Published : 02 Oct 2021 01:10 IST

మహాత్మా... నీ వెంటే మేం!

తరాలు మారినా తలరాతలు మార్చే దారేదో చూపించే ఎవర్‌గ్రీన్‌ రోల్‌మోడల్‌ గాంధీజీ...
సవాళ్ల కీళ్లు విరిచి లక్ష్యాన్ని సలక్షణంగా చేరేదెలాగో చెప్పే మార్గదర్శి బాపూజీ...
ఉరిమే ఉత్సాహంతో చెలరేగే యువతే మన జాతికి తరగని ఆస్తి అంటారు జాతిపిత...
ఈరోజే ఆ మహాత్ముడి జన్మదినం. ఆయన నుంచి మనం ఎలాంటి జీవిత పాఠాలు నేర్చుకోగలం అంటే...

సత్యానిదే జయం: అబద్ధాలు, అసత్యాలతో వచ్చే విజయం తాత్కాలికమే. ఇలాంటి వ్యక్తిత్వాన్ని ఎవరూ హర్షించరు. కొలిమి మంటల్లాంటి కష్టాల్లోనూ సత్యాన్ని వదలనివాడే ‘హీ మ్యాన్‌’ అవుతాడు. నిజాన్ని నమ్మి, ఆచరించడానికి ఎంతో దమ్ముండాలంటారు గాంధీజీ. ఆ బాటలో సాగితే విజయం పాదాక్రాంతమవుతుందంటారు.

ప్రతీకారం వద్దు: కుర్రకారులో ఉత్సాహమే కాదు.. ఆవేశమూ ఎక్కువే. చెడు చేసినవాళ్ల అంతు చూడాలనుకుంటారు. ముందూ వెనకా ఆలోచించకుండా హింసకు పాల్పడుతుంటారు. దాంతో జరిగే అనర్థాలు బోలెడు. ఇలాంటి చర్యలు లక్ష్యాలనూ దెబ్బతీస్తాయి. కన్నుకు కన్నే అయితే ఈ లోకమే గుడ్డిదైపోతుంది అంటారు గాంధీ. శాంతి, సహనమే లక్ష్యాలను ముద్దాడేలా చేస్తుంది.

మితాహారం: ఉరుకులు పరుగుల జీవితం, ఫాస్ట్‌ఫుడ్‌ తీసుకోవడం.. ఈతరం జీవనశైలిలో భాగమైంది. ఇది అనేక అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతోంది. ఊబకాయం, చిన్నవయసులోనే దీర్ఘకాలిక జబ్బుల బారిన పడుతున్నారు. మితాహారం, సమయానికి భుజించడమే దీనికి పరిష్కారం అని ఏనాడో చెప్పారు గాంధీ. ఆ అలవాటుతోనే ఏడు పదుల వయసులోనూ ఆంగ్లేయులను గడగడలాడించారు.

స్థిరత్వం: పాతికేళ్లు పైబడ్డా తామేం కావాలో చాలామంది కుర్రాళ్లకి అవగాహన ఉండదు. ఉద్యోగమనీ, వ్యాపారమనీ.. లక్ష్యాలు మార్చుకుంటూ, దిశా నిర్దేశం లేకుండా బతికేస్తుంటారు. పరాజితులుగా మిగిలిపోతారు. దీనికి భిన్నంగా కచ్చితమైన ప్రణాళిక, సవాళ్లు ఎదురైనా కుంగిపోని స్థిరత్వం ఉంటేనే లక్ష్యం చేరడం తేలికంటారు.

దృఢమైన మనసు: ఈ జనరేషన్‌కి ఆరు పలకల దేహం సాధించడం తేలిక. లక్షల జీతం కొట్టిన పిండి. కానీ చిన్న సమస్యలకే చిగురుటాకులా వణికిపోతారు. సవాళ్లను కాయలేక చావును ఆశ్రయిస్తారు. అందుకే బలమైన శరీరం కన్నా దృఢమైన మనసు కావాలంటారు జాతిపిత. మానసికంగా బలంగా ఉన్నవాళ్లకి కష్టాలు గడ్డిపోచతో సమానం.


క్షమాగుణం: తెలిసో, తెలియకో.. చాలామంది తప్పులు చేస్తుంటారు. దాన్నే మనసులో పెట్టుకుని ప్రవర్తిస్తే స్నేహితులు, సన్నిహితులు దూరం అవుతారు. పెద్దమనసుతో క్షమిస్తే వాళ్లు ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉంటారు. క్షమా గుణం ఉన్నవాళ్లని సమాజం ఉన్నతులుగా భావిస్తుంది అంటారు మహాత్ముడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు