Published : 25 Jun 2022 00:44 IST

చీకటి జీవితాలకు వెలుగు దివ్వె

పదేళ్ల క్రితం తల్లిని కోల్పోయాడు బండారు శివప్రసాద్‌. ఆ బాధ నుంచి బయట పడటానికి మొదలు పెట్టిన చిన్న ప్రయాణం ఇప్పుడు వందలమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఒక్కడితో మొదలైన అతడి సంస్థకి 120 మంది చేతులు జతయ్యాయి. వీళ్లంతా చూపులేని విద్యార్థుల తరపున పరీక్షలు రాసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. అన్నదానం ఒక పూట కడుపు నింపితే.. అక్షర దానం జీవితాన్నిస్తుందన్న నినాదంతో ముందుకెళ్తున్న ఆ సంస్థే ‘కేర్‌ ఫర్‌ నీడ్‌’.

విశాఖపట్నం యువకుడు శివప్రసాద్‌కి అమ్మంటే ప్రాణం. దురదృష్టవశాత్తు పదేళ్ల కిందట ఆమె చనిపోయారు. ఆ బాధలోంచి బయట పడేందుకు, ఆమె గుర్తుగా చిన్నచిన్న సేవా కార్యక్రమాలు చేస్తుండేవాడు. దాంట్లో భాగంగా ఓసారి దివ్యాంగుల పాఠశాలకు వెళ్లాడు. అక్కడ చూపులేని విద్యార్థులున్నారు. కాసేపు కరెంటు పోతేనే మనం ఒక్క అడుగు ముందుకేయడానికి తడబడతాం. మరి జీవితాంతం చీకట్లో మగ్గే వారి పరిస్థితి చూసి చలించిపోయాడు. వాళ్లకి ఏదో విధంగా సాయపడాలనుకున్నాడు. ఎంతో కష్టపడి చదివినా సొంతంగా పరీక్షలు రాసుకోలేని దుస్థితి ఆ అభాగ్యులది. వారి తరపున పరీక్షలు రాయడానికి వస్తామని ఒప్పుకున్న వారు వ్యక్తిగత, వృత్తిగత సమస్యలతో హాజరయ్యేవారు కాదు. ఆ సమయంలో వాళ్లు పడే బాధ ప్రత్యక్షంగా చూశాడు. అప్పుడే ఏ విద్యార్థీ.. లేఖకులు లేని కారణంగా పరీక్షలకు గైర్హాజరు అయ్యే పరిస్థితి రాకూడదని నిశ్చయించుకున్నాడు. 2017లో మదర్‌ థెరిసా పుట్టినరోజున ‘కేర్‌ ఫర్‌ నీడ్‌’ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా ప్రస్తుతం వందల మంది విద్యార్థులకు పది, ఇంటర్, డిగ్రీ పరీక్షలు రాయిస్తున్నారు. హాల్‌టికెట్లు రాగానే పిల్లలు ఫోన్‌ చేసి ఎంత మంది లేఖకులు కావాలో చెబుతారు. దానికి తగినట్టు ఏర్పాట్లు చేస్తుంది సంస్థ. దాంతోపాటు విద్యార్థుల్ని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లే బాధ్యత సైతం వీళ్లే తీసుకుంటున్నారు. దీనికోసం పెద్దమనసుతో కొందరు ఆటోడ్రైవర్లు ముందుకొస్తున్నారు. పిల్లల తరపున పరీక్షలు రాసే వారంతా ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు, నిరుద్యోగులు, గృహిణులు. ఈ సత్కార్యంతోపాటు రక్తదానం చేయడం.. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు సరుకులు అందించడం.. కొవిడ్‌ సమయంలో ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్లు సరఫరా చేయడం లాంటివి చేశారు. వలస కార్మికులను ఆదుకున్నారు. ఈ సంస్థ కార్యక్రమాలు నచ్చి కింగ్‌జార్జ్‌ ఆస్పత్రి అనాటమీ వైద్యురాలు డా.విశ్వశాంతి పెద్ద మనసుతో సహకరిస్తున్నారు. సంస్థలోని అందరి సహకారంతోనే ఇదంతా సాధ్యమవుతోందంటున్నాడు శివప్రసాద్‌.

- టి.శారద, ఈజేఎస్‌ 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని