మనసంతా హీరోనే!

నేను సినిమా చూసిన తర్వాత ఆ ప్రభావం వారం దాకా నాపై తీవ్రంగా ఉంటుంది. ఆ హీరో నా వెంట పడుతున్నట్టు.. మేం ప్రేమించుకుంటున్నట్టు ఊహల్లో తేలిపోతుంటా. అదే ట్రాజెడీ సినిమా అయితే నా బాధ ...

Updated : 27 Nov 2021 06:11 IST

నేను సినిమా చూసిన తర్వాత ఆ ప్రభావం వారం దాకా నాపై తీవ్రంగా ఉంటుంది. ఆ హీరో నా వెంట పడుతున్నట్టు.. మేం ప్రేమించుకుంటున్నట్టు ఊహల్లో తేలిపోతుంటా. అదే ట్రాజెడీ సినిమా అయితే నా బాధ ఆపడం ఎవరితరం కాదు. హీరో చనిపోతే ఏడుపాగదు. పదేపదే తలచుకొని కుమిలిపోతుంటా. అన్నం సహించదు. ఏ పనిపై ధ్యాస పెట్టలేను. నన్ను చూసి ఫ్రెండ్స్‌ నవ్వుతున్నారు. ఎంత ప్రయత్నించినా మారలేకపోతున్నా. ఎందుకిలా?

- కీర్తన, ఈమెయిల్‌


మీ వయసెంతో తెలియజేయలేదు. సహజంగా యుక్త వయసులో ఇలాంటివి జరుగుతుంటాయి. చాలామంది అమ్మాయిలు తమని బాగా ప్రేమించే వ్యక్తి దొరకాలని, సినిమాల్లో హీరో, హీరోయిన్లలా తమ అనుబంధం ఉండాలని ఆశ పడుతుంటారు. తమ స్నేహితుల్లో ఎవరైనా అలాంటి ప్రేమికులు ఉంటే వాళ్లని రోల్‌మోడల్‌గా చూస్తారు. వాళ్లలా ఎంజాయ్‌ చేయాలని కలలు కంటుంటారు. సినిమాలు, సీరియళ్ల ప్రభావం ఎక్కువగా ఉన్నవారు ఇలా ఊహల్లో తేలిపోతుంటారు. ఆ పాత్రల్లో తమని తాము ఊహించుకొని మురిసిపోతారు. నిజ జీవితంలో సాధ్యపడని వాటిని తెరపై తమకు కనెక్ట్‌ చేసుకొని సంతోషిస్తారు. ఇలా ఊహాజనిత ప్రపంచంలో ఉన్నవారికి తీవ్రమైన భావోద్వేగాలు కూడా మొదలవుతాయి. సంతోషం, బాధ.. అధికమవుతాయి. ఇలా జరగడానికి మన సబ్‌కాన్షియస్‌ మైండ్‌ కూడా ఓ కారణం. మనం ఏదైతే ఊహించుకుంటామో, దాన్నే మెదడు.. రియాలిటీగా భావించి శరీరానికి సమాచారం చేరవేస్తుంది. దానికనుగుణంగానే ప్రతిస్పందనలు కలుగుతాయి. అందుకే ఆ ఊహా ప్రపంచం నుంచి బయటికి రావాలి. సినిమా వేరు, జీవితం వేరు అని పదేపదే మననం చేసుకోండి. మీ స్నేహితులు ఎందుకు మీలా స్పందించడం లేదని అడగండి. వీలైతే సినిమాలు చూడటం తగ్గించుకోండి. సినిమా చూసిన తర్వాత ఆ ఆలోచనలు రాకుండా ఉండేందుకు తీరిక లేని పనులు పెట్టుకోండి. ఇవన్నీ చేస్తే.. తప్పకుండా మీరు ఆ ప్రభావం నుంచి బయటపడతారు. అయినా అది జరగడం లేదంటే ఒక మానసిక నిపుణుడిని సంప్రదించండి. ఆల్‌ ది బెస్ట్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని