Updated : 17 Dec 2022 01:00 IST

అండదండల్లేకుండా.. తారాపథానికి!

బ్యాగ్రౌండు లేదు.. ఎవరి అండదండలు అస్సలే లేవు. ఉన్నదల్లా, తెరపై మెరవాలనే కోరిక ఒక్కటే. మూడేళ్లు... మెట్లు ఎక్కిదిగని సినిమా ఆఫీసే లేదు. ఎట్టకేలకు తొలి అవకాశం వస్తే.. ప్రమాదం కారణంగా అదీ ఆలస్యమైంది. సీన్‌ కట్‌ చేస్తే.. తనిప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరో. ‘లవ్‌ ఆజ్‌కల్‌’, ‘భూల్‌ భులయ్యా 2’, ‘ఫ్రెడ్డీ’ చిత్రాలతో దూసుకెళ్తున్న ఆ యువ కథానాయకుడే కార్తీక్‌ ఆర్యన్‌. అతగాడి సంగతులు..

* కార్తీక్‌ ఆర్యన్‌ అసలు పేరు కార్తీక్‌ మనీశ్‌ తివారీ. సొంతూరు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌. అమ్మానాన్నలు వైద్యులు. నాలుగేళ్లు ఉన్నప్పుడు ఓసారి దిల్లీలో తప్పిపోయాడు. రోజంతా వెతికాక మళ్లీ దొరికాడు.

* ఇంజినీరింగ్‌ కోసం నవీ ముంబయికి వచ్చి డీవై పాటిల్‌ కాలేజీలో చేరాడు. అక్కడే సినిమాతో ప్రేమలో పడిపోయాడు.  ఒడ్డూపొడుగూ బాగుండటంతో.. బీటెక్‌ పూర్తి కాకముందే సినిమా ఆడిషన్‌లకి వెళ్తుండేవాడు. ఎవరో ఇచ్చిన సలహాతో మోడలింగ్‌ నేర్చుకొని, అవకాశాల కోసం ప్రయత్నించాడు. అది వర్కవుట్‌ కాకపోవడంతో నటనలో శిక్షణ తీసుకున్నాడు. తర్వాత ‘ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌’ అంటూ మూడేళ్లపాటు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాడు. తను మొదటి సినిమాకి సంతకం చేసిన తర్వాతే ఆ విషయం అమ్మానాన్నలతో చెప్పాడు.

* కార్తీక్‌తోపాటు ఇంకో పన్నెండు మంది సినిమా ఔత్సాహికులు ఒక ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని ఉండేవారు. వాళ్లందరికీ వండి పెడుతూ వాళ్ల దగ్గర కొంతమొత్తం తీసుకొని తన ఖర్చులు నెట్టుకొచ్చేవాడు. ఓసారి ‘నటీనటులు కావలెను’ అని ఫేస్‌బుక్‌లో చూసి ఆడిషన్‌కి వెళ్లాడు. మొత్తానికి మూడేళ్ల ప్రయత్నం ఫలించి లక్కీ ఛాన్స్‌ కొట్టేశాడు. ‘ప్యార్‌ కా పంచ్‌నామా’ కార్తీక్‌ తొలి చిత్రం. ముగ్గురు కథానాయకుల్లో ఒకడిగా ఎంపికయ్యాడు.

* నాలుగేళ్ల తర్వాత ‘ప్యార్‌ కా పంచ్‌నామా 2’ భారీ విజయంతో కార్తీక్‌ ఆర్యన్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ‘లూకా చుప్పీ’, ‘లవ్‌ ఆజ్‌కల్‌ 2’, ‘భూల్‌ భులయ్యా 2’లతో.. దూసుకెళ్లాడు. ఇప్పుడు ‘ఫ్రెడ్డీ’లో అంతర్ముఖుడైన ఓ వైద్యుడి పాత్రలో ఒదిగిపోయి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు. పదేళ్ల కెరియర్‌లో ఐదారు అవార్డులూ సొంతం చేసుకున్నాడు.

* కార్తీక్‌ ఆర్యన్‌ భగ్న ప్రేమికుడు. కాలేజీలో ఉన్నప్పుడే ఒక సహాధ్యాయినితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. చదువు తర్వాత సినిమాలే నా కెరియర్‌ అని చెప్పడంతో ఆ అమ్మడు బ్రేకప్‌ చెప్పింది. తర్వాత తను సహనటి సారా అలీఖాన్‌తో ప్రేమలో పడ్డాడని చాలా వార్తలొచ్చాయి. తాజాగా కెనడా మోడల్‌ డింపుల్‌ శర్మతో డేటింగ్‌ చేస్తున్నాడని తెలుస్తోంది.

* ‘ప్యార్‌ కా పంచ్‌నామా’ ఆడిషన్‌ ఓకే అయిన తర్వాత ఆ సంతోషంతో ఓ ఆటో మాట్లాడుకొని తిరిగొస్తుండగా పెద్ద ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడటంతో కార్తీక్‌ ఆర్యన్‌ కాలు ఫ్రాక్చర్‌ అయింది. సినిమా అవకాశం పోయినట్టే అని బాధ పడ్డాడు. కానీ అదృష్టవశాత్తు నిర్మాత తన కోసం నాలుగు నెలలు ఎదురు చూశారు.

* కార్తీక్‌ టేబుల్‌ టెన్నిస్‌లో కాలేజీ ఛాంపియన్‌. పలు సినిమా కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగానూ వ్యవహరిస్తుంటాడు.

* పుస్తకాలు బాగా చదువుతాడు. కవితలు రాస్తాడు.

* ‘డర్‌’ చిత్రంలో షారుక్‌ ఖాన్‌ చేసిన పాత్రలాంటిది చేయడం అతడి కల.

* తనకి ‘హమ్మెల్‌’ అనే స్పోర్ట్స్‌వేర్‌ దుస్తుల బ్రాండ్‌ ఉంది.

* పర్యావరణం అంటే మమకారం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు కాలుష్యానికి వ్యతిరేకంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు.

* కార్లంటే మోజు. లాంబోర్ఘిని ఉరుస్‌, బీఎండబ్ల్యూ 520డీ, పోర్షె 718 బాక్స్‌టర్‌, మినీ కూపర్‌ ఎస్‌ అనే విలాసవంతమైన కార్లు అతడి సొంతం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు