అభినవ యాప్‌

‘అరె మామా...  పార్ట్‌టైం ఉద్యోగం చేయాలనుకుంటున్నా ఏదైనా జాబ్‌ ఉంటే చెప్పరా!’ ‘చీజ్‌ పీజ్జా తినాలని ఉంది ఏవైనా డిస్కౌంట్‌లున్నాయేమో చూడవే!’ ‘ఈ రోజు మన కాలేజీ ఈవెంట్లు ఏంటోయ్‌...

Updated : 31 Dec 2018 17:30 IST

‘అరె మామా...  పార్ట్‌టైం ఉద్యోగం చేయాలనుకుంటున్నా ఏదైనా జాబ్‌ ఉంటే చెప్పరా!’ ‘చీజ్‌ పీజ్జా తినాలని ఉంది ఏవైనా డిస్కౌంట్‌లున్నాయేమో చూడవే!’ ‘ఈ రోజు మన కాలేజీ ఈవెంట్లు ఏంటోయ్‌....’ ప్రతి క్యాంపస్‌లోనూ స్నేహితుల మధ్య దాదాపుగా ఇవే మాటలు గలగల్లాడతాయేమో! స్నేహితులు జవాబు చెప్పినా చెప్పకపోయినా యూనీబీస్‌ యాప్‌ కచ్చితమైన సమాధానం చెబుతుందని అంటున్నాడు అభినవ్‌వర్మ కలిదిండి..  కోటి ఎనభై లక్షల రూపాయలు గెలుచుకున్న ఈ ఆలోచన ఇప్పటికే  వందలాది విశ్వవిద్యాలయాలు, లక్షలాది మంది విద్యార్థులకు చేరువయింది.

అభినవ యాప్‌

మెరికాలో ఏటా జరిగే ‘బిగ్‌ ఐడియా’ పోటీలవి. వందలాది యూనివర్సిటీల నుంచి పాల్గొనడానికి వచ్చిన పాతికవేలమందికిపైగా విద్యార్థులు. వేలాది ఐడియాలు. ఒకదానిని మించి ఒకటి. అన్నీ కుర్రకారు ఉత్సాహంలోంచి, అవసరాల్లోంచి పుట్టుకొచ్చినవే. అందులో రెండో స్థానంలో నిలిచిన ఆలోచనే యూనీబీస్‌. ఏ కాలేజీలో... ఏం జరుగుతోంది, స్టూడెంట్స్‌ ఇష్టంగా తినే చిరుతిళ్లు వాటిపై ఉన్న డిస్కౌంట్లు, తమలోని ప్రతిభను ప్రదర్శించి డబ్బు సంపాదించుకునే మార్గాలు, ఉద్యోగ వివరాల గురించి తెలిపే యాప్‌ ఇది. చాలా వడపోతల తర్వాత రెండో స్థానంలో నిలిచిన ఈ యాప్‌ టెక్సాస్‌ విశ్వవిద్యాలయాన్నీ ఒక్క ఊపు ఊపింది. ఆ విశ్వవిద్యాలయంలో ఈ యాప్‌ని వాడుకోని కుర్రకారు ఎవరూ లేరేమో! ఇంతకీ ఈ యాప్‌ని రూపొందించిన అభినవ్‌వర్మ ఆ యూనివర్సిటీ కుర్రాడే. ‘చెన్నైలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన తర్వాత.. ముంబయిలో ఏడాదిపాటు ఉద్యోగం చేశాను. ఆ తర్వాత పైచదువుల కోసం టెక్సాస్‌ యూనివర్సిటీకి వచ్చా. మన కాలేజీలకు, ఇక్కడ కాలేజీలకు ఒక తేడా కనిపించింది. మన కాలేజీల్లో ఈవెంట్స్‌ చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి. టెక్సాస్‌లో అలా కాదు. రోజూ లెక్కలేనన్ని కార్యక్రమాలు ఉండేవి. ఏ రోజు ఏ కార్యక్రమం  జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, ఎన్నింటికి జరుగుతుందో తెలిసేది కాదు. అదేదో మేమే ఆ సమాచారం తెలుసుకుని ఒక యాప్‌ తయారుచేసి అందరికీ తెలిసేలా చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాం నేను నా స్నేహితుడు ఆచంట చంద్రకిరణ్‌. అలా 2016లో ఈ యాప్‌ని ప్రారంభించాం. మా క్యాంపస్‌ వాళ్లంతా ఈ యాప్‌ని వాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇదో గొప్ప వ్యాపార ఆలోచన అవుతుందని మాత్రం అనుకోలేదు. ‘బిగ్‌ ఐడియా’లో గెలిచిన తర్వాత నమ్మకం పెరిగింది.’ అంటూ తనలో ఆలోచన పుట్టడానికి గల కారణాలు చెప్పాడు అభినవ్‌.

ఒకప్పుడు అమెరికా విశ్వవిద్యాలయాలకీ, విద్యార్థులకు మాత్రమే పరిమితం అయిన ఈ యాప్‌ ఇప్పుడు భారతీయ విద్యార్థులకూ చేరవయ్యింది. చదువు పూర్తి చేసుకుని అమెరికా వెళ్లాలనుకుంటున్నవారికీ, కొత్తగా అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఈ యాప్‌ ఓ మార్గదర్శిగా మారింది.

మెంటార్ల సాయంతో విస్తరించాం.. 
చెడార్‌ యు అనేది అమెరికాలోని అతిపెద్ద కాలేజీ కేబుల్‌ ఛానెల్‌. ఈ ఛానెల్‌ యునీబీస్‌ యాప్‌ గురించి ప్రసారం చేసి ప్రశంసలతో ముంచెత్తడం ద్వారా కోటిమంది విద్యార్థులకు ఈ యాప్‌ చేరువైంది. 
ఒకప్పుడు అమెరికా విశ్వవిద్యాలయాలకీ, విద్యార్థులకు మాత్రమే పరిమితం అయిన ఈ యాప్‌ ఇప్పుడు భారతీయ విద్యార్థులకూ చేరువైంది. చదువు పూర్తి చేసుకుని అమెరికా వెళ్లాలనుకుంటున్నవారికీ, కొత్తగా అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఈ యాప్‌ ఓ మార్గదర్శిగా మారింది. ‘మొదట్లో కొన్ని కాలేజీలకే పరిమితం అయిన మా సేవలు ప్రస్తుతం 100 విశ్వవిద్యాలయాల్లో విస్తృతంగా మొదలయ్యాయి. దీనికి కారణం మా స్టార్టప్‌ ఆలోచనను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ సహకరించిన మా కాలేజీ మెంటార్లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ(ఏఐ) చేసిన మేలనే చెప్పాలి. నేను చదువుకుంటున్న కాలేజీలో ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఆంట్రప్రెన్యూర్‌షిప్‌’ అనే విభాగం ఉంది. దాంట్లోనే ఔత్సాహిక వ్యాపారవేత్తలని ప్రోత్సహించే లాంచ్‌పాడ్‌ విభాగం ఉంది. ప్రఖ్యాత బ్లాక్‌స్టోన్‌ సంస్థ సహకారంతో ఈ విభాగం నడుస్తుంది. ఈ సంస్థ మా ఆలోచనని గుర్తించి  గత ఏడాది కోటిఎనభైలక్షల రూపాయల ఫండింగ్‌ అందుకునేలా ప్రోత్సహించింది. సంస్థ ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన ఆఫీస్‌ స్పేస్‌ కూడా అందించింది. అమెరికాలో బిలియన్‌ డాలర్‌ సంస్థలని సృష్టించిన పెట్టుబడిదార్లే మాకు పెట్టుబడులు అందించడం అంటే మాపై మరింత బాధ్యత పెరిగిందేమో అనిపిస్తుంది. ఓ పక్క యాప్‌ వ్యవహారాలు చూసుకుంటూనే మరో పక్క మా కాలేజీలోని లాంచ్‌పాడ్‌కు వచ్చే నాలాంటి యువ వ్యాపారవేత్తలకు మెంటార్‌గానూ వ్యవహరిస్తున్నాను. ఈ సేవలకుగాను గత సంవత్సరం ‘ఫ్యూచర్‌ సీఈవో’ అవార్డునీ అందుకున్నాను. ఈ క్రమంలో నాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్‌వర్క్‌ని అందిపుచ్చుకునే అవకాశం వచ్చింది. వివిధ యూనివర్సిటీల తీరుతెన్నులను అర్ధం చేసుకుంటూ అక్కడా ఈ యాప్‌ సేవలని అందించడానికి కావాల్సిన సన్నాహాలు చేసుకుంటున్నా’ అంటున్నాడు అభినవ్‌.

- శ్రీసత్యవాణి గొర్లె

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని