లొంగిపోతానని.. భయమేస్తోంది!

నాదో చిత్రమైన సమస్య. ఉద్యోగం కోసం ఊరు వదిలి నగరానికొచ్చాను. సరదాలు, సినిమాలు, మందు తాగడం అలవాటయ్యాయి. కొద్దిరోజుల్లోనే ఒక రూమ్మేట్‌ క్లోజ్‌ అయ్యాడు. తను హోమో సెక్సువల్‌ అనే షాకింగ్‌ విషయం ఈమధ్యే తెలిసింది.

Updated : 30 Oct 2021 06:46 IST

నాదో చిత్రమైన సమస్య. ఉద్యోగం కోసం ఊరు వదిలి నగరానికొచ్చాను. సరదాలు, సినిమాలు, మందు తాగడం అలవాటయ్యాయి. కొద్దిరోజుల్లోనే ఒక రూమ్మేట్‌ క్లోజ్‌ అయ్యాడు. తను హోమో సెక్సువల్‌ అనే షాకింగ్‌ విషయం ఈమధ్యే తెలిసింది. సిటీలో ఇవన్నీ సహజమే అంటూ నన్ను బలవంతం చేస్తున్నాడు. తన మాటలు ఒక్కోసారి ఇబ్బందిగా అనిపించినా, మరోసారి లొంగిపోతానేమో అనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేనిప్పుడు రూమ్‌ మారే పరిస్థితి లేదు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.

- ఎస్‌.ఎస్‌.ఆర్‌. ఈమెయిల్‌

మీరు చెప్పిన వివరాలు విశ్లేషిస్తే మీకు మొహమాటం ఎక్కువని అర్థమవుతుంది. ముందు దాన్ని వదిలి ఏ విషయమైనా సూటిగా చెప్పడం అలవాటు చేసుకోండి. మీ రూమ్మేట్‌ మాటలు ఒక్కోసారి ఇబ్బందిగా అనిపించినా, మరోసారి లొంగిపోతానేమో అనిపిస్తోంది అంటున్నారు.. అంటే మీరు అతడ్ని కాదనీ, ఔననీ.. చెప్పలేని అనిశ్చిత పరిస్థితిలో ఉన్నారు. దీనికన్నా ముందు ఆ పని సరైందా? కాదా? అని మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకీ ఇదే సూత్రం వర్తిస్తుంది. కాలానుగుణంగా మన అభిరుచులు, అలవాట్లు మారొచ్చు. కానీ ఎంజాయ్‌మెంట్‌ పేరుతో మనల్ని మనం మోసం చేసుకోకూడదు. అతడు బలవంతం చేస్తుంటే మీకు ఇబ్బందిగా ఉంటోంది అంటున్నారు.. అదేసమయంలో తన బాటలో వెళ్తానేమో అని సందేహిస్తున్నారు. అంటే క్రమంగా మీ ప్రవర్తనలో మార్పు వస్తోందా? ఆలోచించండి. మీకు అమ్మాయిలను చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్స్‌ కలుగుతున్నాయి? అలాగే అందమైన మగవాళ్లను చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో ఓసారి చెక్‌ చేసుకోండి. మనోభావాలకు అనుగుణంగానే శృంగార ఆలోచనలు కలుగుతాయి. ఈరోజుల్లో స్వలింగ సంపర్కం అనేది మామూలు విషయంగా మారిపోయింది. వ్యక్తిగత పరిస్థితుల కారణంగా, కోరిక కలిగినప్పుడు మహిళ అందుబాటులో లేనప్పుడు కొందరు హోమోసెక్స్‌కి ప్రయత్నిస్తున్నారు. అనువంశిక లక్షణాల ద్వారా కూడా ఈ అలవాటు ఏర్పడవచ్చు. ఎవరు ఎలాంటి వాళ్లైనా, వారి ప్రవర్తన నచ్చకపోతే వెంటనే ‘నో’ చెప్పడమే మంచిది. మొహమాటానికి పోతే అసహజ పద్ధతులకు అలవాటు పడే ప్రమాదం ఉంది. ఈ సమస్యని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. దానికన్నా ముందు నీ తీరు నచ్చడం లేదని మీ ఫ్రెండ్‌కి వివరంగా నచ్చజెప్పి చూడండి. వినకపోతే ఆ రూమ్‌ ఖాళీ చేసి వేరే గదికి మారండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటున్నారు.. మనసుంటే మార్గాలెన్నో. గట్టిగా ప్రయత్నిస్తే డబ్బులు సంపాదించే దారులు దొరక్కపోవు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని