క్షమించు సాహితి

మేము బావామరదళ్లం. తను పుట్టగానే నా భార్య అని పెద్దలు నిర్ణయించారు. అలా ఊహ తెలిసినప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఎప్పుడూ ఒకరితో ఒకరం మనసులో మాట బయటకి చెప్పుకోలేదు. ఫోన్లో సందేశాలు పంపించుకోవడం తప్ప నువ్వంటే నాకిష్టం అని ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడుకోలేదు....

Published : 16 Feb 2019 00:34 IST

మనసులో మాట! 

మేము బావామరదళ్లం. తను పుట్టగానే నా భార్య అని పెద్దలు నిర్ణయించారు. అలా ఊహ తెలిసినప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఎప్పుడూ ఒకరితో ఒకరం మనసులో మాట బయటకి చెప్పుకోలేదు. ఫోన్లో సందేశాలు పంపించుకోవడం తప్ప నువ్వంటే నాకిష్టం అని ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడుకోలేదు. ఎప్పుడో చిన్నప్పుడు అనుకుంటే ఇప్పుడు వివాహం చేస్తారా? అని ఇద్దరిలో సందేహం ఉండేది. 2017లో తను ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం. నేను ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాను. అనుకున్నట్టుగానే మా పెళ్లి గురించి చర్చలు మొదలయ్యాయి. ‘ఇంకా నా చదువు పూర్తికాలేదు. ఉద్యోగం రావడానికి ఆలస్యమవుతుంద’ని వాళ్ల కుటుంబ సభ్యులతో చెప్పాను. దీంతో తనకు వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఎన్ని చూసినా తను ఒప్పుకోలేదు. ఎందుకంటే తను నన్ను ప్రేమించింది. ‘చేసుకుంటే బావనే చేసుకుంటాను లేకపోతే లేద’ని పట్టుపట్టింది. తన ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. వాళ్లమ్మా నాన్నలపై ఉన్న కోపంతో చాలా రోజులు తను అన్నం మానేసింది. చిక్కిపోయింది. నీరసించింది. తన చెల్లి ద్వారా ఈ విషయం నాకు తెలిసి బాధపడ్డాను. అప్పుడు అర్థమైంది నన్ను ఎంతగా ప్రేమిస్తోందో! వెంటనే ఉద్యోగం సంపాదించి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. చదువు పూర్తికాక ముందే క్యాంపసు ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించాను. వాళ్లింట్లో మాట్లాడాను. ఇద్దరి కుటుంబాలు పెళ్లికి ఓకే అన్నాయి. అలా పెళ్లి కుదిరిన ప్రేమికులం అయ్యాం. రోజులు క్షణాల్లా గడుస్తున్నాయి. క్షణాలు ప్రేమ రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి. పెళ్లి కుదిరాక... మొదటి ప్రేమికుల రోజు(2018 ఫిబ్రవరి 14). సంతోషంగా తనతో గడపాలనేది నా కోరిక. నేను ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉండేవాడిని. ప్రేమికుల రోజున బెంగళూరు రమ్మని తనకి ఫోన్‌ చేశాను. ‘నేను రాలేను బావా! వస్తే బావుండదు’ అంది. ఆమెపై కోపడ్డాను. మాట్లాడకుండా ఫోన్‌ కట్‌ చేశాను. ఎంత బాధపడిందో. నాతో చెప్పకుండా ఫిబ్రవరి 13 రాత్రి విశాఖపట్నం నుంచి బయలుదేరి బెంగళూరుకు పయనమైంది. ఫిబ్రవరి 14 తెల్లవారు జామున తన ఫోన్‌ కాల్‌ వచ్చింది. నిద్రలో ఉండటంతో అలారం అనుకుని కట్‌ చేశాను. పదే పదే ఫోన్‌ మోగటంతో మెలకువ వచ్చింది. తన మీద కోపం తగ్గలేదు. కాల్‌ లిఫ్ట్‌ చేయలేదు. అరగంట తరువాత మళ్లీ కాల్‌. కోపంగా మాట్లాడబోయా.. అయితే అవతల ఎవరిదో పెద్దాయన గొంతు వినిపించింది. రోడ్డు ప్రమాదంలో తన తలకు గాయమైందని చెప్పాడు. ఆసుపత్రికి చేరుకున్నాను. తలకు పెద్ద దెబ్బ తగిలింది. మతిస్థిమితం కోల్పోయింది. ఇంక ఎవరినీ గుర్తుపట్టకపోవచ్చని డాక్టర్‌ చెప్పాడు. ఈ లోకంలోనే తనున్నా... తన లోకం వేరైంది. ఈ విషాదం నన్ను కన్నీళ్లలో తడుపుతూనే ఉంది. సంవత్సరం అయినా నాలో రగిలిపోతున్న అగ్ని పర్వతం ఆరడం లేదు. నా వల్ల తను ఇలా అయింది. నేను రమ్మనకపోతే, తనని బలవంతం చేయకపోతే... ఈపాటికి ఇద్దరం హాయిగా పెళ్లి చేసుకొని ప్రేమికుల రోజు జరుపుకొనేవాళ్లం. సాహితి నువ్వంటే నాకిష్టం(ఐ లవ్‌ యూ) అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది. నన్ను క్షమించమని నా ప్రేమ సాక్షిగా నీ ముందు మోకరిల్లాలని ఉంది.

- సారథి (పేర్లు మార్చాం)

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని