ఐడియాలందు స్టార్టప్‌ ఐడియా వేరయా!

కాలేజీ రోజుల్లో కావచ్చు.. కంపెనీల్లో కసిగా పని చేసేటప్పుడు కావచ్చు.. ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అంకుర సంస్థల్లోకి అడుగు పెట్టేస్తారు. కొద్ది రోజుల్లో.. నెలల్లో అమాంతం ఎదిగిపోవాలనుకుంటారు. కానీ, వాస్తవాలు వేరు.

Published : 30 Mar 2019 00:25 IST

స్టార్టప్‌ కోచ్‌

కాలేజీ రోజుల్లో కావచ్చు.. కంపెనీల్లో కసిగా పని చేసేటప్పుడు కావచ్చు.. ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అంకుర సంస్థల్లోకి అడుగు పెట్టేస్తారు. కొద్ది రోజుల్లో.. నెలల్లో అమాంతం ఎదిగిపోవాలనుకుంటారు. కానీ, వాస్తవాలు వేరు. స్టార్ట్‌ చేసిన వాటిలో 99 శాతం అంకుర సంస్థలు ఆవిరైపోతున్నాయి. చిగురిస్తున్నవి కేవలం 1 శాతమే!! మరైతే, ఐడియాలన్నింటిలోనూ స్టార్టప్‌ ఐడియాల్ని వేరు చేసి చూడడం ఎలా?

బుద్ధి బలంతో చూడాలి
అంగబలం, అర్థబలం కంటే బుద్ధిబలం గొప్పది. అలా బుద్ధిబలంతో రూపుదిద్దుకున్నవే నేడు ప్రపంచ దిగ్గజ కంపెనీలుగా స్థిరపడ్డాయి. ఓ హాస్టల్‌ గదిలో సరదాగా మొదలైన గూగుల్‌.. ఇద్దరి మెదళ్ల నుంచి పుట్టి కోట్లాది మందికి చేరువైన వాట్సాప్‌.. లక్షల మంది ప్రయాణికులకు పరిచయమైన రెడ్‌బస్‌.. లాంటివి మరెన్నో కంపెనీలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. స్టార్టప్‌ తరం దీన్ని ఎప్పుడూ మననం చేసుకోవాలి. కేవలం ఆర్థికంగా స్థిరపడాలనే కోరికతో స్టార్టప్‌ని నెలకొల్పితే మిగిలేది బౌన్స్‌ అయ్యే చెక్‌లు.. నిండుకున్న ఎకౌంట్‌లు.

కంఫర్ట్‌ జోన్‌ దాటాలి
మీ కళ్లెప్పుడూ కంఫర్ట్‌ జోన్‌ని దాటి చూడగలగాలి. అప్పుడే సమస్యలు కనిపిస్తాయి. ఉదాహరణకు ట్రావెలింగ్‌ ఇష్టమైతే ఇప్పుడున్న సౌకర్యవంతమైన ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ని దాటి ఆలోచించాలి. ఉన్న వసతులు చాలు అనుకుంటే నిశితంగా దాగి ఉన్న సమస్యలు కనిపించవు. టికెట్టు బుకింగ్‌ మొదలు.. హోటళ్లలో బస చేయడం.. సంస్కృతీ సంప్రదాయాలు.. ఇలా ట్రావెలింగ్‌లో ఎదురయ్యే అన్ని రంగాల్ని నిశితంగా పరిశీలిస్తేనే ఐడియాలందు స్టార్టప్‌ ఐడియా వేరుగా పుడుతుంది.

పరిష్కారమవ్వాలి
లక్షల, కోట్ల మంది ప్రజానికం జీవన ప్రమాణాల్ని మెరుగు పరిచే అదృష్టం మీ ఐడియాకి ఉందో, లేదో చెక్‌ చేసుకోవాలి. ఉంటే.. సక్సెస్‌ చవిచూస్తున్న 1 శాతంలో మీ ఆలోచన ఉంటుంది. సమస్యని గుర్తించి మీరో పరిష్కారం అయినప్పుడు మీ ఆలోచన గొప్పదని అర్థం. అలా పురుడు పోసుకున్న ఆలోచనకి చావు ఉండదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా దూసుకెళ్తుంది. చరిత్రలో మీకంటూ ఓ పేజీని మిగుల్చుతుంది.

చర్చించాలి
మన ఆలోచనా పరిధి నుంచే ఐడియా పుడుతుంది. గొప్పగా అనిపిస్తుంది. కానీ, అదెంత పరిపూర్ణమైనదో తెలియాలంటే మీరు గీసుకున్న గీత దాటి వెళ్లాలి. ఇంట్లో వాళ్లతోనో.. ప్రియ మిత్రులతోనో.. అధ్యాపకులతోనో చర్చించండి. మీకొచ్చిన ఆలోచన స్టార్టప్‌లా నిలదొక్కుకోగలదో లేదో తెలుసుకోండి. ఇతరులతోనే కాదు.. మీతో మీరే తర్కించుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఎత్తుగా బలంగా ఉంది కదాని.. ఏనుగుని ఎక్కి వేగంగా స్వారీ చేయాలనుకుంటే ఉన్నచోటే ఎత్తులో ఉంటారుగానీ.. ఎత్తుకి ఎదగలేరు.

సంపద సృష్టించాలి

మీకొచ్చిన ఆలోచన మీకు సంపాదన తెచ్చి పెట్టేదైతే అది కిరాణా వ్యాపారం. అదే ఆలోచన ఎంతో మందికి ఉపాధిగా మారితే. అది పారిశ్రామిక విధానం. మీదైన ఐడియా ఈ రెండిటిలో దేనికి చెందుతుందో చెక్‌ చేసుకోవాలి. సంస్థగా ఎదగాలంటే సంపద సృష్టించే శక్తి ఐడియాకి ఉండాలి. అప్పుడే మీరో పారిశ్రామికవేత్తగా మార్కెట్‌లో నిలబడతారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని