దివాలా నుంచి వందల కోట్లకు!

అమీన్‌ కుటుంబం వ్యాపారరీత్యా గుజరాత్‌ నుంచి వచ్చి నిజామాబాద్‌లో.. తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడింది. పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ.. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్‌లో బీటెక్‌, మాస్టర్స్‌ పూర్తి చేశాడు. తిరిగొచ్చాక ఈ-కామర్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌మీడియా మార్కెటింగ్‌, సెర్చ్‌ఇంజిన్‌ మార్కెటింగ్‌..

Published : 06 Aug 2022 01:06 IST

చేతికి స్మార్ట్‌వాచీ.. బ్యాగులో పవర్‌బ్యాంకు.. మెడలో నెక్‌బ్యాండ్‌.. ఇవి లేకుండా కుర్రకారుకి రోజు గడవని కాలమిది! వీటి అమ్మకాల్లో ముందున్న దేశీయ కంపెనీ ఏదంటే గుర్తొచ్చేది ‘పీట్రాన్‌’... ఈ సంస్థ వ్యవస్థాపకుడు అమీన్‌ ఖ్వాజా మన హైదరాబాదీనే. దివాళా స్థాయి నుంచి వందల కోట్ల టర్నోవరు కంపెనీగా తీర్చిదిద్దిన ఆంత్రప్రెన్యూర్‌ తను. ఈ విజయానికి గుర్తుగా అవార్డులూ పలకరించాయి. తను ఎదిగిన ప్రయాణాన్ని ఈతరంతో పంచుకున్నాడు.

అమీన్‌ కుటుంబం వ్యాపారరీత్యా గుజరాత్‌ నుంచి వచ్చి నిజామాబాద్‌లో.. తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడింది. పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ.. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్‌లో బీటెక్‌, మాస్టర్స్‌ పూర్తి చేశాడు. తిరిగొచ్చాక ఈ-కామర్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌మీడియా మార్కెటింగ్‌, సెర్చ్‌ఇంజిన్‌ మార్కెటింగ్‌.. విభాగాల్లో ప్రముఖ కంపెనీల్లో కొన్నేళ్లు పని చేశాడు. దీనికి ముందు టీనేజీలోనే దాదాపు 200 కంపెనీలకు వెబ్‌సైట్లు రూపొందించి ఇచ్చాడు. ఈ అనుభవంతో 2011లో సొంత కంపెనీ ప్రారంభించాలనుకున్నాడు. బ్లూటూత్‌ స్పీకర్లు, హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌ఫోన్స్‌ వాడకం అప్పుడప్పుడే ఊపందుకుంటోంది. ఒక బ్రాండెడ్‌ బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ ధర కనీసం రూ.1,500గా ఉండేది. స్థానికంగా తయారయ్యేవి తక్కువ ధరకే దొరికినా నాణ్యత ఉండేది కాదు. ఈ అంతరాన్ని పూరించాలనుకున్నాడు. కొన్ని దేశీయ కంపెనీలను సంప్రదించి ‘కొంచెం ధర ఎక్కువైనా ఫర్వాలేదు. నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసి ఇవ్వండి. అమ్మే బాధ్యత నాది’ అన్నాడు. వాళ్లు గిట్టుబాటు కాదన్నారు. ప్రత్యామ్నాయం గురించి కొన్నాళ్లు మార్కెట్లో అధ్యయనం చేశాడు. ఆపై గ్యాడ్జెట్స్‌ విడిభాగాలు తయారు చేసే చైనా కంపెనీలను సంప్రదించాడు. అక్కడి నుంచి నాణ్యమైన విడిభాగాలు తీసుకొచ్చి ఇక్కడ బిగించి ‘లేటెస్ట్‌వన్‌ డాట్‌కామ్‌’ అనే వెబ్‌సైట్‌ ద్వారా అమ్మేవాడు. అందుకోసం తన రెండు గదుల ఇంటినే అసెంబ్లీ యూనిట్‌గా మార్చేశాడు. ప్రతి ప్రొడక్ట్‌కి వారంటీ ఇచ్చేవాడు. మంచి నాణ్యత, ధర తక్కువగా ఉండటంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక దశలో ఈ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌కి గట్టి పోటీనిచ్చే స్థాయికి ఎదిగింది. కానీ కొన్నాళ్లకే ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, గృహోపకరణాల ఉత్పత్తులతో సహా అన్ని విభాగాల్లోకి ప్రవేశించాయి. వందల కోట్లు కుమ్మరించి భారీ ఎత్తున మార్కెటింగ్‌ చేశాయి. ఆ పెద్ద సంస్థలతో పోటీపడలేకపోయాడు. అమ్మకాలు అమాంతం పడిపోయాయి.

కష్టాలు అధిగమించి..
ఈ గడ్డు సమయంలో తెలివిగా ఆలోచించాడు అమీన్‌. అన్ని విభాగాల్లోకి కాకుండా కేవలం స్మార్ట్‌ఫోన్‌ యాక్సెసరీలపైనే దృష్టిపెట్టి, యువతను ఆకట్టుకునే ఉత్పత్తులు తీసుకురావాలని అనుకున్నాడు. ‘పీట్రాన్‌’ బ్రాండ్‌తో ఛార్జర్లు, పవర్‌బ్యాంక్‌లు, బ్లూటూత్‌ స్పీకర్లు, నెక్‌ బ్యాండ్‌లు.. తీసుకొచ్చాడు. విపణిలో అప్పుడు టీడబ్ల్యుఎస్‌ ధర కనీసం రూ.2,500 ఉండేది. పీట్రాన్‌ బ్రాండ్‌ని రూ.999కే అందించాడు. అతడి ప్రణాళిక, నమ్మకం గురి తప్పలేదు. అమ్మకాలు మళ్లీ రాకెట్‌ వేగం అందుకున్నాయి. ఐదేళ్లు తిరిగేసరికి కంపెనీ వందల కోట్ల టర్నోవరుకి చేరింది. ‘ఉత్పత్తిదారు నుంచి నేరుగా విడిభాగాలు కొని, మా ఆర్‌ అండ్‌ డీ సెంటర్లో బిగిస్తాం. అతి తక్కువ లాభం తీసుకుని ఎక్కువ అమ్మకాలపై దృష్టి పెడతాం. అదే మా విజయ రహస్యం’ అంటున్నాడు అమీన్‌. ప్రస్తుతం ఈ సంస్థకి ముంబయి, దిల్లీ, కర్నూలులో గోదాములున్నాయి. ఈ కేంద్రాల్లో రెండు వందలమందికి పైగా ఉపాధి పొందుతున్నారు. మార్కెటింగ్‌, వ్యాపార రంగాల్లో అమీన్‌ సాధించిన ప్రగతికిగాను ‘ఫ్రాంచైజ్‌ ఇండియా’ నుంచి ‘ఆంత్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని