‌ పిల్లల కోసం తపిస్తున్న తీరుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక హీరోలా మారిపోయాడు. ఔను మరి.. పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దే ఇలాంటి మంచి మాస్టార్లు నిజమైన హీరోలే. 

 హ్యాట్సాఫ్‌.. సతీశ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని