రాజు చేయి వేస్తే... ఆటలో అందలమే

మానసి జోషి.. పారా బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌... శ్రీకాంత్‌ కిడాంబి.. ఒకప్పటి ప్రపంచ నెంబర్‌వన్‌. పీవీ సింధు, సాత్విక్‌ సాయిరాజ్‌, గురు సాయిదత్‌.. వీళ్లంతా ఆటలో మేటినే.

Updated : 01 Jul 2023 02:48 IST

మానసి జోషి.. పారా బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌... శ్రీకాంత్‌ కిడాంబి.. ఒకప్పటి ప్రపంచ నెంబర్‌వన్‌. పీవీ సింధు, సాత్విక్‌ సాయిరాజ్‌, గురు సాయిదత్‌.. వీళ్లంతా ఆటలో మేటినే. ప్రపంచ వేదికలపై హిట్‌ అయిన వీళ్లని ఎప్పటికప్పుడు ఫిట్‌గా ఉంచుతున్న శిక్షకుడు లోమడ రాజు. కూలీగా మొదలు పెట్టి.. పరుగుల యాత్రలో జాతీయస్థాయి పతకాలు కొల్లగొట్టి.. ఇప్పుడు భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులకు ఫిట్‌నెస్‌ శిక్షకుడిగా వెనకుండి నడిపిస్తున్న తనతో ఈతరం మాట కలిపింది.

రాజుది వైఎస్‌ఆర్‌ కడప జిల్లా చిలమకూరు. కుటుంబానికి కొద్దిపాటి పొలం ఉండేది. దానిపై వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఇతరుల పొలాల్లో కూలి పనులు చేసేవాళ్లు రాజు తల్లిదండ్రులు. చదువుకుంటూనే.. ఖాళీగా ఉన్నప్పుడు వాళ్లతో కలిసి వెళ్లేవాడు తను. ఇదికాకుండా కట్టెలు కొట్టి, వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుని అమ్మానాన్నలకు ఇచ్చేవాడు. ఈ పనుల కోసం తెల్లవారుజామునే నిద్ర లేచేవాడు. ఈ క్రమంలో ఆటల్లో మంచి ప్రతిభ చూపించినా, క్రీడాకారుడిగా రాణించినా.. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం దక్కుతుందనే విషయం తెలిసింది. దాంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. పనికి వెళ్లడానికి ముందే సాధన ప్రారంభించాడు. పంట కోసిన తర్వాత పొలాన్ని చదును చేసి దాన్నే ఒక ట్రాక్‌గా మార్చేసేవాడు. తన ఊరి నుంచి పక్క ఊరికి అలుపెరుగక పరుగెత్తేవాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ ప్రాక్టీస్‌ ఆపేవాడు కాదు. మెల్లగా పోటీల్లో పాల్గొంటూ.. రాష్ట్ర, జాతీయస్థాయి పతకాలు సాధించడం అలవాటుగా మార్చుకున్నాడు.

శిక్షకుడిగా..

ఏ క్రీడాకారుడైనా ఫిట్‌నెస్‌తో ఉంటేనే తన సత్తా నిరూ పించుకోగలడు. గాయాల పాలైనప్పుడు, ఫిట్‌నెస్‌ సరిగా లేనప్పుడు ఈ విషయం గమనించాడు రాజు. దాంతో డిగ్రీ పూర్తయ్యాక ఫిట్‌నెస్‌ కోర్సులపై దృష్టి పెట్టాడు. హైదరాబాద్‌, నాగపుర్‌లలో బీపీఈడీ, ఎంపీఈడీ పూర్తి చేశాడు. ఆపై స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌, హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌.. కోర్సులు ముగించాడు. అళగప్ప యూనివర్శిటీలో పీజీ డిప్లొమా ఇన్‌ యోగా, అన్నామలై విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ యోగా పూర్తి చేసి ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌లో పూర్తి పట్టు సాధించాడు. క్రీడాకారుడిగా జాతీయస్థాయి అవార్డులు గెలిచిన నేపథ్యం, శిక్షకుడిగా పూర్తి మెలకువలు తెలిసి ఉండటంతో.. ట్రైనర్‌గా అవకాశాలు దక్కించుకోవడం తనకి పెద్ద కష్టమేం కాలేదు. మొదటిసారి దక్షిణమధ్య రైల్వే కబడ్డీ జట్టుకు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వ్యవహరించాడు. తర్వాత రెండున్నరేళ్లు హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టుకు ట్రైనర్‌గా పని చేశాడు. అండర్‌-19, అండర్‌-23 క్రికెట్‌ జట్ల బాధ్యతలూ తీసుకున్నాడు.

భారత బాడ్మింటన్‌ జాతీయ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ సహకారంతో 2015 నుంచి భారత జట్టుకు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నాడు. సాధారణంగా జట్టుకి ముగ్గురు శిక్షకులు ఉంటారు. ఆటగాళ్లు పోటీల కోసం వెళ్లినప్పుడు వాళ్లతోపాటు రాష్ట్రాలు, దేశాలు పర్యటిస్తాడు రాజు. ఆ సమయంలో వాళ్లని ఆటకు అనుగుణంగా సమాయత్తం చేయడం తన విధి. అలా ఏదో సమయంలో దేశంలోని అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు అందరితో కలిసి పని చేశాడు. వాళ్లకి ఫిట్‌నెస్‌ పాఠాలు బోధించాడు. ఈమధ్యే ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన మానసి జోషికి సైతం రాజు శిక్షకుడిగా వ్యవహరించాడు. క్రికెటర్లు ప్రజ్ఞాన్‌ ఓజా, టి.సుమన్‌.. అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారిణి మమతా పూజారి, హైకోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య.. రాజు దగ్గర ఫిట్‌నెస్‌ శిక్షణ తీసుకున్నవారే. క్రీడాకారుల వయసు, శక్తి ఆధారంగా.. వాళ్లకి స్ట్రెంగ్త్‌, ఎజిలిటీ, బ్యాలెన్సింగ్‌, కార్డియో, ఐస్‌బాత్‌.. ఇలా రకరకాల వ్యాయామాల ద్వారా ఫిట్‌గా ఉండేలా శిక్షణనిస్తానంటున్నాడు రాజు.
ఎవరైనా సాధించొచ్చు..మారుమూల పల్లెలో పుట్టి, అంతర్జాతీయ విజేతలకి శిక్షకుడిగా మారడం మామూలు విషయం కాదు. కానీ ‘ఒక స్పష్టమైన లక్ష్యం, దానికి తగ్గ శ్రమ ఉంటే ఎవరైనా, ఏదైనా సాధించవచ్చు’ అంటున్నాడు రాజు. ‘చెమట చిందించడమే మానసిక ఒత్తిడికి మందు. యువత ఈ విషయం తెలుసుకోవాలి. నా ఎదుగుదలకు గోపీచంద్‌, బిగ్‌ సీ సంస్థ డైరెక్టర్‌ గౌతమ్‌రెడ్డి సహకరించారు’ అంటున్నాడు.
నల్లబోయిన నాగరాజు, ఎర్రగుంట్ల  


ఘనతలివీ..   

  •  2005, యూత్‌ నేషనల్‌ క్రీడా పోటీలో బంగారు పతకం.
  •  చెన్నైలో 2006లో జరిగిన జూనియర్‌ ఫెడరేషన్‌కప్‌లో జాతీయ రికార్డు. దీన్ని ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేదు.
  •  2006 సౌత్‌జోన్‌ క్రీడా పోటీల్లో.. రెండోస్థానం.
  •  2006, అలహాబాద్‌ ఆలిండియా అథ్లెట్‌ మీట్‌లో వెండి పతకం.
  •  కాఠ్‌మాండూలో జరిగిన సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన బ్యాడ్మింటన్‌ జట్టుతోపాటు బంగారు పతకం.
  • ఐర్లాండ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని